పెద్ది సెన్సార్ కట్స్.. రన్ టైమ్ పై ఎఫెక్ట్ పడలేదా?
ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఆ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఆ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఆ చిత్రానికి U/A 16+ సర్టిఫికేట్ జారీ చేసింది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఆ మూవీ సెన్సార్ రిపోర్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సెన్సార్ వివరాల ప్రకారం.. పెద్ది మూవీకి మొత్తం 189 నిమిషాల రన్ టైమ్ లాక్ చేశారు. అంటే సినిమా 3 గంటల 9 నిమిషాల పాటు సాగనుంది. ఇటీవలి కాలంలో భారీ యాక్షన్ డ్రామాలుగా వచ్చిన సలార్, యానిమల్ తరహాలోనే ఆ చిత్రానికి కూడా లాంగ్ రన్‌టై మ్ ఉండటం ఆసక్తి కలిగిస్తోంది. అయితే సెన్సార్ బోర్డ్ సూచించిన మార్పులు, కట్స్ కారణంగా సినిమా నిడివిలో ఎలాంటి మార్పు చేయలేదని తెలుస్తోంది.
సినిమా గ్రామీణ నేపథ్యంలో సాగడం, పాత్రల నేటివిటీకి తగ్గట్టు కొన్ని రఫ్ డైలాగ్స్ ఉండటంతో బోర్డ్ కొన్ని పదాలపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా కొన్ని బూతు పదాలను మ్యూట్ చేయగా, సబ్ టైటిల్స్ లో కూడా వాటిని తొలగించనున్నట్లు తెలుస్తోంది. అలాగే సినిమాలోని ఒక ప్రత్యేక సన్నివేశంలో కనిపించే మిడిల్ ఫింగర్ విజువల్ ను నేరుగా చూపించకుండా సీజీ ఎఫెక్ట్స్‌తో కవర్ చేయాలని సూచించినట్లు టాక్ వినిపిస్తోంది.
ఇక సినిమాలోని చికిరి చికిరి పాటలో ఉన్న సరుకు సామన్ అనే లిరిక్ ను కూడా మార్చాలని సెన్సార్ బోర్డ్ సూచించిందట. దీంతో ఆ లైన్ స్థానంలో కొత్త పదాలను జత చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ మార్పు సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది. అభిమానులు మాత్రం కొత్త లిరిక్ ఏంటనే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇదే కాకుండా సినిమాలో వచ్చే రాజస్థాన్ అనే పదాన్ని, ఒక సామాజిక వర్గాన్ని ఉద్దేశించినట్లు భావించిన రిఫరెన్స్ ను పూర్తిగా తొలగించినట్లు సమాచారం.
అయితే ఇవన్నీ చిన్నపాటి మార్పులేనని, స్టోరీ ఫ్లోపై లేదా సినిమా అసలు కంటెంట్ పై పెద్దగా ప్రభావం ఉండదని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ముంబైలో నిర్వహించిన భారీ ఈవెంట్ లో విడుదల చేసిన ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. గ్రామీణ క్రీడా నేపథ్యంతో పాటు ఎమోషన్స్, యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ కలిపి దర్శకుడు బుచ్చిబాబు ఆ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్ ద్వారా క్లారిటీ వచ్చింది.
ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శివరాజ్ కుమార్, జగపతిబాబు, బొమన్ ఇరానీ, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతాన్ని ఏఆర్ రెహమాన్ అందిస్తుండగా, వృద్ధి సినిమాస్ తో పాటు ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తుండగా.. వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. మరి భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న పెద్ది బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.