ఆ విషయంలో వీరమల్లు సేఫే..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నుంచి వస్తున్న తాజా చిత్రం హరి హర వీరమల్లు. వాస్తవానికి వీరమల్లును తాజా చిత్రం అనలేం.;
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నుంచి వస్తున్న తాజా చిత్రం హరి హర వీరమల్లు. వాస్తవానికి వీరమల్లును తాజా చిత్రం అనలేం. ఎందుకంటే ఈ సినిమా ఎప్పుడో కరోనాకు ముందు మొదలైంది. ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులను తట్టుకుని మొత్తానికి షూటింగ్ ను పూర్తి చేసుకుని జులై 24న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది.
పవన్ నుంచి చాలా గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా అవడంతో పాటూ, ఎలక్షన్స్ లో గెలిచి పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక రిలీజవుతున్న సినిమా కావడంతో వీరమల్లు రిలీజ్ ను నెక్ట్స్ లెవెల్ లో సెలబ్రేట్ చేయాలని పవన్ ఫ్యాన్స్ డిసైడయ్యారు. దానికి తగ్గట్టే ట్రైలర్ కూడా ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకోవడంతో వీరమల్లుపై అందరికీ అంచనాలు పెరిగాయి.
రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే వీరమల్లు సెన్సారును కూడా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికెట్ ను అందించగా, వీరమల్లు రన్ టైమ్ 2 గంటల 42 నిమిషాలని తెలుస్తోంది. అంటే ఇది చాలా సేఫ్. ఈ మధ్య వస్తున్న స్టార్ హీరోల సినిమాలు ఎక్కువగా 3 గంటలకు పైగానే ఉంటున్న నేపథ్యంలో పవన్ సినిమా 162 నిమిషాలే ఉండటం సినిమాకు బాగా కలిసొచ్చే అంశం.
వీరమల్లు చూసిన సెన్సార్ బోర్డు నుంచి పవన్ ఫ్యాన్స్ ఆశించే రెస్పాన్సే వచ్చింది. సినిమా ఫస్టాఫ్ చాలా బావుందని, ఇంటర్వెల్ సీక్వెన్స్, పవన్ ఇంట్రో సీన్ పవన్ ఫ్యాన్స్ కు ఐ ఫీస్ట్‌లా ఉంటుందని, విజువల్స్, కీరవాణి బీజీఎం నెక్ట్స్ లెవెల్ లో ఉన్నాయని, వీరమల్లు క్లైమాక్స్ కూడా చాలా ఎంగేజింగ్ గా ఉంటుందని, రెండు భాగాలుగా తెరకెక్కిన వీరమల్లు కథ లో సెకండ్ పార్ట్ కోసం మంచి లీడ్ ను ఇచ్చారని అంటున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బాబీ డియోల్ ఔరంగజేబు పాత్రలో నటించగా ఏఎం రత్నం ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. పవన్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా ఆఖరికి ఎలాంటి ఫలితాన్ని మిగులుస్తుందో చూడాలి.