దేశంలో చాలా టీవీ చానెళ్లు మూత పడటానికి కారణం?
అలాగే డిజిటల్ లో ఆన్-డిమాండ్ కంటెంట్ హవా కూడా పెరిగిందని విశ్లేషిస్తున్నారు. మొబైల్-ఫస్ట్ వినియోగం ప్రజలు మీడియాతో ఎలా అటాచ్ అయి ఉన్నారో చెబుతోంది.;
డిజిటల్, సోషల్ మీడియాల కారణంగా సినిమా రంగం తీవ్రంగా నష్టపోతోందని ఇప్పటికే నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అరచేతిలోనే వినోదం అందుబాటులోకి రావడంతో ప్రజల్లో మెజారిటీ వర్గాలు థియేటర్లకు వెళ్లడం లేదు. ఈ ముప్పు కేవలం సినిమా థియేటర్ల వరకే పరిమితం కాదు. డిజిటల్ విప్లవం కారణంగా టీవీ చానెళ్లు కూడా మూత పడుతున్నాయనేది తాజాగా ఆందోళన కలిగించే విషయం.
సాంప్రదాయ టెలివిజన్ రంగం పూర్తిగా కనుమరుగై ఆ స్థానంలో డిజిటల్ తో అనుసంధానించిన, సులభతరమైన ఒక కొత్త హైబ్రిడ్ టీవీ అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. గడిచిన కొన్నేళ్లలో, ముఖ్యంగా కోవిడ్ 19 తర్వాత యువతరం కానీ, వినోద ప్రియుల్లో కానీ చాలా మార్పులు వచ్చాయి. ఇంతకుముందులా ప్రైమ్ టైమ్ వరకూ టీవీ చానెళ్ల ముందు కూచునే అలవాటు సన్నగిల్లుతోందనేది సర్వే.
అలాగే డిజిటల్ లో ఆన్-డిమాండ్ కంటెంట్ హవా కూడా పెరిగిందని విశ్లేషిస్తున్నారు. మొబైల్-ఫస్ట్ వినియోగం ప్రజలు మీడియాతో ఎలా అటాచ్ అయి ఉన్నారో చెబుతోంది. గడిచిన మూడేళ్లలో పదుల సంఖ్యలో టీవీ ఛానెల్‌లు తమ లైసెన్స్‌లను వదులుకున్నాయని సర్వేలు చెబుతున్నాయి.
ఓ సర్వే సంస్థ వివరాల ప్రకారం... టీవీక్షకులు ఇటీవలి కాలంలో చాలా వరకూ తగ్గిపోయారు. డిజిటల్ వేదికలతో పాటు ఓటీటీలకు ప్రజలు అలవాటు పడిపోయారు. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, హాట్ స్టార్, యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాలలో షార్ట్ వీడియోలు, సోషల్ మీడియా షార్ట్ రీల్స్ వైపు ప్రజలు బాగా మొగ్గు చూపుతున్నారు. అరచేతిలోనే వైకుంఠం కనిపిస్తుండటంతో ఇక టీవీ చానెళ్ల ముందు రిమోట్ పట్టుకుని కూచునే పరిస్థితి లేదని చెబుతున్నారు. ఈ పర్యవసానం మునుముందు టీవీ రంగంలో చాలా మార్పులు తేనుందని విశ్లేషిస్తున్నారు.
ఇటీవల మొబైల్ డేటా వినియోగం పెరిగింది. 80 కోట్ల (800మిలియన్లు) మంది ప్రజలు ఇప్పుడు స్మార్ట్ ఫోన్ తో కనెక్ట్ అయి ఉండటంతో మెజారిటీ వర్గాలు పూర్తిగా డిజిటల్ స్ట్రీమింగ్, ఓటీటీ స్ట్రీమింగ్ కంటెంట్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇటీవలి కాలంలో ప్రైమ్ టైమ్ స్లాట్లకు ప్రకటనల ఆదాయం తగ్గిందని కూడా సర్వే నిర్వహించిన టెక్ కంపెనీ చెబుతోంది.
స్టార్ చానెళ్లు, జీ చానెళ్లు లేదా ఇప్పటికే ప్రాంతీయంగా స్థిరపడిన విస్త్రత నెట్ వర్క్ ఉన్న జెమిని, `మా` చానెల్ వంటివి అంతగా ఇబ్బంది పడవు. అయితే టెలివిజన్ వీక్షకుల్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా ఈ రంగంలో టెక్ వినియోగం పెరిగి, టై అప్ లు పెరిగితే అప్పుడు వాటి మనుగడకు కొత్త దారులు తెరుచుకున్నట్టే. టీవీ రంగం పూర్తిగా అంతమవ్వదు. ఏఐ వినియోగంతో వచ్చిన పెను మార్పులానే ఈ రంగంలో కొత్త సాంకేతిక విధానాలను అనుసరిస్తూ, వ్యూవర్ షిప్‌ని, టీఆర్పీలను నిలబెట్టుకునే ప్రయత్నాలు సాగుతాయని అంచనా.
ఒక కార్ ని పెట్రోల్ లేదా డీజిల్ లేదా ఎలక్ట్రిక్ వాహనంగా మారితే అది హైబ్రిడ్ అంటాం. దానిలానే టీవీ రంగం కూడా మారుతుందని అంచనా వేస్తున్నారు. లైవ్ స్ట్రీమింగ్, టార్గెటెడ్ ప్రకటనలు, డిజిటల్ ఇంటిగ్రేషన్ మనుగడ తదుపరి టీవీ రంగంలో కొత్త దశను నిర్వచించవచ్చని కూడా విశ్లేషిస్తున్నారు. మారిన ట్రెండ్ లో కంటెంట్ ని సులువుగా యాక్సెస్ చేసే కొత్త మార్గాలను టీవీ రంగం కనుగొనాల్సి ఉంటుంది. అది కూడా గ్రామీణ స్థాయిలో ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురి కాకుండా టీవీ కార్యక్రమాలను వీక్షించేలా హైబ్రిడ్ మోడళ్లలోను వెసులుబాటును వెతకాల్సి ఉంటుంది. అలాగే పదుల సంఖ్యలో టీవీ చానెళ్లు లైసెన్సులను వదులుకునేలా ఒత్తిడి ఉందని కూడా తెలుస్తోంది. సమాచార ప్రసారాల శాఖ వసూలు చేసే లైసెన్స్ ఫీజుల భారాన్ని కూడా చాలా మంది మోయలేని పరిస్థితి ఉందని చెబుతున్నారు.