'నేనున్నాను' ఫ్లాప్ అని ఫిక్స్ అయిపోతే..
అక్కినేని నాగార్జున కెరీర్లో పెద్ద హిట్లలో నేనున్నాను ఒకటి. ఒక టైంలో వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడ్డ నాగ్.. 2002లో సంతోషం మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చాడు.;
అక్కినేని నాగార్జున కెరీర్లో పెద్ద హిట్లలో నేనున్నాను ఒకటి. ఒక టైంలో వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడ్డ నాగ్.. 2002లో సంతోషం మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన్నుంచి వరుసగా హిట్లు వచ్చాయి. ఆ వరుసలో నేనున్నాను కూడా ఉంది. మనసంతా నువ్వే దర్శకుడు వి.ఎన్.ఆదిత్య డైరెక్ట్ చేసిన ఈ మూవీని నాగ్ ఫేవరెట్ ప్రొడ్యూసర్ శివప్రసాద్ రెడ్డి ప్రొడ్యూస్ చేశారు. ఐతే నేనున్నాను మొదట్లో డివైట్ టాకే తెచ్చుకుంది. తర్వాత నెమ్మదిగా పుంజుకుని.. 40కి పైగా సెంటర్లలో శతదినోత్సవం జరుపుకుంది. ఐతే ఆరంభంలో వచ్చిన టాక్ చూసి తనతో పాటు టీం అంతా బాగా నిరాశ చెందిందని.. ఆ సినిమా ఫ్లాప్ అని ఫిక్స్ అయిపోయామని.. కానీ సినిమా బాగా ఆడుతుందనే నమ్మకాన్ని గుంటూరులోని ఒక థియేటర్ యజమాని తమకు ఇచ్చాడని చెబుతూ ఆ అనుభవం గురించి ఒక ఇంటర్వ్యూలో ఆదిత్య చెప్పుకొచ్చాడు.
నేనున్నాను రిలీజైన తొలి రోజుల్లో తన అసిస్టెంట్ డైరెక్టర్ ఒకరు సినిమా చూసి.. ఇంటర్వెల్ ముంగిట నాగ్ చెప్పే ఓటమిని ఒప్పుకోవడంలోనే గొప్పదనం ఉంటుంది అనే డైలాగ్‌ను తనకు గుర్తు చేశాడని.. అది తనకు గట్టిగా గుచ్చుకుందని.. సినిమా పోయిందనే విషయాన్ని ఒప్పుకోవాలేమో అనుకున్నానని ఆదిత్య గుర్తు చేసుకున్నాడు. కానీ థియేటర్ రెస్పాన్స్ చూద్దామని తాను టీంతో కలిసి పలు ప్రాంతాలకు తిరిగానని.. ఆ క్రమంలోనే గుంటూరులోని ఒక థియేటర్‌కు వెళ్లామని ఆదిత్య చెప్పాడు.
అది మిడ్ సమ్మర్ అని.. థియేటర్లో ఏసీ పని చేయక డోర్లు తెరిచిపెట్టారని..తాము వెళ్లే సమయానికి వేణుమాధవా పాట వస్తోందని.. ప్రేక్షకులు ఆ పాటను సైలెంట్‌గా చూస్తూ ఉన్నారని.. ఆ తర్వాత వేసవి కాలం వెన్నెల్లాగా పాట అప్పుడు కూడా వారిలో పెద్దగా స్పందన లేదని ఆదిత్య తెలిపాడు. తాము సినిమా ఫ్లాప్ అనే అభిప్రాయంతో ఉంటే.. ఆ థియేటర్ మేనేజర్ తమ కళ్లు తెరిపించాడని చెప్పాడు. సమ్మర్లో థియేటర్ లోపల ప్రేక్షకులు చెమటలు కక్కుతుంటారని.. పాట వస్తే వెంటనే బయటికి వెళ్లిపోవాలని.. అలా చేయకుండా పాటల్లో కూడా థియేటర్ నుంచి బయటికి కదలడం లేదంటే సినిమాలో అంతగా ఇన్వాల్వ్ అయ్యారని అర్థమని ఆ థియేటర్ ఓనర్ చెప్పడంతో తమకు సినిమా మీద నమ్మకం వచ్చిందని.. ఆయన అన్నట్లే సినిమా పెద్ద హిట్ అయిందని ఆదిత్య గుర్తు చేసుకున్నాడు.