మా లక్ష్యం నెరవేరింది.. ఇదే నిజమైన విజయం: పవన్
ఈ సినిమా సాధిస్తున్న కలెక్షన్లు, రికార్డుల కంటే కూడా.. ఈ సినిమా ద్వారా చరిత్రలో దాగి ఉన్న నిజాన్ని చెప్పామనేది ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తోందని పవన్ అన్నారు.;
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన `హరి హర వీరమల్లు` భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. జూలై 23 రాత్రి నుంచే ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. ధర్మం కోసం పోరాడిన వీరమల్లు కథను తెరపై ఆవిష్కరించగా థియేటర్ల వద్ద పవన్ అభిమానుల్లో కోలాహాలం నెలకొంది. తాజాగా విజయోత్సవ వేడుకలో వీరమల్లు టీమ్ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ- ``ఈ సినిమా విడుదల విషయంలోనూ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నా 29 ఏళ్ళ ప్రయాణంలో ఒక సినిమాని ఇలా ప్రమోట్ చేయడం ఇదే మొదటిసారి. బాధ్యత తీసుకోవడం ఓ రకంగా ఆనందాన్నిచ్చింది. ఏ సినిమాకైనా భావోద్వేగాలు ముఖ్యం. మనం ఒక సినిమాకి వెళ్ళినప్పుడు మనకి గుర్తుండేది.. మనం ఏ ఎమోషన్ ని ఇంటికి పట్టుకొస్తామోనని. ఈ చిత్ర కథ మొఘలులకు సంబంధించినది. మనం చదువుకున్న పుస్తకాల్లో ఔరంగజేబు గొప్పతనాన్ని చెప్పారు తప్ప.. అతని దుర్మార్గాన్ని చెప్పలేదు. మొఘల్స్ 200 ఏళ్ళే పాలించారు. చాళుక్యులు, పల్లవులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం కొన్ని వందల ఏళ్ళు పాలించారు. కానీ చరిత్రలో మొఘల్స్ గురించే ఎక్కువ ప్రస్తావన ఉంటుంది. మన చరిత్ర రాసిన వాళ్ళు మన రాజులపైన చిన్నచూపు చూశారు. ఔరంగజేబు పాలన సమయంలో హిందూదేశంలో హిందువుగా బ్రతకాలంటే పన్ను కట్టాల్సిన పరిస్థితి ఉండేది. ఆ విషయాన్ని ఈ సినిమాలో నిర్భయంగా ప్రస్తావించాము. నాకు తెలిసిన మార్షల్ ఆర్ట్స్, నాకున్న సాంకేతిక పరిజ్ఞానం, ప్రజా సమస్యలపై పోరాడేతత్వం.. ఇవన్నీ కలిసి నన్ను ప్రీ క్లైమాక్స్ లో 18 నిమిషాల ఫైట్ ను డిజైన్ చేయడానికి ప్రేరణ ఇచ్చాయి. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఆ ఎపిసోడ్ బాగుందని ప్రశంసించడం నాకు సంతోషాన్ని కలిగించింది. ఈ సినిమా మతాలకు సంబంధించింది కాదు. ఇందులో మంచి, చెడుకి మధ్య జరిగిన యుద్ధాన్ని చూపించాము. ఈ చిత్రం విడుదల విషయంలో రత్నం గారికి అండగా నిలిచిన మైత్రి మూవీ మేకర్స్ కి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు నేను ఇంత బలంగా నిలబడ్డానంటే నాకు అభిమానులు ఇచ్చిన బలమే కారణం`` అని అన్నారు.
ఈ సినిమా సాధిస్తున్న కలెక్షన్లు, రికార్డుల కంటే కూడా.. ఈ సినిమా ద్వారా చరిత్రలో దాగి ఉన్న నిజాన్ని చెప్పామనేది ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తోందని పవన్ అన్నారు. శంకరాభరణం సినిమా చూసిన తర్వాత నాకు శాస్త్రీయ సంగీతం పట్ల అపారమైన గౌరవం వచ్చింది. ఒక సినిమా ఏం చేయగలదు అనేదానికి ఇదొక ఉదాహరణ. సినిమా అనేది కథ ఎలా చెప్పాము, ప్రేక్షకుల్లో ఎంత ప్రేరణ కలిగించాము అనేది ముఖ్యం. ఆ పరంగా వీరమల్లు చిత్రం లక్ష్యం నెరవేరింది. సాంకేతికంగా కొందరు కొన్ని సూచనలు చేశారు. ఆ విషయాలను రెండో భాగం విషయంలో పరిగణలోకి తీసుకుంటాము. కోహినూర్ కంటే విలువైన జ్ఞానం మన దేశం సొంతం అని ఈ సినిమాలో చూపించాము. హరి హర వీరమల్లులో చరిత్రలో దాగి ఉన్న ఎన్నో వాస్తవాలను చెప్పాము. నా దృష్టిలో అదే నిజమైన విజయం. ఇలాంటి గొప్ప సినిమా తీసిన రత్నం గారికి అండగా నిలబడటం నా బాధ్యతగా భావించాను అని పవన్ అన్నారు. కార్యక్రమంలో ఏ.ఎం.రత్నం, జ్యోతికృష్ణ, నిధి అగర్వాల్, మైత్రి అధినేతలు పాల్గొన్నారు.