కొత్త ప్రమోషన్ ఫార్ములా..మరి మనోళ్లు అనుసరిస్తారా?
కంటెంట్ ఉంటే కటౌట్ తో పనిలేదని ఇప్పటికే చాలా చిన్ని సినిమాల సక్సెస్ తో ప్రూవ్ అయింది.;
కంటెంట్ ఉంటే కటౌట్ తో పనిలేదని ఇప్పటికే చాలా చిన్ని సినిమాల సక్సెస్ తో ప్రూవ్ అయింది. తెలుగు మార్కెట్ లో ఇతర భాషల చిత్రాలు భారీ వసూళ్ల సాధించిన చిత్రాలెన్నో ఉన్నాయి. నిజానికి వాటికి ఇక్కడ పెద్దగా ప్రచారం చేయలేదు. తెలివిగా ఎక్కువ థియేటర్లలో రిలీజ్ అయ్యేలా చూసుకున్నారు. బలమైన కంటెంట్ కావడంతో? ప్రేక్షకులకు కనెక్ట్ అయి భారీ వసూళ్లను సాధించాయి. ఇటీవలే రిలీజ్ అయిన `ధురంధర్ 2` పాన్ ఇండియాలో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పటికే సినిమా 1100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.
లాంగ్ రన్ లో బాక్సాఫీస్ వద్ద 2000 కోట్ల మార్క్ ను దాటి సరికొత్త రికార్డు సృష్టిస్తుందనే అంచనాలు బలంగా ఉన్నాయి. ఈ విషయంలో ట్రేడ్ సైతం ఎంతో నమ్మకంగా ఉంది. దేశంలో అన్ని భాషల్లోనూ రిలీజ్ అయిన చిత్రం కాబట్టి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా సింగిల్ లాగ్వెంజ్లోనే `ధురంధర్` మొదటి భాగం 1400 కోట్లను కొల్లగొట్టింది. కాబట్టి పార్ట్ 2 సరికొత్త రికార్డు సృష్టించడం ఖాయమే. మరి ఈ సినిమాకు దర్శకుడు అదిత్య ధర్ ఎలాంటి ప్రచారం చేసాడు? అంటే ప్రచారం కోసం ఆయన కోట్ల రూపాయలు ఖర్చు చేయలేదు.
భారీ ఈవెంట్లు నిర్వహించలేదు. తనటీమ్ ఇండియా అంతటా తిరిగి ప్రచారం చేయలేదు. మెట్రో పాలిటన్ సిటీస్ ను అసలే టార్గెట్ చేయలేదు. కేవలం సోషల్ మీడియాలో ప్రచారం తప్ప అంతకు మించి అదిత్య ధర్ అండ్ కో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా పెద్దగా ప్రచారానికి ఛాన్స్ ఇవ్వలేదు. కాన్సెప్ట్ పోస్టర్లు..సోషల్ మీడియాను తెలివిగా వినియోగించుకుని `ధురంధర్ 2` చిత్రాన్ని జనాల్లోకి తీసుకెళ్లారు. అందుకోసం పెద్దగా ఖర్చు కూడా అవ్వలేదు. ఆ రకంగా చూస్తే? ప్రచారంలో ఇదొ కొత్త ఫార్ములాగా చెప్పొచ్చు.
అదే తెలుగు నుంచి ఓ పాన్ ఇండియా సినిమా రిలీజ్ అవుతుందంటే? ప్రచారం ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ప్రచారం కోసమే కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. అవసరమైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం పెద్ద పెద్ద సెట్లు వేస్తారు. ఇండియా అంతా ప్రచారం చేస్తారు. ఏ ఒక్క మీడియాను వదలిపెట్టరు. వీలైనంత వరకూ ఎన్ని మీడియా సంస్థలుంటే అన్నింటిని చుట్టేస్తారు. రిలీజ్ సమయం దగ్గర పడే కొద్ది ఈ తంతు పీక్స్ లో కనిపిస్తుంది. హీరోల దగ్గర నుంచి చిన్న చిన్న నటుల వరకూ అందరూ ప్రచారంలో పాల్గొనాల్సిందే.
సినిమా తీయడం ఒక ఎత్తైతే? దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి పెట్టే ఖర్చు మరో ఎత్తులా కనిపిస్తుంది. మరి రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్ లాంటి తెలుగు దర్శకుల నుంచి రిలీజ్ అయ్యే అప్ కమింగ్ సినిమాల విషయంలో ప్రచారం పాత పద్దతిలోనే ఉంటుందా? `ధురంధర్` తరహాలో వైబ్ తీసుకొచ్చి జనాల ముందుకు తమ కంటెంట్ ను తీసుకొస్తారా? అన్నది చూడాలి. `వారణాసి` పై అప్ డేట్ ఇచ్చినా ? ఇవ్వకపోయినా? సినిమా మాత్రం నిరంతరం వార్తల్లోనే ఉంటుంది. `వారణాసి` కాంబినేషన్ మీద ఉన్న నమ్మకమే ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతోంది.
బన్నీ-అట్లీ సినిమా విషయంలోనూ ఇదే సన్నివేశం కనిపిస్తోంది. అలాగే `స్పిరిట్`, ఎన్టీఆర్ -ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ విషయంలోనూ బజ్ ఏమాత్రం తగ్గలేదు. మేకర్స్ అధికారికంగా ఏ విషయం చెప్పినా? చెప్పకపోయినా?ఏదో రూపంలో ఆ సినిమాలు నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. మరి ఈ ప్రచారం సినిమాకు సరిపోదా? లేదా? అన్నది తేలాలంటే `ధురంధర్` ని ఆదిత్యధర్ రిలీజ్ చేసినట్లు చేస్తే గానీ క్లారిటీ రాదు.