NBK111పై లేని ఒత్తిడి NBK112 పైనే ఎందుకు?

ముఖ్యంగా రెగ్యులర్ మాస్ మసాలా యాక్షన్ సినిమాల కంటే భిన్నంగా కొరటాల శివ ఈ చిత్రంలో బాలయ్యను ఎలా చూపిస్తారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

Update: 2026-07-01 03:54 GMT

ఇటీవలి కాలంలో అగ్ర హీరోల సినిమాలపై ట్రెండ్ సెట్టర్ చిత్రాల ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా భారీ స్థాయి మేకింగ్, సరికొత్త స్క్రీన్ ప్లే ఫార్మాట్, ఎమోషనల్ కంటెంట్ వంటి అంశాలు ప్రేక్షకుల ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. ఒక పరిశ్రమలో ఒక గొప్ప మైలురాయి లాంటి సినిమా వచ్చి వెళ్లాక, ఆ తర్వాత వచ్చే అగ్ర హీరోల సినిమాల నుంచి కూడా ప్రజలు అదే స్థాయి కంటెంట్‌ను ఆశిస్తున్నారు. అంతకంటే తక్కువ స్థాయి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు అస్సలు అంగీకరించడం లేదు. వయస్సుతో సంబంధం లేకుండా ఇప్పటికీ ఎంతో జోష్‌తో నటిస్తున్న నందమూరి బాలకృష్ణ (NBK) నుంచి కేవలం మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్లనే ఆశించినా.. అందులో సరికొత్త స్క్రీన్ ప్లే ఫార్మాట్... వినూత్నమైన యాక్షన్ ఎలిమెంట్స్ ఉండాలని కోరుకుంటున్నారు. ఇటీవలి కాలంలో మాస్ అభిమానుల్లో సైతం ఈ తరహా రియలిజం, సరికొత్త అట్రాక్షన్ పట్ల ఆసక్తి బాగా కొనసాగుతోంది.

ఈ క్రమంలోనే బాలకృష్ణ లైనప్‌లో ఉన్న చిత్రాలపై ట్రేడ్ వర్గాల్లో, అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న #NBK111 చిత్రం కంటే, కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న #NBK112 ప్రాజెక్ట్ పైనే ఎక్కువ ఒత్తిడి కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ప్రేక్షకులు ఇప్పుడు రొటీన్ ఫార్ములా సినిమాలకు భిన్నంగా.. అత్యున్నత స్థాయి కంటెంట్‌ను ఆశిస్తుండటమే దీనికి ప్రధాన కారణం. ఈ నేపథ్యంలోనే కొరటాల ప్లాన్ చేస్తున్న ఈ మూవీలో కంటెంట్ స్థాయి, స్క్రీన్ ప్లే ఫార్మాట్ అత్యంత ఇంటెన్స్ వేలో ఉండాలని అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు.

ముఖ్యంగా రెగ్యులర్ మాస్ మసాలా యాక్షన్ సినిమాల కంటే భిన్నంగా కొరటాల శివ ఈ చిత్రంలో బాలయ్యను ఎలా చూపిస్తారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. సోష‌ల్ మీడియా డిబేట్ల ప్రకారం.. కొరటాల ఈ సినిమాను రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. సీమ నేపథ్యం అనగానే బాలకృష్ణ మార్క్ పవర్‌ఫుల్ యాక్షన్ గుర్తొచ్చినా మునుపటి సినిమాలను గుర్తుచేసేలా రొటీన్ కథతో వస్తే అది నేటి ట్రెండ్‌కు అస్సలు సూట్ కాదు. అందుకే ఇప్పుడు కొరటాల శివ ఈ నేటి తరం ట్రెండ్‌కు తగ్గట్టుగా కొత్త కంటెంట్‌ను ఎలా పుల్ చేస్తాడు? ఎలాంటి సరికొత్త కథనంతో మెప్పిస్తాడు? అన్నదే ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. బాలయ్య నుంచి కేవలం రొటీన్ మాస్ ఎలివేషన్లు మాత్రమే తెరపై చూపిస్తే ఇప్పుడు పనవ్వదని విశ్లేషిస్తున్నారు. ఓటీటీ కంటెంట్‌లో వైవిధ్యం.. డిజిట‌ల్ మాధ్య‌మాల్లో వెరైటీని ఆస్వాధిస్తున్న ప్ర‌జ‌ల‌కు ఇంకా స‌మ‌ర‌సింహారెడ్డి, న‌ర‌సింహారెడ్డి త‌ర‌హా సీమ యాక్ష‌న్ ని చూపించినా మెప్పించ‌డం క‌ష్ట‌మేన‌ని విశ్లేషిస్తున్నారు.

మరోవైపు #ఎన్‌.బి.కే111 చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న గోపీచంద్ మలినేని మాత్రం అభిమానులు బాలయ్య నుంచి పక్కాగా ఏం ఆశిస్తారో అలాంటి కంటెంట్‌నే ఎంపిక చేసుకుని చిత్రీకరణను వేగంగా పూర్తి చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన `వీరసింహారెడ్డి` భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ సెంటిమెంట్‌తోనే గోపీచంద్ మలినేని మరో పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కథనే ఎంపిక చేసుకున్నారనే టాక్ నడుస్తోంది. అయితే స్క్రీన్ ప్లే వైవిధ్యం, ట్విస్టుల‌తో గోపిచంద్ గ‌ట్టిగానే ప్లాన్ చేసార‌నే టాక్ ఉంది. ఈ సినిమా ముంబై మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని, ఇందులో బాలయ్య ఒక శక్తివంతమైన డాన్ పాత్రలో కనిపిస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కాబట్టి ఈ ప్రాజెక్ట్‌ను అభిమానులు ఇప్పటికే ఒక పెద్ద స్థాయిలోనే ఊహించుకుంటున్నారు.

మొత్తానికి చూసుకుంటే.. గోపీచంద్ మలినేని సినిమా పక్కా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సేఫ్ జోన్‌లో సాగుతుండటంతో దానిపై పెద్దగా ఒత్తిడి కనిపించడం లేదు. కానీ కొరటాల శివ సినిమా అనగానే కథలో సామాజిక అంశంతో పాటు ఇంటెన్స్ డ్రామా ఆశిస్తారు. అందుకే రొటీన్ మాస్ ఎలివేషన్లకు భిన్నంగా బాలకృష్ణలోని సరికొత్త నటుడిని కొరటాల ఎలా ప్రెజెంట్ చేస్తారనే భారీ అంచనాలే #ఎన్‌.బి.కే112 పై ఈ స్థాయి ఒత్తిడిని పెంచేలా చేశాయి. ఈ ఇద్దరు దర్శకులు బాలయ్య జోష్‌ను బాక్సాఫీస్ వద్ద ఎలా వాడుకుంటారో చూడాలి.

Tags:    

Similar News