'రామాయణ' ఇండియన్ ఫిల్మ్స్‌లో మరో గేమ్ ఛేంజర్?
రామాయణ ఇతిహాసం నేపథ్యంలో ఇండియన్ స్క్రీన్‌పై ఇంత వరకు ఎన్నో సినిమాలొచ్చాయి.;
రామాయణ ఇతిహాసం నేపథ్యంలో ఇండియన్ స్క్రీన్‌పై ఇంత వరకు ఎన్నో సినిమాలొచ్చాయి. భారతీయ భాషల్లో ఈ ఇతివృత్తంతో రూపొందిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అనిపించుకుంది. ఇప్పటికీ కొత్త కథ అనే ఫీల్‌ని కలిగించే రామాయణ గాథని ఈ సారి బిగ్ స్కేల్‌లో, హాలీవుడ్ హంగులతో, సరికొత్త సాంకేతికతతో ప్రేక్షకుల ముందుకుఉ తీసుకొస్తున్నారు దర్శకుడు నితీష్ తివారి. ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మూవీ `రామాయణ`.
శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్న ఈ మూవీలోని ఇతర కీలక పాత్రల్లో కేజీఎఫ్ స్టార్ యష్, బాబి డియోల్, అరుణ్ గోవిల్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, శోభన, ఇందిరా కృష్ణన్, రవి దూబే నటిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇమ్మోర్టల్ స్టోరీ ఆఫ్ రామ వర్సెస్ రావణగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఐమ్యాక్స్ వెర్షన్‌లో హాలీవుడ్ టెక్నీషియన్స్‌తో రూపొందుతున్నఈ ఇతిహాస గాథ ఇండియన్ సినిమాల్లో మరో గేమ్ ఛేంజర్‌గా నిలవనుందనే చర్చ జరుగుతోంది.
మూకీ నుంచి ఇప్పటి వరకు భారతీయ సినిమాల్లో విప్లవవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. ఒక్కో తరానికి ఒక్కో సినిమా గేమ్ ఛేంజర్‌గా మారి ఇండియన్ సినిమా రూపలేఖల్నే సమూలంగా మార్చేసింది. అయితే బడ్జెట్, పరంగా టెక్నాలజీ పరంగా,మేకింగ్ పరంగా `రామాయణ` ఇండియన్ హిస్టరీలో సరికొత్త చరిత్రని లిఖించనుందని ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఎనిమిది అకాడమీ అవార్డుల్ని సొంతం చేసుకున్నడీఎన్ఈజీ స్టూడియో ఈ మూవీకి విజువల్ ఎఫెక్ట్స్‌ని అందిస్తోంది.
ఏ.ఆర్.రెహమాన్‌తో కలిసి హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హన్స్ జిమ్మర్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. హన్స్ జిమ్మర్ `డంకిర్క్`, డూన్, టాప్ గన్ మూవీకిక్ వంటి పలు ఆస్కార్ విన్నింగ్ సినిమాలకు సంగీతం అందించాడు. తనతో పాటు హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ టెక్నీషియన్స్, నమిత్ మల్హోత్రాతో కలిసి హీరో యష్ నిర్మిస్తుండటం, రెండు భాగాల్లో ఫస్ట్ పార్ట్ కోసమే ఏకంగా రూ.800 కోట్లకు మించి ఖర్చు చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై సర్వత్రా అంచనాలు ఏర్పడ్డాయి.
అంతే కాకుండా రెండు భాగాల కోసం ఏకంగా నాలుగు వంద కోట్లు ఖర్చు చేయబోతున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే మేకింగ్ పరంగా, బిజినెస్ పరంగా భారతీయ సినిమాల్లో `రామాయణ` సరికొత్త రికార్డులు సృష్టించి గేమ్‌ఛేంజర్‌గా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మూవీ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరగనున్న నేపథ్యంలో `రామాయణ` పార్ట్ 1 2026 దీపావళికి విడుదలై ఎలాంటి సంచలనాలకు తెర తీస్తుందో వేచి చూడాల్సిందే.