భారీ రికార్డుల‌పై క‌న్నేసిన మెగాస్టార్- కంప్లీట్ స్టార్

ఒకే ఇండ‌స్ట్రీలో ఉన్న మెగాస్టార్ - కంప్లీట్ స్టార్.. ఇప్పుడు క‌లిసి న‌టించారు. భారీ రికార్డుల‌పై క‌న్నేసారు.;

Update: 2026-04-29 03:45 GMT

ఒకే ఇండ‌స్ట్రీలో ఉన్న మెగాస్టార్ - కంప్లీట్ స్టార్.. ఇప్పుడు క‌లిసి న‌టించారు. భారీ రికార్డుల‌పై క‌న్నేసారు. మాలీవుడ్ ని షేక్ చేయ‌డానికి వ‌స్తున్న ఈ సినిమా గురించి స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళితే...

మలయాళ చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ మమ్ముట్టి ..కంప్లీట్ స్టార్ మోహన్ లాల్ జోడీ ఒక లెజెండరీ కాంబినేషన్. వీరిద్దరూ గతంలో దాదాపు 50 పైగా చిత్రాల్లో కలిసి నటించి బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. ముఖ్యంగా 1984లో వచ్చిన అతిరాత్రం, 1986 నాటి వార్త, 1990లో వచ్చిన `నెంబర్ 20 మద్రాస్ మెయిల్` వంటి చిత్రాలు మలయాళ సినిమా చరిత్రలో మైలురాళ్లుగా నిలిచాయి. చివరగా 2008లో వచ్చిన `ట్వంటీ-20` చిత్రంలో వీరిద్దరూ పూర్తిస్థాయి పాత్రల్లో కలిసి కనిపించి అప్పటి ఇండస్ట్రీ రికార్డులన్నింటినీ తిరగరాశారు.

దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఇద్దరు దిగ్గజాలు `పేట్రియాట్` అనే భారీ యాక్షన్ థ్రిల్లర్ కోసం మళ్ళీ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ కలయిక కేవలం కేరళలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీ ప్రేక్షకుల్లో ఒక ఎమోషనల్ సంచలనాన్ని సృష్టిస్తోంది. ఇప్పటికే మమ్ముట్టి, మోహన్ లాల్ తమ పాత్రలకు సంబంధించిన డబ్బింగ్ పనులను పూర్తి చేయగా.. మేకర్స్ విడుదల చేసిన బిహైండ్ ది సీన్స్ వీడియో సినిమాపై అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేసింది. శ్రీలంకలోని ఎయిర్‌బేస్‌లో హెలికాప్టర్లు, ఫైటర్ జెట్‌ల మధ్య చిత్రీకరించిన యాక్షన్ దృశ్యాలు అంతర్జాతీయ స్థాయి మేకింగ్‌ను తలపిస్తున్నాయి.

ఈ చిత్రానికి మహేష్ నారాయణన్ దర్శకత్వం వహించడం మరో ప్రధాన ఆకర్షణ. టేకాఫ్, మాలిక్ వంటి సినిమాలతో బలమైన కంటెంట్‌ను అందించడంలో తనదైన ముద్ర వేసిన ఆయన ఈ సినిమాలో స్టార్ పవర్‌తో పాటు గ్రిప్పింగ్ నరేషన్‌ను జోడించార‌ని టాక్ వినిపిస్తోంది. విలక్షణ నటుడు ఫహద్ ఫాసిల్ విలన్‌గా నటిస్తుండటం.. నయనతార వంటి స్టార్ హీరోయిన్ భాగం కావడం సినిమా స్థాయిని మరింత పెంచింది. ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ కాక్‌పిట్‌లో ఫహద్ ఫాసిల్ కనిపిస్తున్న విజువల్స్ చూస్తుంటే ఈ సినిమాలో మైండ్ గేమ్స్ - యాక్షన్ ఎలిమెంట్స్ ఏ స్థాయిలో ఉంటాయో అర్థమవుతోంది.

ప్రస్తుతం మలయాళ సినిమాలు పాన్-ఇండియా స్థాయిలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాయి. లూసిఫర్, లోకా (2024) వంటి చిత్రాలు సృష్టించిన వసూళ్ల సునామీని `పేట్రియాట్` అధిగమిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ (CBFC) ఇప్పటికే యుఏ సర్టిఫికేట్‌ను జారీ చేస్తూ విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మే 01న‌ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ చిత్రం, మలయాళ మార్కెట్ పరిధిని గ్లోబల్ స్థాయిలో మరో మెట్టు ఎక్కించడం ఖాయంగా కనిపిస్తోంది.

వ్యాపార పరంగా చూస్తే... కేరళ బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ డే కలెక్షన్ల పరంగా `పేట్రియాట్` ఒక కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసే అవకాశం ఉంది. ఇద్దరు సూపర్ స్టార్లు దశాబ్దాల తర్వాత కలిసి కనిపిస్తుండటంతో ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. `లోకా`రికార్డులను అధిగమించి మలయాళ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవడమే కాకుండా.. పాన్-ఇండియా బాక్సాఫీస్ వద్ద కూడా ఈ చిత్రం గట్టి పోటీని ఇచ్చేలా కనిపిస్తోంద‌ని విశ్లేషిస్తున్నారు.

మ‌హేష్ నారాయణన్ మేకింగ్ .. ఇద్ద‌రు లెజెండ్స్ క‌ల‌యిక‌.. మలయాళ సినిమాకు ఉన్న అంతర్జాతీయ క్రేజ్ వెరసి `పేట్రియాట్`ను ఒక దృశ్య కావ్యంగా అల‌రించ‌నుంది. రికార్డుల వేటలో మెగాస్టార్-కంప్లీట్ స్టార్ మ్యాజిక్ రిపీట‌వుతుంద‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పేట్రియాట్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తుందో చూడాలని చిత్ర పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Tags:    

Similar News