స్టార్ వర్సెస్ స్టార్.. పాన్ ఇండియాలో ఇదే కొత్త ఫార్ములా?

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాల హవా మొదలైన తర్వాత కథలతో పాటు క్యాస్టింగ్ విధానంలో కూడా పెద్ద మార్పులు కనిపిస్తున్నాయి.

Update: 2026-07-14 11:30 GMT

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాల హవా మొదలైన తర్వాత కథలతో పాటు క్యాస్టింగ్ విధానంలో కూడా పెద్ద మార్పులు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు హీరోకు ఎదురుగా స్ట్రాంగ్ యాక్టర్ ఎంపిక చేయడం వరకే పరిమితమైన దర్శకులు, ఇప్పుడు మరో భాషలో స్టార్ ఇమేజ్ ఉన్న నటులను కీలక పాత్రలకు తీసుకుంటున్నారు. దీంతో సినిమా విడుదలకు ముందే దేశవ్యాప్తంగా చర్చ మొదలవుతోంది. ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాల్లో కనిపిస్తున్న ఈ ధోరణిని స్టార్ వర్సెస్ స్టార్ ఫార్ములాగా అభివర్ణిస్తున్నారు మూవీ ఎక్స్పర్ట్స్.

గతంలో ఒక సినిమా విజయం ఎక్కువగా హీరో మార్కెట్‌ పై ఆధారపడేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ప్రేక్షకులు కేవలం హీరోను మాత్రమే కాకుండా సినిమాలోని ఇతర ప్రధాన పాత్రలపై ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా విలన్ లేదా కథలో కీలకమైన మరో పాత్రను పోషించే నటుడు కూడా స్టార్ అయితే సినిమాకు ఎక్స్ట్రా స్ట్రెంగ్త్ చేకూరుతోంది. ఇదే కారణంగా దర్శకులు, నిర్మాతలు వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటులను ఒకే ప్రాజెక్టులో భాగం చేస్తున్నారు.

ఆ ట్రెండ్ వల్ల సినిమాకు అనేక బెనిఫిట్స్ కనిపిస్తున్నాయి. ఒకవైపు కథలో పాత్రలకు మరింత బలం లభిస్తుండగా, మరోవైపు వివిధ రాష్ట్రాల్లో సినిమా ప్రచారం సహజంగానే పెరుగుతోంది. థియేట్రికల్ బిజినెస్‌ తో పాటు ఓటీటీ, శాటిలైట్ హక్కుల వాల్యూ పెరగడంలో ఇలాంటి కాంబినేషన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పాలి. ఇటీవల వచ్చిన పలు పాన్ ఇండియా చిత్రాలను పరిశీలిస్తే ఆ మార్పు చాలా క్లియర్ గా కనిపిస్తుంది.

తెలుగు హీరోల సినిమాల్లో తమిళ, మలయాళ, కన్నడ నటులు కీలక పాత్రల్లో కనిపిస్తుండగా, ఇతర భాషల చిత్రాల్లో కూడా టాలీవుడ్ నటులకు ప్రాధాన్యం దక్కుతోంది. కథకు అవసరమైన స్ట్రాంగ్ రోల్స్ పల్స్ ను స్టార్ నటులతో నింపడం ద్వారా సినిమాపై అంచనాలు పెంచే ప్రయత్నం జరుగుతోంది. మరోవైపు ప్రేక్షకుల అభిరుచులు కూడా ఆ మార్పుకు కారణమవుతున్నాయి. ఇప్పుడు ప్రేక్షకులు కేవలం హీరో ఎలివేషన్లకే పరిమితం కావడం లేదు.

హీరోకు సమానంగా నిలిచే పాత్రలు, నటనకు అవకాశం ఉన్న పాత్రలను కూడా ఆస్వాదిస్తున్నారు. దీంతో కథలోని సంఘర్షణ మరింత ఆసక్తికరంగా మారుతోంది. హీరో ఎంత బలంగా కనిపిస్తే, అతడికి ఎదురుగా నిలిచే పాత్ర కూడా అంతే స్ట్రాంగ్ గా ఉండాలని దర్శకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ మరోసారి కలిసి నటించనున్నారనే వార్తలు సినీ ప్రియుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

ఇప్పటికే పుష్ప సిరీస్‌ లో ఆ ఇద్దరి మధ్య పోటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు మరో పాన్ ఇండియా ప్రాజెక్టులో వీరిద్దరూ కలిసి కనిపించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, ఆ వార్త నిజమైతే అది కేవలం ఒక కాంబినేషన్ మాత్రమే కాదు.. కొంతకాలంగా పాన్ ఇండియా సినిమాల విషయంలో పెరుగుతున్న స్టార్ వర్సెస్ స్టార్ ఫార్ములాకు మరో ఉదాహరణగా నిలిచే అవకాశముంది.

Tags:    

Similar News