90ఏళ్లలో ఒకరు.. 70ఏళ్లలో మరొకరు.. మళ్లీ ప్రూవ్ చేస్తారా?
మ్యూజికల్ ఫాంటసీ నేపథ్యంలో రూపొందిన సింగ్ గీతం జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఆ చిత్రానికి కథను కూడా సింగీతమే అందించారు.
సినీ ఇండస్ట్రీలో టాలెంట్ కు వయసుతో సంబంధం ఉండదని తరచూ చెబుతుంటారు. ఇప్పుడు అదే విషయాన్ని మరోసారి గుర్తు చేసేలా ఇద్దరు దిగ్గజ దర్శకులు తమ కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఒకరు 90 ఏళ్లు దాటిన వయసులో, మరొకరు 70 ఏళ్లు దాటిన వయసులో సినిమాలు తెరకెక్కించి విడుదలకు సిద్ధం చేశారు. అది కూడా కేవలం ఒక్క రోజు గ్యాప్ లో ఆ చిత్రాలు ప్రేక్షకులను పలకరించనున్నాయి.
టాలీవుడ్ సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు రీసెంట్ గా తెరకెక్కించిన చిత్రం సింగ్ గీతం. దాదాపు 94 ఏళ్ల వయసులో కూడా ఆయన దర్శకత్వ బాధ్యతలు చేపట్టడం ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది. ప్రయోగాత్మక కథలు, కొత్త ఆలోచనలతో ఎన్నో క్లాసిక్ చిత్రాలను అందించిన సింగీతం.. మరోసారి విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
మ్యూజికల్ ఫాంటసీ నేపథ్యంలో రూపొందిన సింగ్ గీతం జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఆ చిత్రానికి కథను కూడా సింగీతమే అందించారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా నిర్మించగా, యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మాతగా వ్యవహరించడం విశేషం. అయాన్, అహల్యా బమ్రూ, షాలిని కొండెపూడి లీడ్ రోల్స్ లో నటించగా..ఇప్పటికే సినిమాపై ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది.
ఇక వరల్డ్ సినీ ఇండస్ట్రీలో పాపులర్ డైరెక్టర్స్ లో ఒకరైన స్టీవెన్ స్పీల్ బర్గ్ కూడా తన కొత్త మూవీతో సిద్ధమయ్యారు. ప్రస్తుతం 79 ఏళ్ల వయసులో ఉన్న ఆయన తెరకెక్కించిన డిస్ క్లోజర్ డే జూన్ 12న విడుదల కానుంది. జురాసిక్ పార్క్, ఈటీ, షిండ్లర్స్ లిస్ట్ వంటి ఎన్నో అద్భుత చిత్రాలను అందించిన స్పీల్‌బర్గ్.. మరోసారి సైన్స్ ఫిక్షన్ స్టోరీని సెలెక్ట్ చేసుకోవడం ఆసక్తిని పెంచుతోంది.
ఆ మూవీ ఏలియన్స్ కు సంబంధించిన సీక్రెట్స్ చుట్టూ తిరుగుతుంది. ప్రభుత్వం కొన్ని కీలక విషయాలు దాచిపెడుతుందనే అనుమానాల మధ్య నిజాన్ని వెలికితీయడానికి ఒక ఎన్విరాన్మెంట్ సైంటిస్ట్, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ చేసే పోరాటమే మెయిన్ స్టోరీ లైన్. ఎమిలీ బ్లంట్, జోష్ ఓకానర్, కోలిన్ ఫిర్త్, ఈవ్ హ్యూసన్, కోల్‌మన్ డొమింగో వంటి స్టార్ యాక్టర్స్ కీలక పాత్రలు పోషించారు.
అయితే సాధారణంగా ఇండస్ట్రీలో న్యూ జెనరేషన్ కు అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో సీనియర్ దర్శకులు వెనక్కి తగ్గుతున్నారనే అభిప్రాయం ఉంటుంది. కానీ సింగీతం శ్రీనివాసరావు, స్టీవెన్ స్పీల్ బర్గ్ లాంటి దిగ్గజాలు మాత్రం వయసు కేవలం ఒక నెంబర్ మాత్రమేనని చెబుతున్నారు. కొత్త కథలు చెప్పాలనే కోరిక, ప్రేక్షకులను అలరించాలనే టార్గెట్ ఉంటే క్రియేటివిటీకి ఏజ్ లిమిట్ ఉండదని అంటున్నారు.
ఇప్పుడు ఆ రెండు సినిమాలపై మూవీ లవర్స్ లో మంచి ఆసక్తి నెలకొంది. ఒకటి ఇండియన్ మ్యూజికల్ ఫాంటసీ, మరొకటి హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్. కథలు వేరు, జోనర్లు వేరు అయినా.. ఆ చిత్రాలను కలిపే ఒకే విషయం దర్శకుల ఎక్స్పీరియన్స్, వారి డెడికేషన్. అయితే ఆ సినిమాలు విజయం అందుకుంటే, టాలెంట్ కు వయసుతో సంబంధం లేదనే మాట మరోసారి ప్రూవ్ అవ్వనుంది. మరేం జరుగుతుందో అంతా వేచి చూడాలి.