12 ఏళ్ల తర్వాత.. 'సినిమా' చూపిస్తున్న పవన్ కల్యాణ్..!
తాజాగా బుధవారం సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి పొద్దుపోయే వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సినిమా హాళ్లలోనూ అధికారులు తనిఖీలు చేశారు.;
దాదాపు 12 సంవత్సరాల కిందట.. జరిగిన పరిణామాలు ఇప్పుడు జరుగుతున్నాయి. పుష్కర కాలం కిందట.. అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు.. సినిమా హాళ్లపై తనిఖీలు చేయించారు. దీనికి ఐదారేళ్ల కిందట.. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్నప్పుడు ఒక్కసారి మాత్రమే సినిమా హాళ్లలో తనిఖీలు చేయించారు. తప్పులు వెలుగులోకి తెచ్చి భారీ ఫైన్లు కూడా వేయించారు. దీనికి కారణాలు ఏమైనా.. అప్పట్లో ఈ ఇద్దరు సీఎంలు అంటే ఇండస్ట్రీలో చర్చ జరిగింది.
మళ్లీ ఆ తర్వాత.. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి సినిమా హాళ్లపై దూకుడుగా ఉన్నారు. తన సినిమా హరిహర వీరమల్లు విడుదల వచ్చే నెల 12న ఉండగా.. దీనికి ముందు సినిమా హాళ్ల బంద్‌కు పిలుపునిచ్చారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న పవన్.. ఇండస్ట్రీని ఉద్దేశించి తీవ్రంగా స్పందించారు. కృతజ్ఞత లేదన్నారు. అయితే.. ఎపిసోడ్ అక్కడితో అయిపోకుండా.. సినిమా హాళ్లలో ప్రేక్షకులకు వసతులపైనా ఆయన దృష్టి పెట్టారు.
తాజాగా బుధవారం సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి పొద్దుపోయే వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సినిమా హాళ్లలోనూ అధికారులు తనిఖీలు చేశారు. మంచినీటి సదుపాయం నుంచి తినుబండారాల ధరల వరకు కూడా అన్నీ పరిశీలించారు. సీట్ల నుంచి క్యూలైన్ల వరకు టికెట్ల నుంచి వేచి ఉండే గదుల దాకా అన్నింటి నీ పరిశీలించారు. అయితే.. తొలి రెండు రోజుల్లో ఏ సినిమా హాలుపైనా జరిమానాలు విధించకపోయినా.. గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చారు. అంతేకాదు.. కొన్ని హాళ్లకు నోటీసులు కూడా ఇచ్చారు.