బంధుప్రీతిపై స్టార్ హీరోయిన్ తగ్గేదేలే
స్టార్ల నటవారసులు సులువుగా అపాయింట్ మెంట్లు పొందగలరేమో కానీ అవకాశాల్ని పొందలేరని అభిప్రాయపడ్డారు పూజా హెగ్డే.;
స్టార్ల నటవారసులు సులువుగా అపాయింట్ మెంట్లు పొందగలరేమో కానీ అవకాశాల్ని పొందలేరని అభిప్రాయపడ్డారు పూజా హెగ్డే. ఒకటో సినిమాకి తమకు ఉన్న పరిచయాలతో పని కావొచ్చు కానీ రెండో సినిమా మూడో సినిమాకి అవకాశాలొస్తాయని తాను అనుకోనని అన్నారు. అంతేకాదు.. ఇన్నేళ్లుగా నటిస్తున్నా తనను కూడా సంప్రదించేవారు లేరని పూజా హెగ్డే అనడం ఆశ్చర్యపరిచింది.
పరిశ్రమలో బంధుప్రీతి గురించి చర్చ సాగుతున్న క్రమంలో పూజా హెగ్డే చేసిన ప్రకటన షాకిస్తోంది. స్టార్ల పిల్లలకు ప్రత్యేక హక్కులు ఉండొచ్చు.. కానీ ప్రతిభతో నిరూపించుకున్న తర్వాతే అవకాశాలొస్తాయని పరోక్షంగా పూజా అభిప్రాయపడ్డారు. స్టార్ కిడ్స్ చిన్న వయస్సులోనే అగ్ర దర్శకనిర్మాతలను సంప్రదించగలరని, ఇది చాలా మంది ఇతర నటులకు లేని ప్రత్యేకత అని కూడా అన్నారు. పిల్లలు సులభంగా అపాయింట్‌మెంట్‌లు దక్కించుకుని దిగ్గజ ఫిలింమేకర్స్ తో మాట్లాడగలరు. కానీ.. వారు స్పందిస్తారా? అనేది సందేహమేనని అన్నారు. ఇన్నేళ్లుగా పరిశ్రమలో ఉన్న తనకు కూడా ఇదే పరిస్థితి ఉందని అన్నారు.
అయితే పూజా హెగ్డే తమిళం, తెలుగు, హిందీ పరిశ్రమలో రాణిస్తున్నా ఇప్పటికీ కొందరు దర్శకనిర్మాతలు తనను సంప్రదించలేదనే విషయాన్ని అంగీకరించారు. ఇక నటీమణులను తగ్గించేందుకు పెయిడ్ పీఆర్ విధానం ఒకటి పరిశ్రమలో ఉందని కూడా పూజా హెగ్డే వ్యాఖ్యానించారు. డబ్బులిచ్చి నటీమణులపై తప్పుడు ప్రచారం చేసే విధానాన్ని తప్ప పట్టింది. ఇలాంటి అనుభవం తనకు ఉందని తెలిపింది. అలాగే బంధుప్రీతిపై నిర్మొహమాటంగా పూజా మాట్లాడింది. కేవలం నటవారసులకే కాదు.. సీనియర్ నటీమణులకు కూడా సినిమా రంగంలో అవకాశాలు రావడం అంత సులువు కాదని పూజా అభిప్రాయపడడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తోంది. అందుకే ఈ రంగంలో దీపం ఉండగానే చక్కదిద్దుకోవాలి. పూజా ప్రస్తుతం దళపతి విజయ్ జననాయగన్ లో నటిస్తోంది. తెలుగు, హిందీలోను పలు చిత్రాల్లో అవకాశాలు అందుకుంది.