నోరా ఫతేహి కార్ యాక్సిడెంట్.. తాగి గుద్దాడు!
సన్నిహితులు చెప్పిన వివరాల మేరకు... నోరా తాను ప్రదర్శన ఇవ్వాల్సిన వేదికకు ప్రయాణిస్తుండగా ఈ సంఘటన జరిగింది.;
బాహుబలి `మనోహరి` నోరా ఫతేహి కార్ యాక్సిడెంట్ కి గురైంది. బాగా తప్ప తాగిన ఒక డ్రైవర్ తన కార్ తో నోరా ఫతేహి కార్ ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ నోరా స్వల్పగాయాలతో బయటపడినట్టు జాతీయ మీడియా తన కథనాల్లో పేర్కొంది. నటి-నర్తకి నోరా ఫతేహి అంతర్జాతీయ డీజే డేవిడ్ గుట్టాతో కలిసి సన్‌బర్న్ ఫెస్టివల్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
సన్నిహితులు చెప్పిన వివరాల మేరకు... నోరా తాను ప్రదర్శన ఇవ్వాల్సిన వేదికకు ప్రయాణిస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఘటన తర్వాత ఆమె బృందం వేగంగా రెస్పాండ్ అయింది. నోరా ఫతేహీని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అంతర్గత రక్తస్రావం లేదా రక్తస్రావం, గాయం వంటి ఏవైనా తీవ్రమైన పరిస్థతులు ఉన్నాయా? అనేది తెలుసుకునేందుకు వైద్యులు సీటీ స్కాన్ తీసారు. స్కాన్ రిపోర్ట్ ప్రకారం.. నోరాకు స్వల్పంగా గాయమైందని తేలింది.
వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చినా నోరా తన వృత్తిపరమైన నిబద్ధతను గౌరవించి తిరిగి పనికి రావాలని పట్టుబట్టింది. ప్రమాదం జరిగిన సాయంత్రం సన్‌బర్న్- 2025లో తన షెడ్యూల్‌లో కనిపించాలని పట్టుబట్టిందని తెలుస్తోంది. ఈ నిర్ణయం ఈవెంట్ నిర్వాహకులు, ఆమె అభిమానులను ఆశ్చర్యపరిచింది. నటిగా నర్తకిగా తన వృత్తిగత నిబద్ధతకు అందరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
దశాబ్ధ కాలంగా భారతీయ సినీపరిశ్రమల్లో నోరా వేవ్స్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా నోరా ఫతేహి దక్షిణాదిన పలు ఐటమ్ నంబర్లతో యువతరం కలల రాణిగా మారింది. `బాహుబలి`లో `మనోహరి..` పాటతో నోరా యువహృదయాలను గెలుచుకుంది.