నాని ఫ్యాన్స్‌కు మరో షాక్.. ది ప్యారడైజ్ మళ్లీ వాయిదా?
అదే కారణంగా షూటింగ్ షెడ్యూళ్లు ఆలస్యమవుతున్నాయని, బడ్జెట్ కూడా అంచనాలను మించి పెరుగుతోందని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.
నేచురల్ స్టార్ నాని హీరోగా, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా ది ప్యారడైజ్ మరోసారి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దసరా వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో ప్రారంభం నుంచే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే షూటింగ్ షెడ్యూళ్లలో జరిగిన జాప్యం కారణంగా సినిమా రిలీజ్ డేట్ పదేపదే మారుతూ వస్తోంది. మొదట ఈ సినిమాను 2026 మార్చిలో రిలీజ్ చేయాలని భావించిన నిర్మాతలు, పనులు పూర్తి కాకపోవడంతో ఆగస్ట్ 21కు వాయిదా వేశారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ఆ తేదీకి కూడా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇదే సమయంలో ది ప్యారడైజ్ ఖాళీ చేయబోతున్న స్లాట్‌ను క్యాష్ చేసుకునేందుకు మాస్ మహారాజా రవితేజ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఇరుముడి సినిమాను ఆగస్ట్ 21న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. రీసెంట్ గా రిలీజైన గ్లింప్స్‌కు ఆడియన్స్ నుంచి వచ్చిన విశేష స్పందనకు ధన్యవాదాలు తెలుపుతూ మేకర్స్ రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేశారు.
దీంతో ఆగస్ట్ 21 తేదీపై ఉన్న సందిగ్ధతకు తెరపడింది. పెద్ద సినిమాల పోటీ మధ్య సరైన రిలీజ్ విండో కోసం ఎదురు చూస్తున్న ఇరుముడి టీమ్, ది ప్యారడైజ్ మళ్లీ వాయిదా పడొచ్చనే సంకేతాల నేపథ్యంలో ఆ డేట్ ను ఫైనల్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఈ పరిణామం నాని అభిమానులను కొంత నిరాశకు గురిచేస్తోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ది ప్యారడైజ్ ఎప్పుడు విడుదల అవుతుందనే ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం కనిపించడం లేదు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాను డైరెక్టర్ ఎక్కడా రాజీ పడకుండా తన విజన్‌కు అనుగుణంగా ప్రతి సన్నివేశాన్ని రూపొందిస్తున్నారని సమాచారం.
అదే కారణంగా షూటింగ్ షెడ్యూళ్లు ఆలస్యమవుతున్నాయని, బడ్జెట్ కూడా అంచనాలను మించి పెరుగుతోందని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. అయితే నిర్మాతలు మాత్రం సినిమా క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీకి సిద్ధంగా లేరని చెబుతున్నారు. అందుకే రిలీజ్ లేటైనా ఆడియన్స్ కు ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందించేలా సినిమాను తీర్చిదిద్దుతున్నారట. ప్రస్తుతం ది ప్యారడైజ్ కొత్త రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ఆగస్ట్ 21న ఇరుముడి బాక్సాఫీస్ బరిలోకి దిగడం మాత్రం ఖాయమైంది. దీంతో రానున్న రోజుల్లో ఈ రెండు సినిమాల చుట్టూ మరింత ఆసక్తికరమైన చర్చలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.