సినిమాల్లోనే కాదు.. పెట్టుబడుల్లోనూ నయనతార సూపర్ ప్లానింగ్!

ఇటీవలి కాలంలో సినీ ప్రముఖుల పెట్టుబడుల ధోరణిలో రియల్ ఎస్టేట్ కీలక స్థానాన్ని సంపాదించుకుంది.

Update: 2026-07-25 05:50 GMT

ఇటీవలి కాలంలో సినీ ప్రముఖుల పెట్టుబడుల ధోరణిలో రియల్ ఎస్టేట్ కీలక స్థానాన్ని సంపాదించుకుంది. ముఖ్యంగా మెట్రో నగరాల్లోని ప్రైమ్ లొకేషన్లలో ల‌గ్జరీ ఇళ్లు, విల్లాలు, అపార్ట్‌మెంట్లను కొనుగోలు చేయడం స్టార్‌లలో పెరుగుతున్న ట్రెండ్‌గా కనిపిస్తోంది. కెరీర్‌లో సంపాదించిన ధ‌నాన్ని దీర్ఘకాలిక ఆస్తులుగా మార్చుకోవడం, కుటుంబానికి ఒక మంచి సేఫ్టీ, ల‌గ్జ‌రీ ఇంటిని ఏర్ప‌ర‌చుకోవ‌డం, ఫ్యూచ‌ర్ పెట్టుబ‌డిగా వాల్యూ పెరిగే ఏరియాను సెలెక్ట్ చేసుకోవ‌డం వంటి కారణాలతో సినీ ప్రముఖులు రియల్ ఎస్టేట్‌పై ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఈ ట్రెండ్‌లో తాజాగా సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార పేరు కూడా చేరింది. చెన్నైలోని అత్యంత ప్రతిష్టాత్మక ప్రాంతాల్లో ఒకటైన పోయెస్ గార్డెన్‌లో సుమారు రూ.40 కోట్ల విలువైన లగ్జరీ విల్లాను ఆమె కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ కొనుగోలు సినీ, రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఆసక్తికర అంశంగా మారింది. చెన్నైలో పోయెస్ గార్డెన్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎన్నో దశాబ్దాలుగా ఇది రాజకీయ, సినీ ప్రముఖులుండే ఏరియాగా పేరొందింది. ప్రశాంతమైన వాతావరణం, అత్యున్నత భద్రత, నగరంలోని కీలక ప్రాంతాలకు అనుసంధానం, పరిమిత స్థల లభ్యత వంటి అంశాలు ఈ ఏరియాను అత్యంత విలువైన అడ్రస్‌గా నిలబెట్టాయి. అందుకే ఇక్కడ ఆస్తి కొనుగోలు చేయడం కేవలం నివాస అవసరంగా కాకుండా, ప్రిస్టీజియ‌స్ ఇన్వెస్ట్‌మెంట్‌గా కూడా పరిగణించబడుతోంది.

గత కొన్నేళ్లుగా స్టార్ నటీనటులు కమర్షియల్ ప్రాపర్టీలు, లగ్జరీ విల్లాలు, హైఎండ్ రెసిడెన్షియల్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెంచుతున్న ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. కేవ‌లం సినిమా ఆదాయం పైనే ఆధారపడకుండా, ఆస్తుల రూపంలో సంపదను విస్తరించుకోవడం ఇప్పుడు సెలబ్రిటీల ఆర్థిక ప్రణాళికలో భాగంగా మారిందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రైమ్ లొకేషన్లలో ల్యాండ్ వాల్యూ రెగ్యుల‌ర్ గా పెరుగుతుండటంతో, ఇలాంటి ఇన్వెస్ట్‌మెంట్స్ ఫ్యూచ‌ర్ లో మరింత లాభదాయకంగా మారే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.

ఇదే సమయంలో నయనతార కెరీర్ కూడా బిజీగానే కొనసాగుతోంది. వరుస సినిమాలతో ఆమె సౌత్ సినీ ఇండ‌స్ట్రీలో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్ ల‌లో ఒకరిగా కొనసాగుతున్నారు. కెరీర్‌లో స్థిరమైన మార్కెట్‌ను కొనసాగిస్తూనే, ఆర్థికంగా విలువైన ఆస్తులపై దృష్టి పెట్టడం ద్వారా దీర్ఘకాలిక ప్లానింగ్‌ను అమలు చేస్తున్న స్టార్‌ల లిస్ట్‌లో ఆమె కూడా నిలిచినట్టే కనిపిస్తోంది. సినీ ప్రపంచంలో స్టార్‌డమ్ ఎంత ముఖ్యమో, దాంతో వచ్చిన సంపాదనను సరైన పెట్టుబడులుగా మలచుకోవడం కూడా అంతే కీలకమనే విషయాన్ని ఈ పరిణామాలు మరోసారి గుర్తు చేస్తున్నాయి.

Tags:    

Similar News