రేవంత్ దూసుకెళుతున్నారు.. నంది అవార్డులు ఇవ్వ‌రా సార్? చంద్ర‌బాబుకి ఆర్.నారాయ‌ణ మూర్తి ద‌ణ్ణం!

తెలంగాణ గడ్డపై పుట్టిన తొలితరం సాహస వీరుడు తాడేపల్లి లక్ష్మీ కాంతారావు గొప్పతనాన్ని నారాయణమూర్తి ఈ సందర్భంగా గుర్తుచేశారు.;

Update: 2026-03-20 03:29 GMT

హైద‌రాబాద్ సినీప‌రిశ్ర‌మ అభివృద్ధిలో రేవంత్ రెడ్డి దూసుకుపోతుంటే చంద్ర‌బాబు నాయుడు వెన‌క‌బ‌డిపోయార‌ని ఆర్.నారాయ‌ణ‌మూర్తి మ‌రోసారి గుర్తు చేసారు. ఈ సంద‌ర్భంగా నంది అవార్డుల‌ను ఇవ్వాల‌ని సీఎం చంద్ర‌బాబును అభ్య‌ర్థిస్తూ నారాయ‌ణ మూర్తి.. మీకు ద‌ణ్ణం సార్! అని వ్యాఖ్యానించారు. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025-26 వేదికపై పీపుల్ స్టార్ ఆర్. నారాయణమూర్తి చేసిన ఆవేశపూరిత ప్రసంగం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వేడుకలో ఆయన మాట్లాడిన మాటలు సినీ విశ్లేషకులను, అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాయి.

గత 13 ఏళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమ నంది అవార్డుల కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తోందని.. కానీ ఏ ప్రభుత్వం కూడా దీనిని పట్టించుకోలేదని నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయంలో తెలంగాణ‌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని ఆయన కొనియాడారు. రేవంత్ రెడ్డిని `డేరింగ్ అండ్ డాషింగ్ హీరో`గా అభివర్ణిస్తూ.. గత ఏడాది మాట ఇచ్చిన విధంగానే ఇప్పుడు అమోఘంగా అవార్డుల వేడుకను నిర్వహిస్తున్నందుకు సెల్యూట్ చేశారు.

తెలంగాణ గడ్డపై పుట్టిన తొలితరం సాహస వీరుడు తాడేపల్లి లక్ష్మీ కాంతారావు గొప్పతనాన్ని నారాయణమూర్తి ఈ సందర్భంగా గుర్తుచేశారు. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి దిగ్గజాల తర్వాత అంతటి కీర్తి ప్రతిష్టలు గడించిన మూడో హీరో కాంతారావు గారేనని ఆయన స్పష్టం చేశారు. పౌరాణిక చిత్రాల్లో నారదుడిగా, లక్ష్మణుడిగా నటించి మెప్పించడమే కాకుండా, జానపద చిత్రాల్లో `కత్తి కాంతారావు`గా ఆయన చేసిన సాహసాలు తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డాయని అన్నారు. మహానటుడు కాంతారావు పేరు మీద తనకు అవార్డు లభించడం పట్ల నారాయణమూర్తి తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఈ గౌరవం తనకు లభించడం వల్ల తన జన్మ ధన్యమైందని ఆయన భావోద్వేగంతో పలికారు. తెలంగాణ నేల నుంచి వచ్చిన ఒక గొప్ప యోధుడి పేరుతో ఉన్న పురస్కారాన్ని అందుకోవడం తన జీవితంలో మర్చిపోలేని మధుర ఘట్టమని ఆయన పేర్కొన్నారు.

ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఉన్న కాలంలో తెలంగాణకు చెందిన కళాకారులు దూరం కారణంగా చిత్ర పరిశ్రమకు చేరువ కాలేకపోయారని.. అయినప్పటికీ కాంతారావు, ప్రభాకర్ రెడ్డి వంటి వారు తమ సత్తా చాటారని గుర్తుచేశారు. అలాగే కేవలం ప్రాంతీయ పేర్లతో కాకుండా, ప్రజా గాయకుడు గద్దర్ పేరుతో అవార్డులు ప్రకటించడం ప్రభుత్వం చేసిన గొప్ప కార్యమని రేవంత్ రెడ్డిని అభినందించారు. గద్దర్ ప్రపంచ స్థాయి వాగ్గేయకారుడని ఆయన ప్రశంసించారు.

ప్రసంగం చివరలో నారాయణమూర్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ఒక ప్రత్యేక విన్నపం చేశారు. వేదికపైనే రెండు చేతులు జోడించి దండం పెడుతూ.. నంది అవార్డులు ఇవ్వరా సార్? అని ప్రశ్నించారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిశ్రమను అభివృద్ధి చేస్తూ దూసుకెళ్లిపోతున్నారని.. అదే విధంగా ఏపీలో కూడా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉనికిని గుర్తించి నంది అవార్డులను పునరుద్ధరించాలని కోరారు.

పరిశ్రమను ఆదుకోవాలని, కళాకారులను ప్రోత్సహించాలని ఆయన చేసిన ఈ విన్నపం రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ చొరవ వల్ల సినీ పరిశ్రమకు నూతన జవజీవాలు అందాయని.. ఏపీ ప్రభుత్వం కూడా త్వరలోనే స్పందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూపిన ఈ చొరవ ఇతర రాష్ట్రాలకు కూడా స్ఫూర్తినిస్తుందని ఆయన త‌న ప్ర‌సంగాన్ని ముగించారు.

Tags:    

Similar News