పవన్ కళ్యాణ్ గారి కష్టం నా భూతో నా భవిష్యత్తు
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో రూపొందిన 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా విడుదలకు రెడీ అయింది.;
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో రూపొందిన 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా విడుదలకు రెడీ అయింది. అనుకున్న తేదీ కంటే వారం ముందుగానే విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల జోరు పెంచారు. మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సూపర్ హిట్ మూవీ ధురంధర్ కి సీక్వెల్‌గా రూపొందిన ధురంధర్ 2 విడుదల కాబోతున్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా జోరు కనిపించడం ఖాయం అంటూ ఆయన అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు. గబ్బర్ సింగ్ కాంబినేషన్ కావడంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. పవన్ కళ్యాణ్ ను సరికొత్తగా ఎనర్జిటిక్‌గా గబ్బర్ సింగ్‌లో చూపించిన హరీష్ శంకర్ ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు.
కాలరే ఎత్తరా పాట...
తాజాగా సినిమా నుంచి కాలరే ఎత్తరా అనే పాట విడుదలైంది. పాట విడుదల కార్యక్రమంలో రచయిత కాసర్ల శ్యామ్, దర్శకుడు హరీష్ శంకర్, హీరోయిన్ రాశి ఖన్నా, నిర్మాత రవి శంకర్ పాల్గొన్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో బ్యాక్ టు బ్యాక్ పెద్ద హీరోల సినిమాలు వస్తున్నాయి, వచ్చాయి. అయితే పవన్ కళ్యాణ్ తో వీరు సినిమా చేయడం లేదు అనే ఒక వెలితి ఉండేది. ఈ సినిమాతో ఆ వెలితి తీరింది. చాలా కాలం క్రితమే పవన్ కళ్యాణ్ కి మైత్రి మూవీ మేకర్స్ వారు అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని కారణాల వల్ల ఈ కాంబో మూవీ ఆలస్యం అవుతూ వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ వారు ఖర్చుకు ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మిస్తారనే టాక్ ఉంది. దర్శకుడు హరీష్ శంకర్ సైతం అదే విషయాన్ని చెప్పుకొచ్చాడు. సినిమా కోసం వారు చాలా ఖర్చు పెట్టారని హరీష్ శంకర్ అన్నారు.
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాత రవి శంకర్...
పాట విడుదల కార్యక్రమంలో నిర్మాత రవి శంకర్ యలమంచిలి మాట్లాడుతూ... గబ్బర్ సింగ్ సినిమాకు ఏమాత్రం తగ్గకూడదు అనే కసితో దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కించారు. పవన్ కళ్యాణ్ తో ఎప్పటికీ గుర్తుండి పోయే సినిమాను నిర్మించాలని అందరు కోరుకుంటారు. అలాంటి అవకాశం మాకు దక్కడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు గాను దర్శకుడు హరీష్ శంకర్ గారికి కృతజ్ఞతలు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ గారు పడ్డ కష్టం నభూతో నభవిష్యతి అన్నట్లుగా అనిపించింది. రాజకీయాలతో ఎంత బిజీగా ఉన్న ఆయన షూటింగ్ కోసం ఉదయం వచ్చే వారు, తిరిగి పరిపాలన కార్యక్రమాలను చూసేందుకు వెళ్లే వారు. మళ్లీ సాయంత్రం వరకు తిరిగి వచ్చే వారు. ఆయన డెడికేషన్ కి హ్యాట్సాఫ్ అనిపించేదని నిర్మాత చెప్పుకొచ్చారు.
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబో...
ఖుషి నాటి రోజులు గుర్తు చేసేలా ఈ సినిమా ఉంటుందని అభిమానుల హామీ ఇచ్చాడు. ఆద్యంతం ఎంజాయ్ చేసే విధంగా సినిమా ఉంటుందని, హరీష్ శంకర్ మార్క్ ఈ సినిమాలో ఉంటుంది అని ఆయన హామీ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు గొప్ప సినిమా ఇచ్చామనే సంతృప్తి మాకు ఎప్పటికీ ఉంటుంది అని నిర్మాత రవి శంకర్ అన్నాడు. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే విశ్వాసంను వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కి ఉన్న ఇమేజ్ తో పాటు, హరీష్ శంకర్ మార్క్ మేకింగ్ తోడైతే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే సినిమా ఓ రేంజ్ లో అంచనాలను మోస్తోంది. తాజాగా పాట విడుదల అయిన తర్వాత అంచనాలు మరింతగా పెరిగాయి. అతి త్వరలోనే ట్రైలర్ విడుదల చేయడం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి పవన్ కళ్యాణ్‌తో పాటు మరో మెగా హీరో ముఖ్య అతిథిగా హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయి.