ఐబొమ్మ రవి అరెస్ట్ అయినా ఆగని పైరసీ.. రాజా సాబ్ కు తప్పని తిప్పలు!
సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన రాజా సాబ్ కి సంబంధించి ఒక షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.;
తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏళ్ల తరబడి వేధిస్తున్న అతిపెద్ద సమస్య పైరసీ. ఇటీవల ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడంతో, ఇకపై పైరసీకి అడ్డుకట్ట పడుతుందని అంతా భావించారు. రవి అరెస్ట్ తర్వాత టాలీవుడ్‌లో పైరసీ బెడద తగ్గుతుందని సినీ వర్గాలు, అభిమానులు ఆశపడ్డారు. కానీ అసలు కథ వేరేలా ఉంది. ప్రభాస్ నటించిన భారీ చిత్రం 'ది రాజా సాబ్' విడుదలై ఒక్క రోజు కూడా గడవకముందే పైరసీ బారిన పడటం అందరినీ షాక్ కు గురిచేస్తోంది.
సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన రాజా సాబ్ కి సంబంధించి ఒక షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికాలోని ఓహియో రాష్ట్రం డబ్లిన్ నగరంలో ఉన్న ఒక నార్త్ ఇండియన్ రెస్టారెంట్ లో ఈ సినిమాను టీవీలో ప్రదర్శిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. సినిమా విడుదలైన మరుసటి రోజే ఇలా బహిరంగంగా ఒక రెస్టారెంట్ లో పైరసీ వెర్షన్ ప్లే చేయడం చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఐబొమ్మ రవి అరెస్ట్ అయితే పైరసీ ఆగిపోతుందని అనుకోవడం పొరపాటేనని ఈ ఘటన నిరూపిస్తోంది. ఒక ఇన్ స్టాగ్రామ్ యూజర్ దీనికి సంబంధించిన వీడియోను రికార్డ్ చేసి ఆన్ లైన్ లో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. థియేటర్లలో సినిమా రన్ అవుతున్న సమయంలోనే ఇలాంటి క్లిప్పింగ్స్ బయటకు రావడం నిర్మాతలను ఆందోళనకు గురిచేస్తోంది. సాంకేతికంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా పైరసీ మాఫియా మాత్రం తన పని తాను చేసుకుపోతూనే ఉంది.
రాజా సాబ్ మూవీ పైరసీ సైట్లలో అప్ లోడ్ అయిందని తెలియడంతో ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సినిమా కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాతలు కష్టపడుతుంటే, ఇలా పైరసీ వల్ల వసూళ్లకు గండి పడుతోందని ఆవేదన చెందుతున్నారు. కేవలం ఒక వెబ్ సైట్ నిర్వాహకుడిని పట్టుకున్నంత మాత్రాన ఈ వ్యవస్థ మొత్తం అంతం కాదని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత కూడా ఇంత పెద్ద సినిమా పైరసీకి గురవ్వడం వెనుక ఇంకా ఎంతమంది ఉన్నారో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా విదేశాల్లో ఇలాంటి పైరసీ వెర్షన్లు ప్లే అవ్వడం బాక్సాఫీస్ కలెక్షన్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
మొత్తానికి పైరసీ అనేది సినిమా ఇండస్ట్రీని పట్టిపీడిస్తున్న క్యాన్సర్ లా తయారైంది. ఎన్ని చట్టాలు వచ్చినా, ఎంతమందిని అరెస్ట్ చేసినా ఏదో ఒక రూపంలో సినిమాలు ఆన్ లైన్ లోకి వచ్చేస్తున్నాయి. రాజా సాబ్ లాంటి భారీ చిత్రానికి ఇలాంటి పరిస్థితి ఎదురవ్వడం షాక్ అనే చెప్పాలి. ఇప్పటికైనా పైరసీని ప్రోత్సహించకుండా థియేటర్లలోనే సినిమా చూడాలని సినీ ప్రముఖులు విజ్ఞప్తి చేస్తున్నారు.