సౌత్ సినిమాలకు దూరంగా బాలీవుడ్ భామలు!

దక్షిణాది చిత్రాలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటూ.. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్న వేళ టాలీవుడ్‌లో నటించడానికి బాలీవుడ్ తారలు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.

Update: 2026-06-04 14:30 GMT

ప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్యాన్-ఇండియా సంస్కృతి ఊపందుకుంది. దక్షిణాది చిత్రాలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటూ.. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్న వేళ టాలీవుడ్‌లో నటించడానికి బాలీవుడ్ తారలు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. దీపికా పదుకోణే, జాన్వీ కపూర్ వంటి అగ్ర కథానా యికలు తెలుగులో భారీ ప్రాజెక్టులలో అవకాశాలు అందుకుంటూ ఇక్కడ బిజీగా మారుతున్నారు. ఇదే సమయంలో మరో ఆసక్తికరమైన ట్రెండ్ కూడా కనిపిస్తోంది. టాలీవుడ్ నుండి మంచి ఆఫర్లు వ‌స్తున్నా? కొందరు క్రేజీ బాలీవుడ్ భామలు మాత్రం దక్షిణాది చిత్రాలకు దూరంగా ఉంటూ పూర్తిగా హిందీ పరిశ్రమకే పరిమితమవుతున్నారు.

ఈ జాబితాలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన పేరు ఆలియా భట్. `ఆర్ఆర్ఆర్` చిత్రంలో చిన్న పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిన అమ్మ‌డు అటుపై టాలీవుడ్‌లో మరిన్ని చిత్రాలు చేస్తుందని అంతా భావించారు. కానీ, అలియా మాత్రం వరుసగా నార్త్ ప్రాజెక్టులతోనే బిజీగా ఉంటూ ఇటువైపు చూడటం లేదు. బాలీవుడ్‌లో క్రేజీ దర్శకుల చిత్రాలు, మహిళా ప్రాధాన్యత కలిగిన సబ్జెక్టులు అమ్మ‌డు చేతిలో ఉండటంతో ప్రస్తుతానికి దక్షిణాది చిత్రాలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. తన సొంత మార్కెట్‌ను మరింత పటిష్టం చేసుకోవడానికే ఆలియా ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది.

అలాగే యువ నటి అనన్యా పాండే పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. విజయ్ దేవరకొండ సరసన `లైగర్` చిత్రంతో ప్యాన్-ఇండియా స్థాయిలో సౌత్ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీకి ఆశించిన ఫలితం దక్కలేదు. భారీ అంచనాలతో రిలీజ్ అయిన‌ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం చెంద‌డంతో అనన్య కెరీర్ వ్యూహాన్ని మార్చుకుంది. `లైగర్` చేదు జ్ఞాపకం తర్వాత ఆమె మళ్లీ దక్షిణాది చిత్రాల వైపు వెళ్లకుండా పూర్తి స్థాయిలో హిందీ చిత్రాలకు.. ఓటీటీ ప్రాజెక్టులకే ప్రాధాన్యత ఇస్తోంది. సీనియర్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ సైతం ఇదే బాటలో పయనిస్తోంది.

`సాహో’`వంటి ప్రతిష్టాత్మక యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటించిన శ్రద్ధా కపూర్‌కు ఆ చిత్రం దక్షిణాదిలో ఆశించిన స్థాయి సోలో ఇమేజ్‌ను తెచ్చిపెట్టలేకపోయింది. హిందీ బెల్ట్‌లో ఆ సినిమా మంచి వసూళ్లు సాధించినా? సౌత్ ఆడియన్స్‌కు ఆమె అంతగా కనెక్ట్ కాలేకపోయింది. దీంతో `సాహో` తర్వాత వచ్చిన ఎన్నో సౌత్ ఆఫర్లను పక్కన పెట్టి మళ్లీ మాతృభాష అయిన హిందీ చిత్రాలకే మొగ్గు చూపింది. ఇటీవల బాలీవుడ్‌లో సీక్వెల్స్, కమర్షియల్ హిట్లతో ఆమె అక్కడ సేఫ్ జోన్‌ను ప్ర‌యాణిస్తోంది. సౌత్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్, భారీ రెమ్యునరేషన్లు ఆఫర్ చేస్తున్నప్పటికీ ఇలా ముద్దుగుమ్మలు ఇటువైపు రాకపోవడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయి.

దక్షిణాది సినిమాలలో నటించాలంటే ఇమేజ్ పరమైన ఇబ్బందులతో పాటు.. ఇక్కడి మేకింగ్ స్టైల్‌కు అలవాటు పడటం, ప్రమోషన్ల కోసం ఎక్కువ సమయం కేటాయించడం వంటి సవాళ్లు ఉంటాయి. ఒక వేళ సినిమా ప్లాప్ అయితే వచ్చే నెగిటివిటీని తట్టుకోవడం బాలీవుడ్ స్టార్లకు కొంత కష్టంగా మారుతోంది. భారతీయ సినిమాలో ప్రాంతీయ సరిహద్దులు చెరిగిపోయినా? నటీనటుల వ్యక్తిగత కెరీర్ నిర్ణయాలు వారి గత అనుభవాలపైనే ఆధారపడి ఉంటాయి. దీపికా, జాన్వీ లాంటి వారు టాలీవుడ్‌ను తమకు అనుకూలంగా మార్చుకుంటుంటే ఆలియా, అనన్య, శ్రద్ధా వంటి వారు బాలీవుడ్‌లోనే భద్రతను చూసుకుంటున్నారు.

Tags:    

Similar News