తరుణ్ భాస్కర్ 'ఓం శాంతి ఓం'.. ట్రైలర్ ఎలా ఉందంటే?

సినిమాలో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా తమ పాత్రల్లో సహజంగా ఒదిగిపోయినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని సినీ విశ్లేషకులు అంటున్నారు.;

Update: 2026-01-23 13:10 GMT

డైరెక్టర్‌ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ ఇప్పుడు హీరోగా మరోసారి ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఆయన హీరోగా, ఈషా రెబ్బ హీరోయిన్‌ గా నటించిన తాజా చిత్రం ఓం శాంతి శాంతి శాంతిః. మలయాళంలో సూపర్ హిట్‌ గా నిలిచిన జయ జయ జయ జయహే సినిమాకు రీమేక్‌ గా తెరకెక్కుతున్న ఆ మూవీకి ఏఆర్ సజీవ్ దర్శకత్వం వహిస్తున్నారు. జనవరి 30న థియేటర్లలో విడుదల కానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

అయితే ప్రమోషన్స్‌ లో భాగంగా తాజాగా సినిమా ట్రైలర్‌ ను విడుదల చేశారు మేకర్స్. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియా ద్వారా ట్రైలర్‌ రిలీజ్ చేయడం విశేషం. సినిమా మంచి విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. అయితే ట్రైలర్ విడుదలైన వెంటనే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. మొదటి నుంచి చివరి వరకు కూడా ఫన్నీగా సాగిన ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.

ట్రైలర్ చూస్తే, సినిమా కథ భార్యాభర్తల మధ్య జరిగే సంఘటనలు చుట్టూ తిరుగుతుందని అర్థమవుతోంది. కోపం ఎక్కువగా ఉండే యువకుడితో పెళ్ళైన అమ్మాయి పరిస్థితి, ఆ తర్వాత ఆమె ఎదుర్కొనే సమస్యలు, భర్త ప్రవర్తనను ఎలా మార్చుకుంటుందన్నదే కథాంశం. కామెడీతో పాటు ఎమోషన్స్ కూడా బాగా మేళవించినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా భార్యపై భర్త డామినేషన్ చేయడం, ఆ తర్వాత జరిగే పరిణామాలు నవ్వులు పూయిస్తున్నాయి.

సినిమాలో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా తమ పాత్రల్లో సహజంగా ఒదిగిపోయినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. డైలాగ్స్, కామెడీ టైమింగ్, ఎమోషనల్ సీన్స్ అన్నీ కలిపి ఫ్యామిలీ ఆడియన్స్‌ ను ఆకట్టుకునేలా సినిమా రూపొందినట్లు ట్రైలర్ ద్వారా అర్థమవుతుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయేలా ఉంది.

నిజానికి మలయాళ హిట్ జయ జయ జయ జయహేకి రీమేక్ కావడంతో ముందుగానే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఒరిజినల్ వెర్షన్‌ లో భార్య పాత్రకు మంచి ప్రాధాన్యం ఉండటం విశేషం. అదే తరహాలో తెలుగు వెర్షన్‌ లోనూ ఫిమేల్ లీడ్ రోల్ స్ట్రాంగ్ గా ఉంటుందని అర్థమవుతోంది. కథలోని మెసేజ్‌ తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా సమానంగా అందించడమే లక్ష్యంగా రూపొందించినట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఓం శాంతి శాంతి శాంతిః మూవీ విడుదలకు సిద్ధమైంది. జనవరి 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ఆ సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గా మంచి విజయాన్ని సాధిస్తుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రైలర్‌ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తే.. మూవీ థియేటర్లలో మంచి సందడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి చూడాలి ఏం జరుగుతుందో.

Full View
Tags:    

Similar News