పాన్ సౌత్ సినిమా ఆఫర్.. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఇవే!
అయితే సిద్ధాంత పరంగా ఈ ఆలోచన ఎంత అద్భుతంగా ఉన్నా? ఆచరణలో అనేక సంక్లిష్టమైన సవాళ్లు ఎదురవుతాయన్నది కాదనలేని నిజం.
దక్షిణాది పరిశ్రమలో ప్రతిభను, మార్కెట్‌ను ఒకే తాటిపైకి తెచ్చేందుకు ఓ ప్రముఖ నిర్మాత ఇచ్చిన పాన్-సౌత్ సినిమా ఆలోచన వినడానికి ఆకర్షణీయంగా ఉంది. నాలుగు ప్రధాన భాషల (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం) నటులు, సాంకేతిక నిపుణులతో ఒకే భారీ చిత్రాన్ని రూపొందిస్తే ప్రాంతీయ సరిహద్దులు తుడిచిపెట్టుకుపోతాయని, మార్కెట్ విస్తరిస్తుందని భావించడం మంచి పరిణామమే. అయితే సిద్ధాంత పరంగా ఈ ఆలోచన ఎంత అద్భుతంగా ఉన్నా? ఆచరణలో అనేక సంక్లిష్టమైన సవాళ్లు ఎదురవుతాయన్నది కాదనలేని నిజం.
పాన్-సౌత్ భావనకు ప్రధాన అడ్డంకి దక్షిణాది రాష్ట్రాల మధ్య ఉండే భాషా భేదాలు.. ప్రాంతీయ భావోద్వేగాలు. ప్రచారంలో దక్షిణాది చిత్ర పరిశ్రమ ఒక్కటే అని చెప్పినా? క్షేత్రస్థాయిలో భాషా పట్టింపులు, సాంస్కృతిక భేదాలు బలంగా ఉంటాయన్నది అంతే నిజం. ఇతర భాషా చిత్రాలు తమ ప్రాంతీయ మార్కెట్‌ను ఆక్రమిస్తున్నాయనే ఆందోళన అక్కడక్కడా వ్యక్తం కావడం సహజం. ఈ విధమైన సాంస్కృతిక, భాషా వ్యత్యాసాలను అధిగమించి అందరినీ మెప్పించే యూనివర్శల్ సబ్జెక్ట్ సిద్ధం చేయడం సాధారణ విషయం కాదు.
ప్రత్యేకించి కన్నడ, తమిళ చిత్రసీమల్లో ప్రాంతీయ సినిమా , భాషాభిమానం చాలా బలంగా ఉంటాయి. గతంలో కొన్ని సందర్భాల్లో పరభాషా చిత్రాల ప్రమోషన్లు .. డబ్బింగ్ సినిమాల విడుదలపై స్థానిక రక్షణ భావాలు వ్యక్తమవడం తెలిసిందే. గతంలో కర్ణాటకలో తెలుగు సినిమాల పోస్టర్లను తొలగించడం ..డబ్బింగ్ సినిమాలపై వివాదాలు రేగడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. తెలుగు సినిమాలకు అక్కడ ఆదరణ ఉన్నా? స్థానిక పరిశ్రమ ప్రయోజనాలు, సెంటిమెంట్ల విషయంలో ప్రేక్షకులు, సంఘాలు చాలా సున్నితంగా వ్యవహరిస్తాయి.
తమిళనాడు మార్కెట్ పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంటుంది. తమిళ ప్రేక్షకులు మంచి కంటెంట్‌ను అదరిస్తున్నా? తమ స్వంత భాషా సంస్కృతికి, తమిళ తారలకు ఇచ్చే ప్రాధాన్యత ప్రత్యేకంగా ఉంటుంది. ఇతర భాషల చిత్రాలు అక్కడ భారీ విజయం సాధించాలంటే స్థానికత భావన లోపించకుండా చూడాలి. కేవలం వేరే భాషా నటులను సినిమాలో పెట్టడం వల్ల లేదా డబ్ చేయడం వల్ల తమిళ ప్రేక్షకులు సులభంగా కనెక్ట్ అవ్వరు. తమిళ నేటివిటీకి సరిపోయే కథాంశాలు ఉన్నప్పుడు మాత్రమే అక్కడి బాక్సాఫీస్ వద్ద ఆదరణ లభిస్తుంది.
మలయాళ పరిశ్రమ విషయానికి వస్తే మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే అక్కడ కొంత సానుకూల వాతావరణం కనిపిస్తుంది. కేరళ ప్రేక్షకులు కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళ చిత్రాలను ఆదరిస్తారు. కానీ అక్కడ కూడా ఓ ప్రధాన షరతు ఉంది. మలయాళంలో కథ , కథనాల నాణ్యత అత్యున్నత స్థాయిలో ఉండాలి. స్టార్ డమ్ కంటే సహజత్వానికి, బలమైన స్క్రిప్ట్‌కే అక్కడ ప్రథమ ప్రాధాన్యం దక్కుతుంది. కేవలం భారీ బడ్జెట్ లేదా హంగులతో మాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం కష్టం.
మొత్తానికి సౌత్ ఇండియా అంతటికీ సరిపోయేలా పాన్-సౌత్ సినిమా తీయడం ఆలోచనగా భాగున్నా? దాన్ని కార్యరూపంలోకి తెచ్చేటప్పుడు అనేక అడ్డంకులు దాటాల్సి ఉంటుంది. నాలుగు భాషల నేటివిటీని, ప్రేక్షకుల అభిరుచులను, రాజకీయ-సామాజిక సెంటిమెంట్లను సమతుల్యం చేస్తూ సినిమా తీయడం కత్తిమీద సాము వంటిదే. ఈ సరిహద్దులను చెరిపేసి అందరినీ మెప్పించే బలమైన కథ, వైవిధ్యమైన కథనం సిద్ధమైనప్పుడు మాత్రమే పాన్-సౌత్ ఐడియా నిజమైన విజయాన్ని అందుకుంటుంది.