నార్త్ లో ఆ మూవీ రూ.2వేలు మాత్రమే రాబట్టిందా?
కొంతకాలంగా చిన్న సినిమా నుంచి స్టార్ హీరోల సినిమాల వరకు చాలా మంది సెలబ్రిటీలు పాన్ ఇండియా ట్యాగ్ కోసం పరుగులు పెడుతున్నారు.;
కొంతకాలంగా చిన్న సినిమా నుంచి స్టార్ హీరోల సినిమాల వరకు చాలా మంది సెలబ్రిటీలు పాన్ ఇండియా ట్యాగ్ కోసం పరుగులు పెడుతున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మాత్రమే కాదు.. హిందీలో కూడా విడుదల చేసి పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సంపాదించాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రతి సినిమాకు యూనివర్సల్ అప్పీల్ ఉండదని, కేవలం ట్రెండ్ కోసం పాన్ ఇండియా రూట్ ఎంచుకుంటే ఫలితాలు ఆశించినట్టుగా రావని దర్శకుడు, నటుడు రవిబాబు తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
దర్శకుడిగానే కాకుండా నటుడిగా, నిర్మాతగా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రవిబాబు.. ఇప్పుడు రేజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆ సినిమా మే 8వ తేదీన గ్రాండ్ గా విడుదల కానుండగా, ప్రమోషన్లలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలపై ఆయన చెప్పిన ఎగ్జాంపుల్.. నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది.
"మన కలెక్షన్స్ ఒక్కోసారి నార్త్ ఇండియాలో చూస్తే నవ్వు వస్తుంది. ఇటీవల ఒక పెద్ద సినిమా పాన్ ఇండియా మూవీ అంటూ నార్త్ ఇండియా అంతటా రిలీజ్ అయింది. కానీ అక్కడ ఆ సినిమా మొత్తం కలిపి కేవలం రూ.2800 మాత్రమే వసూలు చేసింది" అని రవిబాబు తెలిపారు. దీంతో ఆయన వ్యాఖ్యలతో ప్రస్తుతం ఆ సినిమా ఏదన్న దానిపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కో మూవీ పేరు చెబుతున్నారు. అయితే రవిబాబు ఎక్కడా ఏ సినిమా పేరు చెప్పలేదు.
ఇటీవల బాహుబలి, కేజీఎఫ్, పుష్ప, ఆర్ఆర్ఆర్, కాంతార వంటి సినిమాలు దేశవ్యాప్తంగా భారీ విజయం సాధించడంతో చాలామంది నిర్మాతలు అదే ఫార్ములాను అనుసరించాలని చూస్తున్నారు. కానీ అలాంటి సినిమాలకు స్ట్రాంగ్ కంటెంట్, ఎమోషన్, మేకింగ్, ప్రమోషన్ వంటి అంశాలు కలిసి వచ్చాయని మూవీ ఎక్స్పర్ట్స్ ఎప్పుడూ చెబుతుంటారు. కేవలం ఇతర భాషల్లో రిలీజ్ చేస్తే సినిమా పాన్ ఇండియా హిట్ అవుతుందని అనుకోవడం సరైనది కాదని అంటుంటారు.
అయితే ఇప్పుడు రవిబాబు వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియాలో కూడా విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆయన చెప్పింది వాస్తవమే అంటుండగా.. మరికొందరు మాత్రం ప్రయత్నించకపోతే మార్కెట్ ఎలా పెరుగుతుందని క్వశ్చన్ చేస్తున్నారు. అయితే కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారనే అభిప్రాయం మాత్రం ఎక్కువగా వినిపిస్తోంది.
ఇక రేజర్ సినిమా విషయానికి వస్తే.. రవిబాబు తన స్టైల్ కు భిన్నంగా ఆ చిత్రాన్ని తెరకెక్కించినట్లు సమాచారం. థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకంతో మూవీ టీమ్ ఉంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. మొత్తానికి రవిబాబు చేసిన పాన్ ఇండియా కామెంట్స్ మాత్రం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.