స‌డెన్‌గా oscars రేసులోకి దూసుకొచ్చిన నాగాలాండ్ సినిమా!

మరోవైపు అధికారిక ఎంట్రీగా ఎంపికైన `గొంధల్` సినిమా మహారాష్ట్రలోని సాంప్రదాయ జానపద కళారూపం - ఆచారాల ఆధారంగా తెరకెక్కింది.

Update: 2026-09-23 04:52 GMT

ఆస్కార్ ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిలిం విభాగంలోకి ప్రవేశించడానికి సాధారణంగా ప్రతీ దేశం నుండి ఒకే సినిమా అధికారికంగా ఎంపికవుతుంది. కానీ ఈ ఏడాది భారతదేశం నుండి ఏకంగా రెండు సినిమాలు ఆస్కార్ రేసులో నిలవడం విశేషం. సంతోష్ దవాఖర్ దర్శకత్వం వహించిన మరాఠీ థ్రిల్లర్ చిత్రం `గొంధల్` 33 పోటీదారులలో భారతదేశం నుంచి అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. అయితే దీనితో పాటు డెబ్యూ తేజ రియో దర్శకత్వంలో నాగాలాండ్ నేపథ్యంలో తెరకెక్కిన `అంగ్` సినిమా కూడా అక‌స్మాత్తుగా ఆస్కార్ రేసులోకి వ‌చ్చింది. ఇది టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో `ప్లాట్‌ఫాం ప్రైజ్` గెలుచుకోవడం ద్వారా ఆస్కార్ రేసులో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

99వ అకాడమీ అవార్డ్స్ కోసం ఆస్కార్ కమిటీ ప్రవేశపెట్టిన సరికొత్త నిబంధనా నియ‌మావ‌ళి మార్పుల వల్లే ఇది సాధ్యమైంది. అంతర్జాతీయ ఫీచర్ ఫిలిం విభాగంలోకి ప్రవేశించడానికి అకాడమీ ఒక రెండవ మార్గాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రకారం దేశాలు పంపే అధికారిక ఎంట్రీలతో పాటు.. బెర్లిన్, కాన్స్, టొరంటో, వెనిస్, సన్‌డాన్స్ , బుసాన్ వంటి ప్ర‌ఖ్యాత‌ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో నిర్ణీత ఆరు ప్రధాన బహుమతులు గెలుచుకున్న నాన్-ఇంగ్లీష్ చిత్రాలు కూడా నేరుగా ఆస్కార్ పోటీకి అర్హత సాధించవచ్చని నిబంధన మార్చారు. టొరంటో ఫెస్టివల్‌లో `అంగ్` చిత్రం ఈ అవార్డును గెలుచుకోవడం ద్వారా `గొంధల్‌`తో పాటు అదే ఆస్కార్ రేసులోకి ఈక్వ‌ల్‌గా ప్రవేశించింది.

`అంగ్` సినిమా ఈశాన్య భారతదేశంలోని నాగాలాండ్‌లో 1960ల నేపథ్యంలో తెరకెక్కింది. తెరపై సరిగా కనిపించని ఆ ప్రాంతపు సంస్కృతిని ప్రతిబింబిస్తూ.. వృద్ధుడైన కొన్యాక్ గ్రామానికి చెందిన చీఫ్ .. అతడి కుమారుడి జీవితాలను అమెరికన్ క్రిస్టియన్ మిషనరీ రాక ఎలా ప్రభావితం చేసిందనే కోణంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఇది దర్శకుడు తేజ రియోకు మొట్టమొదటి ఫీచర్ ఫిలిం కావడం విశేషం. ఈ చిత్రంలోని దృక్పథం, మేకింగ్ స్టైల్ .. లోతైన కథాంశాన్ని టొరంటో ఫెస్టివల్ జ్యూరీ ఎంతో ప్రశంసించింది.

మరోవైపు అధికారిక ఎంట్రీగా ఎంపికైన `గొంధల్` సినిమా మహారాష్ట్రలోని సాంప్రదాయ జానపద కళారూపం - ఆచారాల ఆధారంగా తెరకెక్కింది. గ్రామీణ ప్రాంతంలో జరిగే ఒక గొంధల్ వేడుక నేపథ్యంలో సాగే ఈ కథలో హింసాత్మక వివాహం నుండి తప్పించుకోవాలనుకునే సుమన్ అనే మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను అంతం చేయడానికి కుట్ర పన్నడం వంటి అంశాలతో ఉత్కంఠగా సాగుతుంది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎంపిక చేసిన 33 చిత్రాల నుండి ఈ సినిమా అధికారిక ఎంట్రీగా నిలిచింది.

ఆస్కార్ నిబంధనలలో వచ్చిన ఈ మార్పుల వల్ల భారతదేశం వంటి పెద్ద బహుభాషా సినీ పరిశ్రమ ఉన్న దేశాలకు ఎంతో వెసులుబాటు లభించింది. ఒకే దేశం నుండి ఒకే సినిమాను ఎంపిక చేయాల్సి వచ్చినప్పుడు చాలా ప్రతిభావంతమైన చిత్రాలు అవకాశాన్ని కోల్పోయేవి. ఇప్పుడు కొత్త విధానం ద్వారా అర్హత సాధించిన ఈ రెండు చిత్రాలు ఆస్కార్ నామినేషన్ల తుది జాబితాలో నిలవడానికి అకాడమీ ఓటింగ్ ప్రక్రియను ఎదుర్కొవాల్సి ఉంది. డిసెంబర్ 15న షార్ట్‌లిస్ట్ ప్రకటన రానుండగా.. జనవరి 21న తుది నామినేషన్లు వెలువడనున్నాయి.

Tags:    

Similar News