నటిని బ్లాక్‌మెయిల్ చేసిన దర్శకుడు అరెస్ట్
బీఐ హేమంత్ కుమార్ అరెస్ట్ నేపథ్యంలో కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఈ విషయమై చర్చనీయాంశం అయింది.;
సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కాస్త తగ్గాయి, కాస్టింగ్ కౌచ్ కనిపించడం లేదని అనుకుంటున్న సమయంలో ఎక్కడో ఒక చోట కేసు నమోదు అవుతూనే ఉంది. ఇటీవలే కన్నడ నటి తనను కన్నడ దర్శకుడు, నటుడు, నిర్మాత అయిన బీఐ హేమంత్ కుమార్ తీవ్రంగా హింసించాడని, ఆయన తనను లైంగికంగా వేదించడంతో పాటు, తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అంటూ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. లైంగిక వేదింపుల కేసుతో పాటు చీటింగ్ కేసు, చెక్ బౌన్స్ కేసు, బ్లాక్ మెయిల్ కేసులు నమోదు చేసిన పోలీసులు అతడిని అన్వేషించారు. ఎట్టకేలకు బెంగళూరులో రాజాజీనగర్ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. అతడు సినిమా పేరు చెప్పి మోసం చేస్తున్నట్లుగా నటి మాత్రమే కాకుండా మరికొందరు కూడా ఫిర్యాదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు
బీఐ హేమంత్ కుమార్ అరెస్ట్ నేపథ్యంలో కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఈ విషయమై చర్చనీయాంశం అయింది. సినిమా ఆఫర్‌ను ఆశ చూపి లైంగిక వేదింపులకు పాల్పడటంను తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇండస్ట్రీ పరువు తీసే విధంగా వ్యవహరించిన హేమంత్ కుమార్ పై ఇండస్ట్రీ వర్గాల వారు సైతం తీవ్ర విమర్శలు చేస్తూ, ఆయన్ను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న హేమంత్ పై ఉన్న కేసులు నిరూపితం అయితే ఖచ్చితంగా ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ హేమంత్ కుమార్ విషయమై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. మహిళ సంఘాల వారు చాలా మంది ఈయన్ను తీవ్రంగా విమర్శిస్తూ ఇండస్ట్రీ పరువు తీస్తున్నారు అంటూ అసహనం వ్యక్తం చేశారు.
కన్నడ దర్శక నిర్మాత హేమంత్ కుమార్ అరెస్ట్
నటి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో... హేమంత్ కుమార్ ఒక సినిమాను తీస్తున్నాను అని చెప్పి నటిగా తనను ఎంపిక చేయడం జరిగింది. రూ.2 లక్షల పారితోషికంకి ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందంలో భాగంగా రూ.60 వేలను ఆయన ఇచ్చాడు. మిగిలిన డబ్బు ఇవ్వక పోగా, షూటింగ్ ఆలస్యం చేస్తూ వచ్చాడు. షూటింగ్ గురించి ప్రశ్నించిన సమయంలో ఆయన తనపై వేదింపులు మొదలు పెట్టాడు. హేమంత్ షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత అశ్లీల డ్రెస్‌లు వేసుకోవాలంటూ బలవంతం చేశాడు, అలా చేయక పోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటాను అంటూ హెచ్చరించాడు. అంతే కాకుండా మనం చేసుకున్న ఒప్పందంలో ఇలాగే నటించాలని ఉందని, తాను ఏం చెబితే అది చేయకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటూ పదే పదే హెచ్చరిస్తూ, బెదిరిస్తూ వచ్చాడని హేమంత్ కుమార్ పై నటి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది.
కన్నడ నటిపై లైంగిక వేదింపుల ఆరోపణ
ముంబైకి షూటింగ్ పేరుతో తీసుకు వెళ్లి హోటల్ లో లైంగిక వేదింపులకు పాల్పడ్డట్లుగా నటి పేర్కొంది. తనతో బలవంతంగా చిత్రీకరించిన అశ్లీల సీన్స్‌ను అనుమతి లేకుండా, సెన్సార్ లేకుండానే ఆన్ లైన్ ద్వారా లీక్ చేశాడు అంటూ చెప్పుకొచ్చింది. అంతే కాకుండా షూటింగ్ సమయంలో మత్తు మందు ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు, ఆ సమయంలో ఫోటోలు, వీడియోలు తీసి వాటితో బ్లాక్ మెయిల్ చేశాడని, అందుకు ఒప్పుకోకుంటే రౌడీలతో బెదించాడని చెప్పుకొచ్చింది. నన్ను మాత్రమే కాకుండా నా తల్లిని సైతం బెదిరించాడని హేమంత్ కుమార్ పై నటి ఫిర్యాదులో పేర్కొంది. ప్రస్తుతం బెంగళూరు పోలీసులు ఈ కేసును లోతుగా విచారిస్తున్నారు. త్వరలోనే కేసును కోర్టు ముందుకు తీసుకు వెళ్తారని తెలుస్తోంది. అప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.