ఆ రిగ్రెట్ అలానే ఉండిపోయింది

ఎవ‌రికైనా ఫ‌లానా ప‌ని చేయాల‌ని, దాని ద్వారా గుర్తింపు తెచ్చుకోవాల‌ని ఉంటుంది.;

Update: 2025-08-07 16:30 GMT

ఎవ‌రికైనా ఫ‌లానా ప‌ని చేయాల‌ని, దాని ద్వారా గుర్తింపు తెచ్చుకోవాల‌ని ఉంటుంది. అయితే కొంత‌మంది త‌మ‌ డ్రీమ్ ను ఎలాగైనా నెర‌వేర్చుకుని మొద‌ట్లో త‌ప్పులు చేసినా దాన్ని స‌రిదిద్దుకుంటూ ఆఖ‌రికి తాము అనుకున్న‌ది సాధిస్తే మ‌రికొంద‌రు మాత్రం మొద‌ట్లో జ‌రిగిన త‌ప్పుల వ‌ల్ల మ‌ళ్లీ వాటి జోలికి వెళ్ల‌కుండా ఉంటారు. సెల‌బ్రిటీలు కూడా అందుకు అతీతులు కాదు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా డైరెక్ష‌న్ విష‌యంలో ఇలానే చేశారు.

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ వైపు ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషిస్తునే, మ‌రోవైపు తాను క‌మిట్ అయిన సినిమాల‌ను పూర్తి చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ షూటింగ్ ను పూర్తి చేసే ప‌నిలో ఉన్న ప‌వ‌న్ త్వ‌ర‌లోనే ఆ సినిమాను పూర్తి చేయ‌నున్నారు. రీసెంట్ గా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమ‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ప‌వ‌న్ ఆ చిత్ర ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో కొన్ని ఇంట్రెస్టింగ్ మ‌రియు ఆశ్చ‌ర్య‌క‌ర విష‌యాల‌ను వెల్ల‌డించారు.

ఫిల్మ్ మేకింగ్‌పై ప‌వ‌న్ కు ఆస‌క్తి

ఇంట‌ర్వ్యూలో భాగంగా ఏ డైరెక్ట‌ర్ తో ప‌ని చేయాల‌నుంద‌ని అడ‌గ్గా, అలా ప‌ర్టిక్యుల‌ర్ గా ఒక‌రు లేర‌ని చెప్పిన ప‌వ‌న్, త‌న సొంత డైరెక్ష‌న్ లో తాను న‌టించాల‌నుకుంటున్న‌ట్టు తెలిపారు. గ‌తంలో తాను సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాన‌ని, త‌ర్వాత దాన్ని ఆపేశాన‌ని, ఆ విష‌యంలో మాత్రం త‌న‌కు రిగ్రెట్ అలానే ఉండిపోయింద‌ని, ఫిల్మ్ మేకింగ్ పై త‌న‌కున్న ప్రేమ అలానే ఉండిపోయింద‌ని, అందుకే దాన్ని మ‌ళ్లీ కంటిన్యూ చేసి, త‌న ద‌ర్శ‌క‌త్వంలో తానే న‌టించాల‌నుకుంటున్న‌ట్టు ప‌వ‌న్ తెలిపారు.

అత‌నితో క‌లిసి ప‌ని చేయాల‌నుంది

అదే ఇంట‌ర్వ్యూలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌కు ఎంతో మంది మంచి న‌టుల‌తో క‌లిసి వ‌ర్క్ చేయాల‌నుంద‌ని, మ‌రీ ముఖ్యంగా బాలీవుడ్ యాక్ట‌ర్ కే కే మీన‌న్ తో క‌లిసి ప‌ని చేయాల‌నుకుంటున్న‌ట్టు ఆస‌క్తిని వ్య‌క్తం చేశారు ప‌వ‌న్. కేకే మీన‌న్ మంచి న‌టుడ‌ని చెప్పిన పవ‌న్, ఏదొక రోజు అత‌నితో కలిసి స్క్రీన్ ను షేర్ చేసుకోవ‌డానికి ఎదురుచూస్తున్న‌ట్టు చెప్పారు.

ఆ విష‌యంలో భ‌య‌ప‌డ‌తా

ఆఖరిగా గూగుల్ లో మీ గురించి ఏం వెతికారు అని అడ‌గ్గా, త‌న గురించి తాను గూగుల్ చేయ‌డానికి భ‌య‌ప‌డ‌తాన‌ని, అలా వెత‌క‌డం వ‌ల్ల మ‌నం ఊహించ‌ని విష‌యాలు వెలుగులోకి వ‌స్తాయ‌ని అందుకే త‌న గురించి తాను గూగుల్ చేసుకోన‌ని చెప్పిన ప‌వ‌న్ ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ త‌ర్వాత మ‌రే సినిమానూ క‌మిట్ అయింది లేదు. దీంతో ప‌వ‌న్ ఇక సినిమాలు చేస్తారా లేదా అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ప‌వ‌న్ ఇంట‌ర్వ్యూలో చెప్పిన దాన్ని బ‌ట్టి చూస్తుంటే ప‌వ‌న్ క‌చ్ఛితంగా సినిమాల్లో కొన‌సాగుతార‌ని, కాక‌పోతే ఇంత‌కు ముందులా వ‌రుస పెట్టి సినిమాలు చేయ‌లేరేమో అనే క్లారిటీ అయితే వ‌చ్చేసింది. దీంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.

Tags:    

Similar News