నాని 'ది ప్యారడైజ్' మ‌రో కొత్త తేదీ ప్ర‌క‌టిస్తారా! అస‌లేం జ‌రుగుతోంది?

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా `ది ప్యారడైజ్` విడుదల తేదీపై సినీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన గుసగుస వినిపిస్తోంది.

Update: 2026-07-12 11:38 GMT

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా `ది ప్యారడైజ్` విడుదల తేదీపై సినీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన గుసగుస వినిపిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా విడుద‌ల ఆల‌స్యాలు ఫ్యాన్స్ లో అస‌హ‌నాన్ని పెంచుతున్నాయి. మొదట ఈ చిత్రాన్ని మార్చి 26న విడుదల చేయాలని భావించినా.. ఆ తర్వాత మేకర్స్ అధికారికంగా ఆగస్టు 21ని కొత్త రిలీజ్ డేట్‌గా ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రం ఆగస్టు రేస్ నుండి తప్పుకుని సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో గట్టిగా వినిపిస్తోంది.

ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క సినిమా వాయిదా పడటానికి ప్రధాన కారణం షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడమేనని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రికార్డు స్థాయిలో దాదాపు 140 పనిదినాల చిత్రీకరణను పూర్తి చేసుకున్నా విజువల్స్ పరంగా రాజీ పడకూడదనే ఉద్దేశంతో శ్రీకాంత్ ఓదెల చాలా నిశితంగా వర్క్ చేస్తున్నారు. ఇంకా భారీ భాగం షూటింగ్ బ్యాలెన్స్ ఉండటంతో.. అనుకున్న సమయానికి సినిమాను సిద్ధం చేయడం కోసం చిత్ర యూనిట్ రాత్రి పగలు అనకుండా నైట్ షూట్స్, మల్టిపుల్ యూనిట్స్‌తో కఠినమైన షెడ్యూల్స్ పాటిస్తోంది.

సినిమా ఔట్‌పుట్ అద్భుతంగా రావడం కోసం హీరో నాని కూడా తన శ్రమను రెట్టింపు చేశారు. ఈ సినిమా కోసం భారీ బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్‌తో పాటు.. రెండు జడల హెయిర్ స్టైల్.. పొడ‌వాటి గెడ్డంతో ఊరమాస్ లుక్‌లోకి మారిన నాని.. సినిమాను త్వరగా పూర్తి చేయడానికి డబుల్ షిఫ్టులు కూడా చేస్తున్నట్లు సమాచారం. సమాజంలో అణచివేతకు గురైన ఒక గిరిజన తెగ లేదా నిరుపేదల తరఫున పోరాడే ఒక పవర్‌ఫుల్ లీడర్ పాత్రలో నాని నటిస్తుండటంతో యాక్షన్ ఎపిసోడ్స్ కోసం అత‌డు ఎంతో శ్రమిస్తున్నారు.

ఇదే సమయంలో బాక్సాఫీస్ వద్ద ఎదురైన ఒక కొత్త పరిణామం కూడా ఈ సినిమా వాయిదా రూమర్లకు బలాన్ని చేకూరుస్తోంది. మాస్ మహారాజా రవితేజ- శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా `ఇరుముడి` విడుదల తేదీని మేకర్స్ ఇటీవల అధికారికంగా ఆగస్టు 21గా ప్రకటించారు. నాని సినిమా ఆల్రెడీ అనౌన్స్ చేసిన డేట్‌కే రవితేజ సినిమా కూడా రావడంతో బాక్సాఫీస్ క్లాష్ తప్పదని భావించారు. కానీ `ది ప్యారడైజ్` ప్రొడక్షన్ పనులు ఆలస్యం అవుతుండటంతోనే రవితేజ టీమ్ ఆ డేట్‌ను లాక్ చేసుకుందని.. నాని సినిమా సెప్టెంబర్‌కు వెళ్లడం దాదాపు ఖాయమైందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మ్యూజికల్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన మొదటి సింగిల్ `ఆయా షేర్` మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ భారీ పాన్-ఇండియా చిత్రంలో సీనియర్ నటుడు మోహన్ బాబు `షికాంజా మాలి` అనే అత్యంత ప్రమాదకరమైన విలన్ పాత్రలో నటిస్తుండగా.. సోనాలి కుల‌క‌ర్ణి, సంపూర్ణేష్ బాబు, తనికెళ్ల భరణి.. టాలీవుడ్‌కు పరిచయమవుతున్న రాఘవ్ జుయల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మేకర్స్ నుండి రిలీజ్ వాయిదాపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రిలీజ్ తేదీ విష‌యంలో డైల‌మా ఉన్నా.. నాని మార్క్ పర్ఫెక్షన్ కోసం ఫ్యాన్స్ మరికొంత కాలం వేచి చూడాల్సి ఉంటుంది.

Tags:    

Similar News