ట్రంప్, పుతిన్, నెత‌న్యాహుల‌పై విరుచుకుప‌డిన స్టార్ డైరెక్ట‌ర్!

ఈ నేతలు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు, యుద్ధ తత్వాలు ,అనాగరిక చర్యల వల్ల లక్షలాది మంది అమాయక ప్రజలు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Update: 2026-05-21 10:30 GMT

అంతర్జాతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కాన్స్ ఫిలిం ఫెస్టివల్ 2026 వేదిక సినిమాల ప్రదర్శనలకే కాకుండా ప్రపంచ రాజకీయాలపై నిర్భయంగా గళమెత్తే వేదికగానూ మారుతోంది. తాజాగా స్పానిష్ చిత్ర పరిశ్రమకు చెందిన లెజెండరీ దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత పెడ్రో అల్మోడోవర్ ఈ అంతర్జాతీయ వేదికపై చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. సమాజంలో జరుగుతోన్న అన్యాయాలపై ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తోన్న పాలకులపై స్పందించాల్సిన బాధ్యత సినీ మేకర్స్ , కళాకా రులపై ఎంతైనా ఉందని బలంగా నొక్కి చెప్పారు.

ప్రస్తుత ప్రపంచ రాజకీయాలు, కొందరు దేశాధినేతల వైఖరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రపంచ శాంతికి భంగం కలిగిస్తూ మానవత్వాన్ని కాలరాస్తున్న కొందరు పాలకులను రాక్షసులుగా అభివర్ణించారు. `ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభాలకు కారణమవుతున్న రాక్షసులకు వ్యతిరేకంగా మాట్లాడటం, వారిని తమ చిత్రాల ద్వారా ప్రశ్నించడం ప్రతీ ఒక్క కళాకారుడి ప్రాథమిక విధి అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పెడ్రో అల్మోడోవర్ ప్రపంచ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన ముగ్గురు కీలక నేతల పేర్లను నేరుగా ప్రస్తావించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ,రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ల రాజకీయ విధానాలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.

ఈ నేతలు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు, యుద్ధ తత్వాలు ,అనాగరిక చర్యల వల్ల లక్షలాది మంది అమాయక ప్రజలు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక దర్శకుడిగా కల్పిత కథలతో వినోదాన్ని పంచడం మాత్రమే సినిమా ముఖ్య ఉద్దేశం కాకూడదని అల్మోడోవర్ స్పష్టం చేశారు. కళ అనేది సమాజంలోని లోపాలను, పాలకుల నియంతృత్వాన్ని ఎండగట్టే శక్తివంతమైన ఆయుధమని అభిప్రాయపడ్డారు. హింసను, విద్వేషాన్ని పెంపొందించే శక్తులు ప్రపంచాన్ని పాలిస్తున్నప్పుడు కళాకారులు మౌనంగా ఉంటే అది వారు చేసే అతిపెద్ద నేరమవుతుందని హెచ్చరించారు.

భయం లేకుండా నిజాలను మాట్లాడగలిగినప్పుడే కళకు ఒక సార్థకత లభిస్తుందన్నారు. అంతర్జాతీయ వేదికపై అల్మోడోవర్ చేసిన పొలిటికల్ కామెంట్స్ కాన్స్ సర్కిల్స్ లోనే కాకుండా గ్లోబల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు హాలీవుడ్, యూరోపియన్ నటీనటులు ,దర్శకులు ఆయన వ్యాఖ్యలకు మద్దతుగా నిలుస్తున్నారు. యుద్ధాలు, మానవతా సంక్షోభాలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఒక సీనియర్ మేకర్ ఇంతటి ధైర్యంతో అంతర్జాతీయ నేతలను ప్రశ్నించడం నిజంగా అభినంద నీయమంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.

కాన్స్ 2026 వేదికగా పెడ్రో అల్మోడోవర్ ఇచ్చిన పవర్‌ఫుల్ స్పీచ్ ప్రపంచవ్యాప్త సినీ మేకర్లలో సరికొత్త సామాజిక స్పృహను రేకెత్తించింది. రాజకీయ ఒత్తిళ్లు, సెన్సార్‌షిప్ ఆంక్షలు ఎన్ని ఉన్నా? కళాకారులు ఎల్లప్పుడూ సత్యం వైపే నిలబడాలనే సందేశాన్ని ఆయన బలంగా పంపారు. మరి ఈ అంతర్జాతీయ వేదికపై రేగిన పొలిటికల్ సెన్సేషన్ రాబోయే రోజుల్లో ప్రపంచ చలనచిత్ర మేకింగ్‌లో ఎలాంటి సాహసోపేతమైన రియలిస్టిక్ చిత్రాల నిర్మాణానికి దారితీస్తుందో చూడాలి.

Tags:    

Similar News