పెద్ది బ్రేక్ ఈవెన్.. ఆ 5 చిత్రాలతో ఇబ్బంది ఉంటుందా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది. విడుదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకున్న ఆ చిత్రం వసూళ్ళ పరంగా కూడా సత్తా చాటుతోంది. ఇప్పటికే పలుచోట్ల డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు అందించిన ఆ సినిమా ఇప్పుడు కంప్లీట్ బ్రేక్ ఈవెన్ మార్క్ ను అందుకునేందుకు వేగంగా అడుగులు వేస్తోంది.
జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన పెద్ది మూవీ కేవలం ఆరు రోజుల్లోనే రూ.332 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మూవీ టీమ్ తాజాగా అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఈ నేపథ్యంలో సినిమా బాక్సాఫీస్ జర్నీపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఆ మూవీ పూర్తి స్థాయి విజయాన్ని ఎప్పుడు సాధిస్తుందో అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ట్రేడ్ పండితులు అంచనా ప్రకారం, పెద్దికి ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.218.50 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. అంటే డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి రావాలంటే దాదాపు రూ.220 కోట్ల షేర్ అవసరం. గ్రాస్ పరంగా చూస్తే సుమారు రూ.440 కోట్ల మార్క్ ను అందుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటివరకు వచ్చిన వసూళ్లను బట్టి చూస్తే బ్రేక్ ఈవెన్ కు చేరుకోవడానికి మరో రూ.100 కోట్లకు పైగా గ్రాస్ మాత్రమే అవసరమట.
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పెద్ది ఇప్పటికే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను సాధించినట్లు సమాచారం. ముఖ్యంగా మంచి ఆక్యుపెన్సీ నమోదు చేస్తున్న మెయిన్ సెంటర్స్ లో డిస్ట్రిబ్యూటర్లు లాభాల బాట పట్టినట్లు తెలుస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో కూడా సినిమా స్టేబుల్ గా వసూళ్లు రాబడుతుండటంతో మరో నాలుగు నుంచి ఐదు రోజుల్లో పూర్తి స్థాయిలో బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.
అయితే ఇప్పుడు అందరి దృష్టి రాబోయే రిలీజ్ లపై పడింది. జూన్ 12వ తేదీన విడుదల కానున్న సింగ్ గీతం, ఆ తర్వాత జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానున్న సమంత మా ఇంటి బంగారం, దీవానా, వడ్డే నవీన్ నటించిన ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు వంటి చిత్రాలతో పాటు డబ్బింగ్ సినిమాలు కూడా బరిలోకి దిగుతున్నాయి. ఆ కొత్త సినిమాలు ప్రేక్షకులను ఎంత మేర అట్రాక్ట్ చేస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.
ఇక జూన్ 15 నుంచి స్కూళ్లు, కాలేజీలు తిరిగి స్టార్ట్ కావడం కూడా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కు రాకపై కొంత ఎఫెక్ట్ చూపే అవకాశం ఉందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ పెద్దికి ప్రస్తుతం ఉన్న పాజిటివ్ టాక్, భారీ స్థాయిలో ఆడియన్స్ రెస్పాన్స్, ఇప్పటికే సాధించిన స్ట్రాంగ్ వసూళ్లను చూసుకుంటే పెద్దగా ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని తెలుస్తోంది.
ఏదేమైనా కొత్త సినిమాలు విడుదలవుతున్నప్పటికీ పెద్ది బ్రేక్ ఈవెన్ కు చాలా చేరువలో ఉందని, మరికొన్ని రోజుల్లో ఆ టార్గెట్ అందుకుని డిస్ట్రిబ్యూటర్లకు పూర్తి స్థాయి లాభాలు అందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పెద్ది జోరు కొనసాగుతుండటంతో పుల్ రన్ లో ఎంతటి వసూళ్లు సాధిస్తుందో అంతా వేచి చూడాలి.