హీరోయిన్ల డేరింగ్ స్టెప్స్: కూతుళ్లు, చెల్లెళ్లుగా!

ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నటీమణులు తమ గ్లామర్ ఇమేజ్ దెబ్బతింటుందనే భయంతో ఇలాంటి పాత్రలకు దూరంగా ఉండేవారు. కానీ కాలం మారింది.

Update: 2026-08-23 15:30 GMT

ఒకప్పుడు గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితమైన నటీమణులు నేడు కథా ప్రాధాన్యత ఉన్న వైవిధ్యమైన‌ పాత్రలతో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. కెరీర్ పీక్స్‌లో ఉన్నా? హీరోయిన్‌గా మాత్రమే కాకుండా కథ డిమాండ్ మేరకు హీరోలతో సమానంగా స్క్రీన్ షేర్ చేసుకుంటూ కూతుళ్లుగా, చెల్లెళ్లుగా నటించడానికి నేటి భామలు ఏమాత్రం వెనుకాడటం లేదు. నటీమణుల సాహసోపేతమైన అడుగులు చిత్ర పరిశ్రమలో సరికొత్త సంస్కృతికి తెరలేపుతున్నాయి.

ఈ కోవలో యువ నటి అనస్వర రాజన్ రాబోయే `కాకా` చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి కూతురిగా నటిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం `టాక్సిక్` లో యశ్ సోదరిగా (అక్కగా) న‌టిస్తున్నారు. కెరీర్‌లో అత్యున్నత స్థాయిలో ఉన్న తరుణంలో ఇలాంటి కీలకమైన కుటుంబ సంబంధాల పాత్రలను ఎంచుకోవడం వారి వృత్తిపరమైన పరిణతికి అద్దం పడుతోంది.

ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నటీమణులు తమ గ్లామర్ ఇమేజ్ దెబ్బతింటుందనే భయంతో ఇలాంటి పాత్రలకు దూరంగా ఉండేవారు. కానీ కాలం మారింది. ప్రేక్షకుల ఆలోచనా విధానం కూడా పూర్తిగా మార్పు చెందింది. పాటలు, రొమాంటిక్ సన్నివేశాలకే పరిమితం కాకుండా సినిమా కథను ముందుకు నడిపించే భావో ద్వేగభరితమైన పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ కీర్తి సురేష్ సైతం ఇలాంటి రోల్స్ పోషించి ప్రశంసలు అందుకుంటున్నారు.

ఈ తరహా డేరింగ్ నిర్ణయాలు నటీమణుల నటనా పరిధిని మరింత విస్తృతం చేయడమే కాకుండా సినిమాకు బల మైన భావోద్వేగ బలాన్ని ఇస్తున్నాయి. హీరో-హీరోయిన్ల మధ్య రొమాన్స్ అనే మూస పద్ధతి నుంచి బయటపడి అన్నదమ్ములు, తండ్రీకూతుళ్ల అనుబంధాల వంటి విభిన్న కోణాలను తెరపై ఆవిష్కరించడానికి దర్శకులకు కూడా ఇది గొప్ప అవకాశంగా మారుతోంది.

ప్రస్తుతం పాన్-ఇండియా చిత్రాల జోరు ఎక్కువగా ఉన్న తరుణంలో భారీ యాక్షన్ సీన్ల మధ్య బలమైన సెంటిమెంట్ పండించాలంటే? ఇలాంటి పాత్రలు అత్యంత కీలకం అవుతున్నాయి. ఇమేజ్ చట్రంలో బందీ అయిపోకుండా కథే ప్రధానమనే నమ్మకంతో ముందుకు సాగుతున్న నటీమణుల నిబద్ధత ఇండస్ట్రీలో మిగతావారికీ రోల్ మోడల్‌గా నిలుస్తోంది.

మొత్తానికి ఇమేజ్ బేడీలను తెంచుకుంటూ అగ్ర నటీమణులు చేస్తున్న సాహసోపేతమైన ప్రయోగాలు భారతీయ సినిమా స్థాయిని మరింత పెంచుతున్నాయి. పాత్ర ఏదైనా? అందులో పరకాయ ప్రవేశం చేసి మెప్పించగలగడమే నిజమైన నటి లక్షణమని నిరూపిస్తున్న భామల నిర్ణయం తెలుగుతో పాటు అన్ని సినీ పరిశ్రమల్లోనూ అభినందనీయం.

Tags:    

Similar News