పెళ్లి కాకుండానే తల్లి అవ్వాలనుకున్న ఆ నలుగురు హీరోయిన్‌లు
తాజాగా భోజ్‌పురి సూపర్‌స్టార్ ఆమ్రపాలి దూబే ఒక రియాలిటీ షో వేదికగా తనకు పెళ్లి కాకుండానే సింగిల్ మదర్‌గా బిడ్డకు జన్మనివ్వాలని ఉందంటూ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీశాయి.
సమాజంలో వివాహం, కుటుంబ వ్యవస్థలపై ఉన్న సాంప్రదాయ భావనలను సవాలు చేస్తూ కొందరు సినీ నటీమణులు చేసే వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టిస్తుంటాయి. తాజాగా భోజ్‌పురి సూపర్‌స్టార్ ఆమ్రపాలి దూబే ఒక రియాలిటీ షో వేదికగా తనకు పెళ్లి కాకుండానే సింగిల్ మదర్‌గా బిడ్డకు జన్మనివ్వాలని ఉందంటూ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీశాయి. అయితే ఇలా వివాహం లేకుండానే మాతృత్వాన్ని పొందేందుకు సిద్ధమని లేదా ఆ కోరికను బహిరంగంగా వ్యక్తపరిచిన నటీమణులు ఈమె ఒక్కరే కాదు.. గతంలోనూ పలువురు ప్రముఖ తారలు ఇలాంటి వ్యాఖ్యలతో ప్రకంపనలు సృష్టించారు.
ఈ జాబితాలో ప్రముఖంగా చెప్పుకోదగ్గ నటి శృతి హాసన్. గతంలో ఒక టాక్ షోలో పాల్గొన్నప్పుడు స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ మాట్లాడుతూ.. వివాహం అనే వ్యవస్థపై తనకు పెద్దగా నమ్మకం లేదని.. కానీ భవిష్యత్తులో బిడ్డను కనడానికి లేదా దత్తత తీసుకోవడానికి పెళ్లి అవసరం లేదని భావిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. అలాగే సౌత్ అండ్ నార్త్ ఇండస్ట్రీలలో గుర్తింపు పొందిన శ్రియ శరణ్ కూడా పెళ్లికి ముందే మాతృత్వంపై తనదైన శైలిలో స్పందించిన సందర్భాలు ఉన్నాయి. వివాహం లేకుండా సంతానాన్ని పొందడం అనేది ఒక మహిళ వ్యక్తిగత నిర్ణయమని వీరు గట్టిగా సమర్థించారు.
మరోవైపు బాలీవుడ్ నటి ఐశ్వర్య సఖుజ, అనురాగ్ కాశ్యప్ కుమార్తె ఆలియా కాశ్యప్ వంటి నవతరం భామలు కూడా సింగిల్ పేరెంటింగ్ .. సరోగసీ లేదా దత్తత విధానాల ద్వారా తల్లి కావడంపై సానుకూల దృక్పథాన్ని వ్యక్తం చేశారు. సమాజం విధించే పెళ్లి నిబంధనల కంటే మాతృత్వం ఇచ్చే అనుభూతి అత్యంత పవిత్రమైనదని... ఒక బిడ్డను పెంచేందుకు ప్రేమ, బాధ్యత ఉంటే చాలు కానీ భర్త ఉండాల్సిన అవసరం లేదని వీరు స్పష్టం చేశారు.
అయితే కేవలం వ్యాఖ్యలకే పరిమితం కాకుండా నిజ జీవితంలో పెళ్లి చేసుకోకుండానే మాతృత్వాన్ని స్వీకరించి ఆదర్శంగా నిలిచిన తారలూ ఉన్నారు. విశ్వసుందరి సుస్మితా సేన్ అత్యంత చిన్న వయసులోనే (24 ఏళ్లకే) వివాహం చేసుకోకుండానే మొదటి కుమార్తెను... ఆ తర్వాత రెండవ కుమార్తెను దత్తత తీసుకుని సింగిల్ మదర్‌గా వారిని పెంచి పెద్ద చేశారు. అలాగే బాలీవుడ్ ప్రముఖ నటి ఏక్తా కపూర్, తుషార్ కపూర్‌లు కూడా పెళ్లి చేసుకోకుండా సరోగసీ విధానం ద్వారా పిల్లలకు జన్మనిచ్చి తల్లిదండ్రులుగా మారారు.
ఒకప్పుడు వివాహం కాకుండా బిడ్డను కనడం లేదా దత్తత తీసుకోవడం అనేది ఒక పెద్ద సామాజిక నేరంగా, నిషిద్ధంగా భావించేవారు. కానీ మారుతున్న కాలంతో పాటు మహిళల ఆర్థిక స్వాలంబన.. ఆలోచనా ధోరణిలో వచ్చిన విప్లవాత్మక మార్పుల వల్ల నటీమణులు తమ హక్కులను... నిర్ణయాలను బిగ్గరగా గళమెత్తి చెప్తున్నారు. ఆమ్రపాలి దూబే నుండి సుస్మితా సేన్ వరకు వీరంతా చేసిన వ్యాఖ్యలు... తీసుకున్న నిర్ణయాలు సమాజంలో స్త్రీల వ్యక్తిగత స్వేచ్ఛ- మాతృత్వంపై సరికొత్త చర్చలకు దారితీస్తున్నాయి.