కార్గిల్ యుద్ధభూమిలో నానా పటేకర్ సాహసోపేత ప్రయాణం!

1999 నాటి కార్గిల్ యుద్ధం సమయంలో నటుడు నానా పటేకర్ భారత సైనికులకు తోడుగా నిలవడానికి చూపిన చొరవ ఎంతో మందిని ఆకట్టుకుంటుంది.

Update: 2026-08-16 04:11 GMT

1999 నాటి కార్గిల్ యుద్ధం సమయంలో నటుడు నానా పటేకర్ భారత సైనికులకు తోడుగా నిలవడానికి చూపిన చొరవ ఎంతో మందిని ఆకట్టుకుంటుంది. తెరపై సైనికుడిగా నటించడమే కాకుండా నిజ జీవితంలో కూడా యుద్ధ భూమిలో సేవలు అందించాలని నానా ప‌టేక‌ర్ బలంగా కోరుకున్నారు. దీని కోసం ఆయన అప్పట్లో రక్షణ శాఖ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్‌ను సంప్రదించారు. మొదట అసాధ్యమని భావించినా? నానా పటేకర్ పట్టుదల దేశభక్తి ముందు మంత్రి కూడా తలొగ్గాల్సి వచ్చింది. నానా పటేకర్ అభ్యర్థనను ఫెర్నాండెజ్ అంగీకరించడానికి `ప్రహార్` సినిమా షూటింగ్ సమయంలో నానా ప‌టేక‌ర్ పొందిన శిక్షణ కీలక కారణంగా మారింది.

ఆ చిత్ర పాత్ర కోసం నానా మరాఠా లైట్ ఇన్ఫాంట్రీలో మూడు సంవత్సరాల పాటు కఠినమైన సైనిక శిక్షణ తీసుకున్నారు. తనకున్న అనుభవాన్ని నానా ప‌టేక‌ర్ వివరించినప్పుడు ఆయనకు యుద్ధ ప్రాంతానికి వెళ్లేందుకు ప్రత్యేక అనుమతి లభించింది. నటన కోసం నేర్చుకున్న విద్య, నిజమైన దేశసేవకు మార్గం సుగమం చేయడం విశేషం. యుద్ధ భూమికి చేరుకున్న నానా పటేకర్ సందర్శకుడిలా కాకుండా సైనికుడిలాగే గడిపారు. నియంత్రణ రేఖ సమీపంలోని బేస్ క్యాంపులలో సైనికులకు అండగా నిలవడమే కాకుండా మిలిటరీ హాస్పిటల్‌లో స్వచ్ఛంద సేవలు అందించారు.

క్విక్ రెస్పాన్స్ టీమ్‌తో కలిసి పనిచేసారు. యుద్ధ సమయంలో సైనికులు ఎదుర్కొనే భయంకరమైన పరిస్థితులను నానా స్వయంగా కళ్లారా చూశారు. సినిమా సెట్‌లో నటనకు, యుద్ధ క్షేత్రంలోని వాస్తవికతకు ఉన్న తేడాను నానా ప‌టేక‌ర్ అక్కడ అనుభవించారు. యుద్ధం ముగిసిన తర్వాత నానా పటేకర్ తిరిగి వచ్చినప్పుడు ఆయన శారీరక స్థితి చూసి అంతా ఆశ్చర్యపోయారు. కార్గిల్ వెళ్ళినప్పుడు నానా ప‌టేక‌ర్ బరువు 76 కిలోలు ఉండగా తిరిగి వచ్చేసరికి 56 కిలోలకు పడిపోయారు. యుద్ధ భూమిలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు, తీవ్రమైన మానసిక శారీరక ఒత్తిడి ఆయన్ని అంతగా ప్రభావితం చేసాయి.

అయితే 20 కిలోల బరువు తగ్గుదల కంటే దేశం కోసం పోరాడే సైనికుల త్యాగాలను దగ్గరగా చూడటం నానా ప‌టేక‌ర్కు దక్కిన అతిపెద్ద అనుభూతిగా నిలిచింది. ఈ అనుభవం నానా ప‌టేక‌ర్ వృత్తి జీవితాన్ని, దృక్పథాన్ని పూర్తిగా మార్చివేసింది. ఆ తర్వాత ఆయన నటించిన పలు దేశభక్తి ప్రధాన చిత్రాల్లో సైనికుల పట్ల ప‌టేక‌ర్ కున్న‌ గౌరవం ప్రతిబింబించింది. 2026లో విడుదలైన `సుబేదార్` వంటి చిత్రాల్లో కూడా నానా ప‌టేక‌ర్ ప్రదర్శించిన పరిణితికి ఆనాడు కార్గిల్ యుద్ధ క్షేత్రంలో పొందిన అనుభవమే పునాదిగా చెప్పొచ్చు. జీవితంలో ఆ రోజులు అత్యంత కీలకమైనవని పలుమార్లు గుర్తు చేసుకున్నారు.

నానా పటేకర్ వంటి కళాకారులు వినోదాన్ని అందించడమే కాదు . కష్టకాలంలో దేశానికి అండగా నిలవడం సమాజానికి గొప్ప స్ఫూర్తినిస్తుంది. యుద్ధభూమిలో సైనికులు అనుభవించే బాధలు, వారు చేసే త్యాగాలు సామాన్యులకు తెలియజేయడంలో నానా ప‌టేక‌ర్ వంటి వారి పాత్ర ఎంతో కీలకం. ఒక నటుడిగా తనకున్న ప్రాచుర్యాన్ని, దేశసేవ కోసం వినియోగించిన తీరు అభినందనీయం.

Tags:    

Similar News