ఆన్‌లైన్ బుకింగ్ దోపిడీ వ‌ల్ల‌నే జ‌నం థియేట‌ర్ల‌కు రావ‌డం లేదా?

నేటి డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ అనేది ఒక విలాసవంతమైన సౌకర్యం నుండి ప్రతి ఒక్కరికీ తప్పనిసరి అవసరంగా మారిపోయింది.

Update: 2026-05-18 19:30 GMT

నేటి డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ అనేది ఒక విలాసవంతమైన సౌకర్యం నుండి ప్రతి ఒక్కరికీ తప్పనిసరి అవసరంగా మారిపోయింది. గంటల తరబడి ఎండలో లేదా క్యూ లైన్లలో నిలబడే శ్రమను తప్పిస్తూ నచ్చిన సీటును ఇంట్లోనే కూర్చుని బుక్ చేసుకునే వీలు కల్పిస్తున్నందుకు థర్డ్ పార్టీ సంస్థలు చార్జీలు వసూలు చేయడాన్ని ఒక కోణంలో సమర్థించవచ్చా లేదా? అనే చర్చ సాగుతోంది.

అయితే ఆన్ లైన్ బుకింగులు స‌జావుగా సాగాలంటే.. సర్వర్ మెయింటెనెన్స్, హై-ఎండ్ టెక్నాలజీ, యాప్ డెవలపర్లు, టెక్నీషియన్ల జీతాలు.. నిరంతర కస్టమర్ సపోర్ట్ వంటి వ్యవస్థలను నడపడానికి ఈ ఆదాయం కార్పొరేట్ సంస్థలకు అవసరమనేది ఒక వాదన. ఉచితంగా ఎలాంటి కార్పొరేట్ సేవలు సాధ్యం కావు కాబట్టి.. సేవలు నచ్చిన వారు చార్జీలు చెల్లించి వాడుకోవచ్చని, నచ్చని వారు నేరుగా కౌంటర్ వద్ద కొనుగోలు చేయవచ్చనే స్వేచ్ఛా మార్కెట్ సూత్రం ఇక్కడ కనిపిస్తుంది.

అయితే ప్రముఖ ఆన్‌లైన్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ లో వసూలు చేస్తున్న సర్వీస్ చార్జీల వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్‌లో కొత్త వివాదానికి తెరలేపింది. నిబంధనల ప్రకారం ప్రతి టికెట్‌పై కేవలం రూ.6 (ప్లస్ జీఎస్టీ) మాత్రమే సర్వీస్ చార్జ్ రూపంలో వసూలు చేయాల్సి ఉండగా.. దానికి విరుద్ధంగా ఏకంగా రూ.25 (ప్లస్ జీఎస్టీ) వరకు నిర్మొహమాటంగా గుంజుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ అదనపు వసూళ్లలో రూ.10 థియేటర్ ఎగ్జిబిటర్ ఖాతాలోకి రూ.15 బుకింగ్ వెబ్ సైట్ జేబులోకి వెళ్తున్నాయని.. అయితే దీనికోసం రాత్రింబవళ్లు శ్రమించే చిత్ర నిర్మాతకు మాత్రం ఒక్క పైసా కూడా దక్కడం లేదని ఇండస్ట్రీ వర్గాలు మండిపడుతున్నాయి. ప్రేక్షకులను పీల్చి పిప్పి చేస్తున్న ఈ దోపిడీపై నిర్మాతలు ఇప్పుడు న్యాయపోరాటానికి సిద్ధమవుతుండగా.. ఈ చార్జీలను తక్షణమే తగ్గించాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

ఈ సర్వీస్ చార్జీల వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, సినీ ప్రేక్షకుల నుండి భిన్నమైన, ఘాటైన స్పందనలు వస్తున్నాయి. కొందరు నెటిజన్లు బుక్‌మైషో యాజమాన్యానికి మద్దతుగా నిలుస్తూ.. ``అదేమైనా ధర్మసత్రం అనుకున్నారా? కస్టమర్లకు అంత పెద్ద నెట్‌వర్క్ అందిస్తున్నప్పుడు చార్జీలు లేకుండా కంపెనీలు ఎలా నడుస్తాయి?`` అంటూ ప్రశ్నిస్తున్నారు. హీరోలకు మాత్రం వంద‌ల‌ కోట్ల వరకు భారీ పారితోషికాలు ఇచ్చుకునే నిర్మాతలకు, యాప్ నిర్వహణ ఖర్చులు భరించడం కష్టంగా ఉందా? అని కొందరు కౌంటర్లు వేస్తున్నారు. ఒకవేళ థర్డ్ పార్టీ యాప్‌ల వసూళ్లు అంతగా ఇబ్బందిగా అనిపిస్తే.. టాలీవుడ్‌లో ఉన్న ధనవంతులైన నిర్మాతలే అంతా కలిసి తక్కువ సర్వీస్ చార్జీలతో సొంతంగా ఒక బుకింగ్ యాప్‌ను ప్రారంభించుకోవచ్చు కదా అని సలహాలు ఇస్తున్నారు.

మరికొందరు నెటిజన్లు ఈ వివాదంలోకి నిర్మాతలను లాగడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రేక్షకులను నిలువునా ముంచుతున్నది వీరేనని ఆరోపిస్తున్నారు. ఇక్కడ తప్పు ఎవరిదనేది పక్కన పెడితే.. మధ్యలో నిర్మాతలకు ఎందుకు అంత బాధ? టికెట్ల ధరల పెంపు పేరుతో ఇప్పటికే సామాన్య ప్రజల జేబులు గుల్ల చేస్తూ..కోట్లలో బిజినెస్ చేసుకుంటున్నది నిర్మాతలు కాదా? అని కడిగిపారేస్తున్నారు. థియేటర్లలో ప్రేక్షకులను అన్ని విధాలుగా దోచుకుంటున్నారనే చేదు నిజాన్ని ఈ వివాదం బయటపెట్టిందని సగటు సినిమా అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా.. తమకు థియేటర్లు దగ్గరలోనే ఉన్నాయని.. ఎలాంటి సర్వీస్ చార్జీల భారం లేకుండా నేరుగా కౌంటర్ వద్దకు వెళ్లి.. బుక్‌మైషో యాప్‌లోని సీట్ నంబర్ చూపిస్తూ టికెట్లు బుక్ చేసుకుంటున్నామని కొందరు స్మార్ట్ ఐడియాలను కూడా షేర్ చేస్తున్నారు.

చలనచిత్ర రంగం అనేది కేవలం ఒక కార్పొరేట్ వ్యాపారం మాత్రమే కాదు.. అది కోట్ల మంది సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే అతిపెద్ద వినోద సాధనం. సినిమా టికెట్ల ధరలను సామాన్యుడికి అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వాలు జీవోల ద్వారా గరిష్ట ధరలను నియంత్రిస్తున్నప్పుడు.. అదే టికెట్‌ను విక్రయించే థర్డ్ పార్టీ యాప్‌లు అడ్డగోలుగా`సర్వీస్ చార్జీలు` వసూలు చేయడం ప్రభుత్వ నియంత్రణల ఆశయాన్ని నీరుగారుస్తుంది. కాబట్టి కార్పొరేట్ సంస్థల మనుగడను దెబ్బతీయకుండా.. అదే సమయంలో ప్రేక్షకుల జేబుకు చిల్లు పడకుండా ఉండాలంటే ఒక సమతుల్యమైన విధానం అవసరం. సినిమా టికెట్ ధర, ఎంచుకునే థియేట‌ర్ల‌ రకం (సింగిల్ స్క్రీన్ లేదా మల్టీప్లెక్స్) ఆధారంగా ఈ థర్డ్ పార్టీ చార్జీలపై ఒక రీజనబుల్ శాతం లేదా గరిష్ట పరిమితిని ప్రభుత్వం చట్టబద్ధంగా ఖరారు చేయాలి. అప్పుడే ప్లాట్‌ఫామ్‌ల సాంకేతిక వృద్ధికి ఆస్కారం ఉండటంతో పాటు... ఆన్‌లైన్ బుకింగ్ అనేది సామాన్యుడికి భారం కాకుండా ఒక నిజమైన సౌకర్యంగా మిగులుతుంది.

Tags:    

Similar News