‘పెద్ది’ టీజర్లో అసలు సర్ప్రైజ్ ఇదే..
మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘పెద్ది’ టీజర్ రానే వచ్చింది. దీని గురించి టీం ముందు నుంచి ఇస్తున్న హైప్‌లో అతిశయోక్తి ఏమీ లేదని టీజర్ చూసిన అభిమానులు అంటున్నారు.;
మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘పెద్ది’ టీజర్ రానే వచ్చింది. దీని గురించి టీం ముందు నుంచి ఇస్తున్న హైప్‌లో అతిశయోక్తి ఏమీ లేదని టీజర్ చూసిన అభిమానులు అంటున్నారు. చరణ్ లుక్, స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్స్ అన్నీ అదిరిపోయాయి. ముఖ్యంగా లాస్ట్ షాట్ అయితే ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేసింది. చరణ్ కెరీర్లో మరో ‘రంగస్థలం’ అవుతుందనే అంచనాలు ‘పెద్ది’ మీద ఉన్నాయి. ‘ఉప్పెన’ లాంటి లవ్ స్టోరీతో దర్శకుడిగా పరిచయం అయిన బుచ్చిబాబు సానా.. చరణ్ లాంటి పెద్ద స్టార్‌ను ఎలా హ్యాండిల్ చేస్తాడో అనే అనుమానాలు నిన్నటిదాకా ఉన్నాయి. ఫస్ట్ లుక్ అంచనాలకు తగ్గట్లు లేకపోవడంతో ఈ సందేహాలు బలపడ్డాయి. కానీ టీజర్‌తో బుచ్చిబాబు బాగానే మార్కులు కొట్టేశాడు. ఇక టీజర్లో మిగతా విషయాలన్నీ పక్కన పెడితే.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన అంశం ఒకటుంది. అదే.. బీజీఎం.
‘పెద్ది’కి సంగీత దర్శకుడు ఎవరో చెప్పకుండా.. టీజర్ బీజీఎం విని ఎవరు చేశారో చెప్పమంటే దేవిశ్రీ ప్రసాదో.. తమనో.. లేదంటే అనిరుధ్ రవిచందరో అని చెబుతామేమో. అలాంటి మాస్, కమర్షియల్ టచ్ ఉన్న బీజీఎం ఇచ్చాడు రెహమాన్. మామూలుగా పాటలు, బీజీఎం విషయంలో విషయంలో రెహమాన్‌ది సెపరేట్ స్టైల్. ఆయన మరీ మాస్‌గా మ్యూజిక్ చేయలేడని.. తెలుగు కమర్షియల్ సినిమాలకు ఆయన సంగీతం సూట్ కాదనే అభిప్రాయం చాలామందిలో ఉంది. మాస్ మూవీస్‌కు పని చేసేటపుడు అవసరమైతే కొంచెం కిందికి దిగాల్సి ఉంటుంది. మాస్‌ను ఉర్రూతూలగించడం కోసం వాయిద్యాల హోరు పెంచాల్సి ఉంటుంది. ఆ పని రెహమాన్ చేయడని అంటారు. ఒకప్పుడు ఎలివేషన్ సీన్లకు బాగానే మ్యూజిక్ ఇచ్చేవాడు కానీ.. గత కొన్నేళ్లలో అయితే రెహమాన్ ఈ తరహా చిత్రాలకు సంగీతం విషయంలో నిరాశపరుస్తూనే ఉన్నాడు. కానీ ‘పెద్ది’ టీజర్లో మాత్రం ఈ తరం మాస్ మ్యూజిక్ డైరెక్టర్లకు తానేమీ తీసిపోనని చాటాడు. టీజర్ ఆద్యంతం మంచి హుషారు పుట్టించే మాస్ బీజీఎం ఇవ్వడంతో మెగా ఫ్యాన్స్‌లో హుషారు వచ్చింది. ఈ సినిమాకు రెహమాన్ ఎందుకని అసంతృప్తి వ్యక్తం చేసిన వాళ్లు టీజర్ చూశాక థమ్సప్ చెబుతున్నారు. సినిమాలో పాటలు, బీజీఎం విషయంలోనూ రెహమాన్ నుంచి ఇదే ఔట్ పుట్ కోరుకుంటున్నారు.