10 రూపాయల ప్రాడక్ట్‌ను 180 కోట్ల బ్రాండ్‌గా మార్చిన నటి!
పటికలో ఉన్న యాంటీ-బాక్టీరియల్, చర్మాన్ని బిగుతుగా చేసే గుణాలను ఆధునిక ప్యాకేజింగ్ , శాస్త్రీయ పద్ధతుల ద్వారా ప్రీమియం ప్రొడక్ట్‌గా నేహా మార్చగలిగారు.
భారతీయ బుల్లితెరపై `బాలికా వధు` (తెలుగులో 'చిన్నారి పెళ్ళికూతురు') ధారావాహిక లో గెహ్నా పాత్రలో ప్రేక్షకులకు దగ్గరైన నటి నేహా మర్దా. అమ్మడు నటనకే పరిమితం కాకుండా విజయవంతమైన వ్యాపారవేత్తగా సాధించిన ప్రగతి ఇప్పుడు ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. పది రూపాయల విలువైన సాధారణ దేశీయ వస్తువును ఆధారం చేసుకుని ఏకంగా 180 కోట్ల రూపాయల విలువైన బ్రాండ్‌ను సృష్టించి వ్యాపార రంగంలో సరికొత్త సంచలనం సృష్టించారు నేహా మర్దా. గ్లామర్ ప్రపంచం నుండి వ్యాపార సామ్రాజ్యం వైపు మర్దా వేసిన అడుగులు నూతన పారిశ్రామికవేత్తలకు చక్కని పాఠంలా నిలిచారు.
నేహా మర్దా ప్రారంభించిన ఈ వినూత్న బ్రాండ్ పేరు `ఫిట్కూ`. భారతీయ సాంప్రదాయ గృహాలలో శతాబ్దాలుగా వాడుతున్న పటిక విశిష్టతను గుర్తించిన నేహా దానిని ఆధునిక పర్సనల్ కేర్ , బ్యూటీ ప్రొడక్ట్‌గా మార్చాలని సంకల్పించారు. మార్కెట్లో పది రూపాయలకే లభించే పటిక ముక్కను నేటి తరం వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రీబ్రాండ్ చేశారు. సాంప్రదాయ జ్ఞానాన్ని ఆధునిక మార్కెటింగ్ పద్ధతులతో ముడిపెట్టడమే ఆమె విజయానికి తొలి అడుగుగా నిలిచింది. ఈ వ్యాపార ఆలోచన వెనుక ఉన్న నేపథ్యాన్ని పరిశీలిస్తే సహజసిద్ధమైన , రసాయన రహిత ఉత్పత్తులకు ప్రస్తుత మార్కెట్లో ఉన్న డిమాండే దీనికి కారణమని తెలుస్తుంది.
పటికలో ఉన్న యాంటీ-బాక్టీరియల్, చర్మాన్ని బిగుతుగా చేసే గుణాలను ఆధునిక ప్యాకేజింగ్ , శాస్త్రీయ పద్ధతుల ద్వారా ప్రీమియం ప్రొడక్ట్‌గా నేహా మార్చగలిగారు. సాధారణంగా దొరికే వస్తువునే ఒక బ్రాండ్‌గా మార్చవచ్చనే నమ్మకం, నాణ్యతపై ఆమె ఉంచిన శ్రద్ధ వినియోగ దారులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఒక నటిగా బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పటికీ వ్యాపార వ్యూహాలను పక్కాగా అమలు చేయడంలో నేహా మర్దా ఎక్కడా రాజీ పడలేదు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను , తనకున్న సెలబ్రిటీ ఇమేజ్‌ను బ్రాండ్ ప్రమోషన్ కోసం సమర్థవంతంగా ఉపయోగించుకున్నారు. రసాయనాలతో కూడిన ఖరీదైన సౌందర్య ఉత్పత్తుల కంటే తక్కువ ధరలో లభించే సాంప్రదాయ పద్ధతులే ఎంతో మేలనే సందేశాన్ని ఆమె ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఈ వ్యూహం తక్కువ కాలంలోనే దేశవ్యాప్తంగా బ్రాండ్ గుర్తింపు సాధించడానికి దోహదపడింది.
ప్రస్తుతం `ఫిట్కూ` సంస్థ మార్కెట్ విలువ 180 కోట్లకు చేరుకోవడం స్టార్టప్ రంగంలో ఒక మైలురాయిగా చెప్పొచ్చు . ఒకే ఒక ప్రాడక్ట్‌తో ప్రారంభమైన ఈ ప్రయాణం ఇప్పుడు విభిన్న రకాల పర్సనల్ కేర్ రేంజ్‌లోకి విస్తరిస్తోంది. చౌకగా లభించే దేశీయ వనరులను అంతర్జాతీయ ప్రమాణాలతో బ్రాండింగ్ చేస్తే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో నేహా మర్దా వ్యాపార విజయం ద్వారా ప్రాక్టికల్‌గా నిరూపించారు. గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్న మహిళలు వ్యాపార రంగంలోకి అడుగుపెడితే బ్రాండ్ అంబాసిడర్లుగా మాత్రమే మిగిలిపోతారనే అపోహను నేహా తిప్పికొట్టారు. ఒక ఐడియాను నమ్మి, దానికి కష్టాన్ని జోడిస్తే ఎంతటి అసాధ్యాన్ని అయినా సాధ్యం చేయోచ్చని నేహా మర్దా నిరూపించారు. నటిగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఆమె ఇప్పుడు ఒక సక్సెస్‌ఫుల్ బిజినెస్ ఉమెన్‌గా మారి మరింత మంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.