తుపాకి ప‌ట్టి న‌క్స‌లైట్ కావాల‌నుకున్నా.. కానీ!

టీనేజ్ లో ఉన్న‌ప్పుడు సమాజంలోని అసమానతలు, అన్యాయాలు తనను తీవ్రంగా ప్రభావితం చేశాయని ప‌వ‌న్ వెల్లడించారు.

Update: 2026-06-10 23:30 GMT

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ తాజాగా ఇచ్చిన ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో తన ప‌ర్స‌న‌ల్ లైఫ్, యువకుడిగా ఉన్న రోజుల్లో ఆలోచనలు, రాజకీయ విశ్వాసాల గురించి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఒక దశలో తాను నక్సలైట్ కావాలనుకున్నానని, తుపాకీ కూడా పట్టాలని అనిపించిందని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం జాతీయవాద భావజాలానికి మద్దతు ఇస్తున్న పవన్ కళ్యాణ్ గతంలో పూర్తిగా భిన్నమైన ఆలోచనలతో ఉన్నానని చెప్పడం ఆయన జీవిత ప్రయాణంలో జరిగిన సిద్ధాంతపరమైన మార్పును స్పష్టంగా చూపిస్తోంది.

టీనేజ్ లో ఉన్న‌ప్పుడు సమాజంలోని అసమానతలు, అన్యాయాలు తనను తీవ్రంగా ప్రభావితం చేశాయని ప‌వ‌న్ వెల్లడించారు. ఆ సమయంలో నక్సలిజం భావజాలం తనను ఆకర్షించిందని, ఒక దశలో తాను కూడా ఆయుధం పట్టి ఉద్యమంలో భాగం కావాలనే ఆలోచన చేసినట్లు చెప్పారు. అయితే కాలక్రమేణా వివిధ సిద్ధాంతాలను తెలుసుకోవ‌డం, సమాజాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడం ద్వారా తన దృక్పథంలో మార్పు వచ్చిందని వివరించారు. ప్రస్తుతం ప్రజాస్వామ్య వ్యవస్థలోనే మార్పు సాధ్యమనే నమ్మకంతో రాజకీయాల్లో పనిచేస్తున్నానని ఆయన చెప్పిన సందేశం ప్రత్యేకంగా నిలిచింది.

అదే సమయంలో దేశభక్తి, జాతీయ సమైక్యతపై తన అభిప్రాయాలను కూడా పవన్ కళ్యాణ్ పంచుకున్నారు. చిన్నప్పటి నుంచే జాతీయవాద భావనలతో పెరిగానని, దేశంలోని ప్రతి పౌరుడికి ఎక్కడైనా జీవించే, పని చేసే హక్కు ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తన చర్చలు ఎక్కువగా దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపైనే జరుగుతాయని చెబుతూ, 140 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశాన్ని నడిపించడం ఎంతటి బాధ్యతో కూడా ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఆయన రాజకీయ ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ త‌న‌కు ఇష్టమైన దేశభక్తి నేపథ్యంలో రూపొందిన సినిమాల గురించి కూడా మాట్లాడారు. రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ సినిమాను ప్రశంసించిన పవన్, బరాముల్లా సినిమాను కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. 1987-89 కాలంలో శ్రీనగర్‌లో తెలుగు సినిమాల షూటింగ్‌లకు వెళ్లిన రోజులను గుర్తు చేసుకుంటూ, అప్పటి ఉద్రిక్త పరిస్థితులను వివరించారు. షూటింగ్ సమయంలో షాపింగ్‌కు వెళ్లినప్పుడు స్థానికుల నుంచి ఎదురైన అనుభవాలు ఇప్పటికీ గుర్తున్నాయని చెప్పారు. కాశ్మీర్ నేపథ్యంలోని కథలు, దేశ సమైక్యతను ప్రతిబింబించే సినిమాలు తనను ఆకట్టుకుంటాయని పవన్ తెలిపారు. అయితే ఇక్క‌డ ఆసక్తికర విషయం ఏమిటంటే, ఒకప్పుడు నక్సలిజం వైపు ఆకర్షితుడైన పవన్ కళ్యాణ్, తర్వాత తన సినీ కెరీర్‌లో జల్సా సినిమాలో మాజీ నక్సలైట్ గా క‌నిపించారు.

Tags:    

Similar News