క్రిస్మస్ కు బ్లాక్‌బస్టర్… రిపబ్లిక్ డేకి డిజాస్టర్?
ఏ మూవీ అయినా సక్సెస్ అవ్వాలంటే కంటెంట్ మాత్రమేనని మరోసారి ప్రూవ్ అయింది. ఎంత పెద్ద స్టార్ అయినా, గతంలో ఎంత భారీ హిట్ కొట్టినా.. తర్వాత సినిమా కూడా అలాగే సక్సెస్ అవుతుందన్న గ్యారెంటీ లేదు.;
ఏ మూవీ అయినా సక్సెస్ అవ్వాలంటే కంటెంట్ మాత్రమేనని మరోసారి ప్రూవ్ అయింది. ఎంత పెద్ద స్టార్ అయినా, గతంలో ఎంత భారీ హిట్ కొట్టినా.. తర్వాత సినిమా కూడా అలాగే సక్సెస్ అవుతుందన్న గ్యారెంటీ లేదు. ప్రేక్షకులు థియేటర్ కు రావాలంటే కథ, కథనం, ప్రెజెంటేషన్ బాగుండాల్సిందే. వరుసగా సినిమాలు విడుదలైనా, ఫలితం మాత్రం పూర్తిగా కంటెంట్ మీద ఆధారపడి ఉంటుందని మాలీవుడ్ హీరో నివిన్ పౌలీ ఎగ్జాంపుల్ గా నిలిచారు.
గత ఏడాది క్రిస్మస్ సందర్భంగా విడుదలైన సర్వం మాయ సినిమా నివిన్ పౌలీ కెరీర్ లోనే మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. చాలా సంవత్సరాలుగా సరైన హిట్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నివిన్ కు ఆ సినిమా పెద్ద ఊరట ఇచ్చింది. విడుదలైన ఫస్ట్ షో నుంచి చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లు రాబట్టింది. మలయాళంలో అప్పట్లో విడుదలైన భారీ చిత్రాలను కూడా వెనక్కి నెట్టి సర్వం మాయ హవా చూపించింది.
ముఖ్యంగా సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ వృషభ వంటి పెద్ద సినిమాలను కూడా డామినేట్ చేసి దూసుకోపోయింది. నివిన్ పౌలీకి స్ట్రాంగ్ కమ్ బ్యాక్ మూవీగా నిలిచిన సర్వం మాయ.. ఏకంగా రూ.150 కోట్ల కలెక్షన్లు సాధించి, ఆయన కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది. క్రిస్మస్ కానుకగా వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఆ సినిమా నివిన్ కెరీర్ ను మళ్లీ ట్రాక్‌లో పెట్టిందనే చెప్పాలి.
అయితే ఆ విజయానికే కొనసాగింపుగా వచ్చిన తాజా సినిమా మాత్రం పూర్తిగా నిరాశపరిచింది. నివిన్ పౌలీ హీరోగా తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ బేబీ గర్ల్ ఇటీవల థియేటర్లలో విడుదలైంది. రిపబ్లిక్ డే వీకెండ్ టార్గెట్ గా వచ్చిన ఆ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. రిలీజ్ కు ముందే పెద్దగా బజ్ లేకపోవడం, ట్రైలర్ కు పెద్దగా పాజిటివ్ టాక్ రాకపోవడం మూవీకి మైనస్ గా మారింది.
ముఖ్యంగా తొలి రోజు బేబీ గర్ల్ చిత్రానికి కోటి రూపాయల వసూళ్లు రావడం కూడా కష్టంగా మారిందని సమాచారం. మలయాళ ప్రేక్షకులు ఆ సినిమాను పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. మౌత్ టాక్ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో, వీకెండ్ కలెక్షన్లపై ఇప్పుడు అనుమానాలు మొదలయ్యాయి. మొదటి రెండు రోజుల్లోనే సినిమా పూర్తిగా చతికిలపడే పరిస్థితి కనిపిస్తోంది.
అందుకే ఇప్పుడు క్లియర్ గా తెలుస్తున్న విషయమేమిటంటే.. స్టార్ ఇమేజ్ కంటే కంటెంట్ దే పైచేయి. క్రిస్మస్ కు బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరో అయినా, రిపబ్లిక్ డే సమయానికి వచ్చిన సినిమా డిజాస్టర్ కావచ్చు. ప్రేక్షకులను థియేటర్ కు రప్పించాలంటే కథలో కొత్తదనం ఉండాలి, ఆసక్తికరమైన అంశాలు ఉండాలి. లేకపోతే ఎంత పెద్ద హీరో అయినా ఫలితం మాత్రం మారదు.