ఆడ‌ది ఆట వ‌స్తువు? 'పెద్ది' వివాదంపై నిత్యామీన‌న్ సంచ‌లన వ్యాఖ్య‌లు!

ఇలాంటి పరిస్థితుల్లో నటీమణులు కేవలం బాధితులుగా మిగిలిపోవాల్సిన అవసరం లేదని... వారు తమకంటూ కొన్ని ఎల్లలు గీసుకోవాలని నిత్య హితవు పలికారు.

Update: 2026-06-08 10:21 GMT

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వ‌చ్చిన‌ `పెద్ది` చిత్రం ప్రస్తుతం ఒక పెద్ద వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న జాన్వీ కపూర్ పాత్రను మితిమీరిన గ్లామర్‌తో `హైపర్‌సె*వలైజ్` (అతిగా శృంగారభరితంగా) చేసి చూపించారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం కమర్షియల్ హంగుల కోసం హీరోయిన్ పాత్రను ఈ స్థాయిలో ఒక గ్లామ్ వ‌స్తువులాగా చూపించ‌డంపై కొంద‌రి నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమలో మహిళల చిత్రణపై చాలా మంది త‌మ అభిప్రాయాల‌ను తెలిపారు. ఇప్పుడు ప్రముఖ నటి నిత్య మీనన్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

సినిమాల్లో మహిళలను కేవలం గ్లామర్ బొమ్మలుగా చూపించడం అనేది కేవలం దక్షిణాది చిత్ర పరిశ్రమకే పరిమితం కాలేదని.. ఇది మొత్తం గ్లోబల్ సినిమా రంగంలోనే ఒక ట్రెండ్‌గా మారిపోయిందని నిత్య మీనన్ స్పష్టం చేశారు. ఒక ఇంటర్వ్యూలో నిత్యా మాట్లాడుతూ... ఈ సమస్యకు ప్రధాన కారణం సినిమాల్లో పెరిగిపోయిన `హైపర్-కమర్షియలైజేషన్` (అతిగా వ్యాపారమయం కావడం) అని విశ్లేషించారు. బాక్సాఫీస్ వద్ద మ్యాసివ్ విజయాన్ని అందుకోవడం కోసం... ప్రేక్షకులను కేవలం ఉద్వేగానికి .. శృంగార రసంతో రోమాంచితంగా ఆక‌ర్షించేందుకు ఎలాంటి అంశాలనైనా జోడించడానికి మేకర్స్ వెనకాడటం లేదని.. ఇది ఖచ్చితంగా హద్దులు దాటడమేనని నిత్యా అభిప్రాయపడ్డారు.

ఇలాంటి పరిస్థితుల్లో నటీమణులు కేవలం బాధితులుగా మిగిలిపోవాల్సిన అవసరం లేదని... వారు తమకంటూ కొన్ని ఎల్లలు గీసుకోవాలని నిత్య హితవు పలికారు. తెరపై నటిస్తున్న నటీనటులు త‌మ‌ను వ‌స్తువులాగా చూపిస్తామంటే అంగీకరించలేమని క‌చ్చితంగా చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. అయితే కెరీర్ ప్రారంభం నుండి కమర్షియల్ సినిమాల్లో ఇలాంటి పాత్రలు చేస్తూ... సడన్‌గా ఒకరోజు వద్దంటే ఇండస్ట్రీ సీరియస్‌గా తీసుకోకపోవచ్చని పేర్కొన్నారు. అంతిమంగా ఇది సదరు నటి ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుందని... కేవలం స్టార్ హోదా మాత్రమే కావాలనుకుని దేనికైనా సిద్ధపడితే అది వారు తీసుకున్న వ్యక్తిగత నిర్ణయమే అవుతుందని తేల్చిచెప్పారు.

తన కెరీర్ గురించి ప్రస్తావిస్తూ.. తాను గ్లామర్ హద్దులు దాటడానికి ఇష్టపడనందువల్లే కొన్ని రకాల పెద్ద సినిమాలు, జానర్లు తనను వెతుక్కుంటూ రాలేదని నిత్య మీనన్ బహిరంగంగా అంగీకరించారు. అయినా చౌకబారు కీర్తి కంటే తన ఆత్మగౌరవానికే తాను ప్రాధాన్యత ఇస్తానని... ఆ విషయంలో తనకు ఎలాంటి అపరాధభావం లేదని అన్నారు. నటీమణులు కేవలం నిస్సహాయులుగా ఉండిపోనవసరం లేదని... పరిశ్రమలో తమకంటూ ఒక స్టాండ్ తీసుకోగలిగే శక్తి వారికి ఉంటుందని నిత్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కథానాయికల్లో ఒక కొత్త ఆలోచనను రేకెత్తిస్తున్నాయి.

మరోవైపు `పెద్ది` సినిమాలో జాన్వీ గ్లామ‌ర్ డోస్ పై చెల‌రేగుతున్న ఈ భారీ నెగిటివిటీపై దర్శకుడు బుచ్చిబాబు సన ఎట్టకేలకు స్పందించారు. నిజ జీవితంలోనైనా... తను రాసే కథల్లోనైనా మహిళలపై తనకు అత్యంత గౌరవం ఉందని ఆయన వివరణ ఇచ్చారు. ఏ మహిళా పాత్రను తక్కువ చేసి చూపించాలనే ఉద్దేశం తమకు లేదని చెబుతూ... ప్రేక్షకుల సెంటిమెంట్లను గౌరవిస్తున్నట్లు ప్రకటించారు. ఈ వివాదం వల్ల నొచ్చుకున్న వారికి క్షమాపణలు చెబుతూ... ప్రేక్షకుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా విమర్శలకు దారితీసిన ఆయా సీన్స్‌ను సినిమాలో మార్చాలని చిత్ర బృందం నిర్ణయించుకున్నట్లు బుచ్చిబాబు స్పష్టం చేశారు.

Tags:    

Similar News