OG: తెలంగాణ ఓకే.. ఏపీలో మార్పు జరగనుందా?
అయితే ఓవర్సీస్ లో ప్రీమియర్స్ ప్లాన్ చేసిన మేకర్స్.. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ను స్టార్ట్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బెనిఫిట్ షో వేయాలని నిర్ణయించుకున్నారు.;
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటించిన ఓజీ మూవీ.. మరో ఐదు రోజుల్లో విడుదల కానుంది. ముంబై బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఆ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించనున్నారు.
ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, సిరి లెళ్ల తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇప్పుడు దసరా కానుకగా సెప్టెంబర్ 25వ తేదీన రిలీజ్ చేయనున్నారు.
అయితే ఓవర్సీస్ లో ప్రీమియర్స్ ప్లాన్ చేసిన మేకర్స్.. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ను స్టార్ట్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బెనిఫిట్ షో వేయాలని నిర్ణయించుకున్నారు. సెప్టెంబర్ 25వ తేదీన ఉదయం ఒంటి గంటకు స్పెషల్ షో ప్రదర్శించాలని డిసైడ్ అయ్యారు. అందుకు అనుగుణంగానే దరఖాస్తు చేసుకున్నారు.
కానీ తెలంగాణ ప్రభుత్వం అందుకు నిరాకరించింది. అర్థరాత్రి షో వేసేందుకు అనుమతులు ఇవ్వలేదు. బదులుగా సెప్టెంబర్ 24న రాత్రి 9 గంటల షోకు ప్రీమియర్ వేసుకునేలా అనుమతి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం మిడ్ నైట్ షోకు పర్మిషన్ ఇచ్చింది. టికెట్ రేటును కూడా ఖరారు చేసింది.
ఇదంతా ఓకే అయినా.. మేకర్స్ ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. రెండు రాష్ట్రాల్లో ఒకేసారి స్పెషల్ షో వేయాలని డిసైడ్ అయ్యారు. దీంతో సెప్టెంబర్ 25 ఉదయం 1 గంటలకు బదులుగా సెప్టెంబర్ 24న ప్రీమియర్ షో ప్రదర్శించేందుకు అనుమతులు కావాలని మేకర్స్ ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి తిరిగి దరఖాస్తు చేయనున్నారని తెలుస్తోంది.
దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సవరించిన జీవో అతి త్వరలో రానుందని తెలుస్తోంది. ఆ తర్వాత ప్రీమియర్స్ కు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ను మొదలుపెట్టనున్నారని వినికిడి. రెండు రాష్ట్రాలకు చెందిన టికెట్స్ ను ఒకేసారి రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారట. మరెప్పుడు చేస్తారో అంతా వేచి చూడాలి.