హీరోగా నాగ్ పుట్టిన రోజు.. అక్కినేని వారసత్వం చిరస్థాయిగా నిలిచిన రోజు కూడా!
టాలీవుడ్‌లో అక్కినేని కుటుంబానికి, మే 23 తేదీకి ఉన్న ఇంపార్టెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు
టాలీవుడ్‌లో అక్కినేని కుటుంబానికి, మే 23 తేదీకి ఉన్న ఇంపార్టెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు అక్కినేని ఫ్యాన్స్‌కు మాత్రమే కాదు, తెలుగు సినీ హిస్టరీకి కూడా ఎంతో ఎమోషనల్ డే. ఎందుకంటే ఇదే తేదీ అక్కినేని నాగార్జున సినీ ప్రయాణానికి శ్రీకారం చుట్టిన రోజు కావడంతో పాటు, అక్కినేని కుటుంబ వారసత్వాన్ని తెరపై చిరస్థాయిగా నిలిపిన మనం మూవీ రిలీజైన రోజు కూడా కావడం విశేషం. అందుకే ప్రతి ఏటా మే 23 రాగానే అక్కినేని అభిమానులు ఈ రోజును మోస్ట్ మెమొరబుల్ డే గా గుర్తు చేసుకుంటారు.
1986 మే 23న రిలీజైన విక్రమ్ సినిమాతో నాగార్జున హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అప్పుడు ఆయనపై ఉన్న అంచనాలు, ఒత్తిడి రెండూ భారీగానే ఉన్నాయి. ఎందుకంటే ఆయన లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు కొడుకు కాబట్టి. అయితే మొదటి సినిమాతోనే నాగార్జున తనకంటూ ప్రత్యేకమైన శైలిని చూపించారు. ఆ రోజున కెమెరా ముందు నిలబడ్డ ఆ యంగ్ హీరోనే తర్వాత కాలంలో టాలీవుడ్‌లో అత్యంత స్టైలిష్, ఎక్స్‌పెరిమెంటల్ యాక్టర్ గా ఎదుగుతాడని అప్పట్లో ఎవరూ ఊహించలేదు. కానీ నాగార్జున మాత్రం తన సినిమాల ఎంపికలతో, కథలపై ఉన్న పట్టుతో, విభిన్నమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ముఖ్యంగా యూత్ లో ఆయనకు ఏర్పడిన ఫాలోయింగ్ అప్పటి నుంచే స్పష్టంగా కనిపించింది.
నాగార్జున కెరీర్‌ను ఒక్క కోణంలోనే చూడలేం. ప్రేమకథలు, యాక్షన్ మూవీస్, భక్తి సినిమాలు, కుటుంబ కథా చిత్రాలు ఇలా ప్రతి జానర్‌లోనూ ఆయన తన ముద్ర వేశారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన శివ సినిమా తెలుగు సినీ పరిశ్రమలో ట్రెండ్ సెట్టర్‌గా నిలవగా, అందులో నాగార్జున నటన కొత్త తరహా హీరోయిజానికి నాంది పలికింది. మరోవైపు గీతాంజలిలో ఆయన చూపించిన ఎమోషనల్ యాక్టింగ్ ఆడియన్స్ ను కదిలించింది. అన్నమయ్య సినిమాలో భక్తుని పాత్రలో ఆయన కనబరిచిన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అలాగే మన్మథుడు, హలో బ్రదర్, సోగ్గాడే చిన్నినాయనా, బంగార్రాజు వంటి సినిమాలతో కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ జానర్లలో కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు. అందుకే ఆయనను ఫ్యాన్స్ ప్రేమగా సెల్యులాయిడ్ సైంటిస్ట్ అని పిలుస్తుంటారు.
అయితే మే 23 తేదీకి అసలు ఎమోషనల్ వాల్యూని తీసుకొచ్చింది మాత్రం మనం సినిమానే. 2014 మే 23న విడుదలైన ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత ప్రత్యేకమైన కుటుంబ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ అక్కినేని మూడు తరాల నటులు ఒకే స్క్రీన్ పై కనిపించడం అభిమానులకు అపూర్వ అనుభూతినిచ్చింది. ముఖ్యంగా ఇది అక్కినేని నాగేశ్వరరావు చివరి ఆన్ స్క్రీన్ మూవీ కావడంతో సినిమా మరింత ఎమోషనల్ అయింది. మూవీ రిలీజ్ టైమ్ లో ప్రేక్షకులు థియేటర్లలో కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఇప్పటికీ గుర్తుండేలా ఉన్నాయి. కుటుంబ బంధాలు, పునర్జన్మల నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా అక్కినేని అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.
దాదాపు నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణం పూర్తి చేసినా నాగార్జునలో ఇప్పటికీ అదే స్టైల్, అదే ఎనర్జీ కనిపిస్తుండటం విశేషం. కొత్త తరానికి తగ్గ కథలను ఎంపిక చేసుకుంటూనే, తన ప్రత్యేకమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న కింగ్100 ప్రాజెక్ట్‌పై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒక హీరోగా మాత్రమే కాకుండా, నిర్మాతగా, టెలివిజన్ హోస్ట్‌గా కూడా తనదైన ముద్ర వేసిన నాగార్జున ప్రయాణం తెలుగు సినీ పరిశ్రమలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోతుంది. అందుకే మే 23 అక్కినేని ఫ్యామిలీకి కేవలం ఒక డేట్ మాత్రమే కాదు.. ఎమోషన్స్ తో నిండిన ఒక చిరస్మరణీయమైన రోజు.