అన్నీ స్వార్థపూరిత స్నేహాలు.. సీనియర్ నటుడి ఆవేదన..
కేన్స్ 2025 ఉత్సవాల్లో భారతీయ ప్రముఖుల సందడి ఉత్సాహం పెంచుతోంది. నవాజుద్దీన్ లాంటి ప్రముఖ నటుడు కేన్స్ లో అడుగుపెట్టనున్నాడు.;
కేన్స్ 2025 ఉత్సవాల్లో భారతీయ ప్రముఖుల సందడి ఉత్సాహం పెంచుతోంది. నవాజుద్దీన్ లాంటి ప్రముఖ నటుడు కేన్స్ లో అడుగుపెట్టనున్నాడు. మే 21న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అన్ సర్టెయిన్ రిగార్డ్ విభాగంలో ఘయ్వాన్ `హోమ్‌బౌండ్` ప్రీమియర్‌కు కొన్ని రోజుల ముందు నవాజ్ బాలీవుడ్ ఫిలింమేకర్స్ కాపీ క్యాట్ బుద్ధిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
బాలీవుడ్ కొన్నేళ్లుగా రీమేకులు, అనువాదాలపై ఆధారపడిందని, ఒరిజినల్ కంటెంట్ సృష్టి కర్తలను వెళ్లగొట్టిందని నవాజుద్దీన్ వ్యాఖ్యానించారు. రిపీటెడ్ ఫార్ములాలు, సీక్వెల్‌లు, కాపీ కంటెంట్‌పై పరిశ్రమకు ఉన్న వ్యామోహాన్ని నవాజుద్దీన్ వెలుగులోకి తెచ్చారు. సినిమాలో వాస్తవికత లేకపోవడాన్ని ఆందోళనకరమని ఎత్తి చూపారు. ఒకప్పుడు ధైర్యమైన కథ చెప్పడంతో హిందీ సినిమాను రీడిఫైన్ చేసిన అనురాగ్ కశ్యప్ వంటి దార్శనిక ఫిలింమేకర్స్ ని ఉక్కిరిబిక్కిరి చేసే వాతావరణం ఉందని అన్నారు. అనురాగ్ ను పరిశ్రమకు ఎలా దూరం చేసారో కూడా చెప్పాడు. హిందీ సినీప్రముఖులు కొన్ని దక్షిణాది చిత్రాలను చూపించి వాటికి కాపీలు తీయమని అడిగారని కూడా నవాజుద్దీన్ లోగుట్టు బయటపెట్టారు. ఇరుగు పొరుగు భాషల నుంచి రీమేకులపై ఆధారపడిన బాలీవుడ్ లో ఒరిజినల్ కంటెంట్ సృష్టి కనుమరుగైందని ఆందోళన వ్యక్తం చేసారు. దీనిని సృజనాత్మక పేదరికం అనాలని ఆయన సూచించారు.
అనురాగ్ కశ్యప్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్, రితేష్ బాత్రా రాసిన ది లంచ్‌బాక్స్, అసీమ్ అహ్లువాలియా మిస్ లవ్లీ వంటి తన ఎనిమిది చిత్రాలతో కేన్స్‌కు ప్రయాణించిన సిద్ధిఖీ, వెబ్ సిరీస్ `సేక్రెడ్ గేమ్స్` రెండవ సీజన్‌లో ఘయ్వాన్‌తో కలిసి పనిచేశారు. ఘయ్వాన్ హోమ్ బౌండ్ కోసం కేన్స్ కి నవాజుద్దీన్ వస్తున్నాడు.
నవాజుద్దీన్ సిద్ధిఖీ బాలీవుడ్ ను పీడిస్తున్న అభద్రత, నకిలీ స్నేహాలు, నైపుణ్యం లేని నటీనటుల ఎంపిక గురించి కూడా తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. హిందీ సినీ పరిశ్రమలో స్నేహాలు లేవు.. స్వార్థపూరిత ఆర్థిక సంబంధాలు మాత్రమే ఉన్నాయని అన్నారు. ఈ వాతావరణం అర్హులైన ప్రతిభను పక్కన పెట్టి, కోటరీని తయారు చేస్తుందని అన్నారు. ఇండస్ట్రీలో సహాయక పాత్రలలో శిక్షణ లేని వారికి అవకాశాలిస్తుందని అన్నారు. నైపుణ్యం లేని నటులు నాణ్యతను చెడగొడతారని కూడా అన్నాడు. ప్రతిభావంతులైన నటులకు అర్హత ఆధారంగా అవకాశాలివ్వకుండా దాచి పెడతారని కూడా బాలీవుడ్ రియాలిటీని బయటపెట్టారు.