ఢిల్లీ హైకోర్టు ఎందుకు సెలబ్రిటీలంతా వరుసగా వెళ్తున్నారు?

ముఖ్యంగా ఢిల్లీ హైకోర్టుకే సెలబ్రిటీలంతా ఎందుకు క్యూ కడుతున్నారు అంటూ పలువురు పలు కామెంట్లు చేస్తున్నారు.. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..;

Update: 2025-09-25 09:46 GMT

గత కొన్ని రోజులుగా సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు ఢిల్లీ హైకోర్టుకు వెళుతుండడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్, ఐశ్వర్యరాయ్, కరణ్ జోహార్.. అంతెందుకు టాలీవుడ్ నుంచి మోహన్ బాబు కూడా గతంలో ఇలా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున కూడా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ హైకోర్టుకే సెలబ్రిటీలంతా ఎందుకు క్యూ కడుతున్నారు అంటూ పలువురు పలు కామెంట్లు చేస్తున్నారు.. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగార్జున..

అసలు విషయంలోకి వెళ్తే.. టాలీవుడ్ కింగ్ గా గుర్తింపు తెచ్చుకున్న నాగార్జున తాజాగా తనకు న్యాయం చేయడంటూ తన తరఫు న్యాయవాది ఆనంద్ కోర్టులో పిటిషన్ వేశారు.. ఆ పిటిషన్లో.." సినీ నటుడిగా ఇప్పటికే ఆన్లైన్లో ఉన్న ఫోటోలు, వీడియోలను ఏఐ ద్వారా మార్ఫింగ్ చేసి నా వ్యక్తిగత ప్రతిష్టను దిగజారుస్తున్నారు. అశ్లీలతతో సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతూ దాన్ని అడ్డం పెట్టుకొని వ్యాపారం కూడా చేస్తున్నారు. ఏఐ జనరేటర్ కంటెంట్ గా యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేశారు. ఆ పోస్టులన్నీ కూడా డబ్బు చెల్లింపుకు ప్రమోషన్లుగా ఉన్నాయి.అన్నింటిని కూడా నా హ్యాష్ ట్యాగ్ తోనే మార్కెటింగ్ చేశారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో నాకు ఉన్న ఖ్యాతిని ఉపయోగించుకొని.. ఇలా తప్పుడు మార్గంలో నా వ్యక్తిత్వాన్ని పాడు చేస్తున్నారు. అనుమతి లేకుండా నా ఫోటోలను, వీడియోలను ఎవరు వాడకుండా తగిన తీర్పు ఇవ్వాలి అని కోరుతున్నాను" అంటూ నాగార్జున తెలిపారు. అయితే దీనిపై న్యాయమూర్తి జస్టిస్ తేజస్ కరియా స్పందిస్తూ.. నాగార్జునకు రక్షణ కల్పించే విధంగా ఆదేశాలు ఇస్తామని తెలిపింది.

2022లోనే హైకోర్టును ఆశ్రయించిన అమితాబ్ బచ్చన్..

ఒకవైపు సినిమాలు.. మరొకవైపు కౌన్ బనేగా కరోడ్పతి షోలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న అమితాబ్ బచ్చన్ 2022లోనే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఏఐ ఉపయోగించి తన ఫోటోలను, గొంతును ఉపయోగించడాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ.. కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ ని విచారించిన ఢిల్లీ ధర్మాసనం అమితాబ్ వ్యక్తిగత హక్కులపై కీలక ఆదేశాలు జారీ చేసింది. అమితాబ్ అనుమతి లేకుండా ఎవరు కూడా ఆయన ఫోటోలు గానీ వాయిస్ గానీ ఉపయోగించకూడదని తీర్పునిచ్చింది. అంతేకాదు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అధికారులు ,టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను ఢిల్లీ కోర్టు ఆయన అనుమతి లేకుండా ఆయన కంటెంట్ ను వాడుకోకూడదని ఆదేశాలు జారీ చేసింది.

ఢిల్లీ హైకోర్టు ఆశ్రయించిన మోహన్ బాబు..

ఇకపోతే మోహన్ బాబు కూడా గత ఏడాది ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.. ముఖ్యంగా తనకు తెలియకుండా తన ఫోటోలను , వీడియోలను, వ్యక్తిగత సమాచారాన్ని వాడుకుంటున్నారని.. ఏఐ తో తన ఫోటోలు మార్ఫింగ్ చేసి తప్పుదోవ పట్టిస్తున్నారని ఢిల్లీ హైకోర్టును ఆయన ఆశ్రయించారు. ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టు కూడా మోహన్ బాబు కి అనుకూలంగా తీర్పునిచ్చింది.

ఈ ఏడాది ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన బాలీవుడ్ తారలు..

వీరితోపాటు ఈ ఏడాది ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ తో పాటు ఆమె భర్త అభిషేక్ బచ్చన్ అలాగే కరణ్ జోహార్లు కూడా ఒకరి తర్వాత ఒకరు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తమ వ్యక్తిగత ఫోటోలను, వీడియోలను ఉపయోగిస్తున్నారని.. ముఖ్యంగా అనుమతి లేకుండా టీ షర్ట్లపై ముద్రించి వాటిని అమ్ముకుంటున్నారని.. అంతేకాకుండా ఫోటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల కంటెంట్ కోసం వాడుకుంటున్నారు అంటూ కూడా తమ పిటీషన్ లో తెలిపారు. ఇలా అందరూ పిటిషన్లను పరిశీలించిన ధర్మాసనం ఇకపై వీరి అనుమతి లేకుండా ఫోటోలను ఉపయోగించకూడదని తీర్పునిచ్చింది.

ముందస్తు జాగ్రత్త పడుతున్న సెలబ్రిటీలు..

మొత్తానికైతే సెలబ్రిటీ లందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోవడానికి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం వైరల్ గా మారింది. నిజానికి ఈమధ్య ఏ ఐ కంటెంట్ వాడకం ఎక్కువవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సెలబ్రిటీలు ముందస్తు జాగ్రత్తగా ఇలా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి.. నష్టం జరగకుండా చూసుకుంటున్నట్లు సమాచారం.

Tags:    

Similar News