పవన్ బ్యానర్ మళ్లీ యాక్టివేట్ అవుతోందా?
వీరమల్లు రిలీజ్ అయిపోయింది కాబట్టి ఇక ఆ సినిమా ప్రస్తావన ఉండదు. సెప్టెంబర్ లో `ఓజీ` కూడా రిలీజ్ అవుతుంది.;
పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ మళ్లీ యాక్టివేట్ అవుతుందా? మరుగున పడిన బ్యానర్ ని పీకే మళ్లీ లైన్ లోకి తెస్తున్నారా? అంటే అవుననే లీకులందుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఈ సంస్థపై ఇప్పటికే రెండు సినిమాలు నిర్మించారు. 2016 లో `సర్దార్ గబ్బర్ సింగ్` ను మరో సంస్థతో కలిసి నిర్మించగా 2018 లో మళ్లీ నితిన్ హీరోగా నటించిన `ఛల్ మోహన్ రంగ` చిత్రాన్ని నిర్మించారు. రెండు సినిమాలు కూడా లాభాల కంటే నష్టాలే తెచ్చాయి. ఆ తర్వాత పవన్ ఆ బ్యానర్లో ఎలాంటి సినిమాలు నిర్మించలేదు.
ఆరేళ్లగా ఇన్ యాక్టివ్ గానే సదరు సంస్థ ఉంది. అయితే తాజాగా ఈ సంస్థను పీకే మళ్లీ యాక్టివ్ చేయాలను కుంటున్నట్లు తెలిసింది. ఇటీవలే `హరి హర వీరమల్లు` ప్రచారంలో భాగంగా కూడా పవన్ సూచన ప్రాయంగా సొంత నిర్మాణ సంస్థలో సినిమాలు చేయాలి...చాలా కాలంగా తాను కూడా నిర్మాణ సంస్థను పట్టించుకోలేదన్నారు. ఆయన మాటల్ని బట్టి పీకే మళ్లీ నిర్మాణం వైపు ఆసక్తిగా ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం పవన్ కమిట్ అయిన చిత్రాలన్నింటిని వీలైనంత త్వరగా పూర్తి చేస్తోన్న సంగతి తెలిసిందే.
వీరమల్లు రిలీజ్ అయిపోయింది కాబట్టి ఇక ఆ సినిమా ప్రస్తావన ఉండదు. సెప్టెంబర్ లో `ఓజీ` కూడా రిలీజ్ అవుతుంది. అటుపై `ఉస్తాద్ భగత్ సింగ్` కూడా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ వేగంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇది పూర్తయిన వెంటనే పవన్ లాంగ్ గ్యాప్ తీసుకునే ప్లాన్ లో ఉన్నారు. 2029 ఎన్నికలు లేదా? జమిలి ఎన్నికల నేపథ్యంలో పవన్ రాజకీయంగానే దృష్టి పెడుతు న్నారు. ఈ నేపథ్యంలో పవన్ మళ్లీ సినిమాలు చేస్తారా? లేదా? అన్నది ఇప్పట్లో చెప్పడం కష్టమే.
కానీ సొంత బ్యానర్లో సినిమాలు నిర్మించే దిశగా ఆలోచన మాత్రం చేస్తున్నట్లు సన్నిహితుల నుంచి తెలుస్తోంది. తానే హీరోగా సినిమా చేయాలంటే కాల్షీట్లు కేటాయించాలి. రోజు సెట్స్ కు వెళ్లాలి. అంత సమయం పీకే కేటాయించలేరు. కానీ నిర్మాణంలోకి దిగితే పెట్టుబడి తప్ప! కాల్షీట్లు ఇవ్వాల్సిన పనిలేదు. సెట్ కు వెళ్లాల్సిన పని ఉండదు. తన టీమ్ ఆ పనులన్నింటిని చూసుకుంటుంది. పెట్టుబడిగా పవన్ కూడా డబ్బు పెట్టాల్సిన పని ఉండదు. తన బ్రాండ్ తో పనైపోయింది. పవన్ ఈ దశగా ఆడుగులు వేసే అవకాశం ఉందంటున్నారు.