తారక్- త్రివిక్రమ్ మూవీ.. క్రేజీ అప్డేట్స్ ఇచ్చిన నాగవంశీ

ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. వచ్చే ఏడాది మధ్యలో ఎన్టీఆర్- త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించాలని అనుకుంటున్నామని తెలిపారు.;

Update: 2025-07-15 09:32 GMT

మ్యాన్ ఆఫ్ ది మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో మైథలాజికల్ మూవీ రానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించి పలు కీలక విషయాలు వెల్లడించిన నిర్మాత నాగవంశీ.. తాజాగా మరిన్ని విషయాలు పంచుకున్నారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

బాల రామాయణంలో రాముడిగా నటించి కెరీర్ ను స్టార్ట్ చేసిన ఎన్టీఆర్.. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత పౌరాణిక పాత్రను పోషించనున్నారు. త్రివిక్రమ్ మూవీలో మురుగన్ గా కనిపించనున్నారు. అందుకు గాను ఆయన ఫుల్ గా ప్రిపేర్ అవుతున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా మురుగన్ బుక్ పట్టుకుని పలు సందర్భాల్లో కనిపించారు.

అయితే సీనియర్‌ ఎన్టీఆర్‌ ను రాముడిగా, కృష్ణుడిగా మనం చూశామని, ఇప్పుడు తారక్‌ ను తాను అలా చూపించనున్నామని తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగవంశీ తెలిపారు. త్రివిక్రమ్‌ మొదటిసారి మైథలాజికల్‌ సినిమా తీస్తున్నారని చెప్పారు. ఇప్పుడు అనౌన్స్మెంట్ వీడియోపై మూవీ టీమ్ వర్క్ చేస్తుందని ఆయన వెల్లడించారు.

బాలీవుడ్ రామాయణ ప్రాజెక్ట్ ను ప్రకటించిన తర్వాత దేశమంతా దాని గురించి మాట్లాడుకుందని గుర్తు చేశారు నాగవంశీ. తాము దానికంటే భారీగా.. ఉన్నత ప్రమాణాలతో తమ సినిమాను ప్రకటించాలని అనుకుంటున్నామని తెలిపారు. ఆ విషయంలో తాము తొందరపడడం లేదని పేర్కొన్నారు. అందుకే కొన్ని రోజులు ఆపామని అన్నారు.

ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. వచ్చే ఏడాది మధ్యలో ఎన్టీఆర్- త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించాలని అనుకుంటున్నామని తెలిపారు. 2026 ద్వితీయార్థంలో ఆ సినిమా సెట్స్‌ పైకి వెళ్తుందని చెప్పారు. వెంకటేష్ గారితో త్రివిక్రమ్ చేయాల్సిన మూవీ వచ్చే నెలలో స్టార్ట్ అవుతుందని అన్నారు.

ఆ సినిమా 2026 వేసవిలో రిలీజ్ అవుతుందని తెలిపారు నాగవంశీ. అది జరిగిన వెంటనే తారక్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందని చెప్పారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. అయితే నాగవంశీ.. ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేదు. బహుశా సీజీ, వీఎఫ్ ఎక్స్ వర్క్స్ కు ఎక్కువ సమయం పడుతుందేమోనని నెటిజన్లు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News