ఏఎన్నార్ బయోపిక్‌పై నాగ్ యుటర్న్
ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతున్న సమయంలోనే ఏఎన్నార్ మీద సినిమా గురించి ఒక చర్చ జరిగింది. ఆయన అభిమానులు ఆ దిశగా ఆశపడ్డారు.;
‘మహానటి’ సినిమాలో సావిత్రి జీవిత కథను అద్భుతంగా చూపించి బాక్సాఫీస్ దగ్గర ఘనవిజయం అందుకున్నాక.. తెలుగు సినీ చరిత్రలో తమకంటూ అధ్యాయాలు సృష్టించుకున్న దిగ్గజాల బయోపిక్స్ చూడాలని వారి వారి అభిమానుల్లో బలమైన కోరిక పుట్టిందనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే సీనియర్ ఎన్టీఆర్ జీవిత కథను రూపొందించడానికి అడుగులు పడ్డాయి. ఐతే ఆ సినిమా తీసిన టైమింగ్ సరిగా కుదరలేదు. దీనికి తోడు ఆయన కథను సెలక్టివ్ అంశాలతో చెప్పడం కూడా ప్రేక్షకులకు రుచించలేదు. దీంతో ‘యన్.టి.ఆర్’ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర చేదు అనుభవం తప్పలేదు.
ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతున్న సమయంలోనే ఏఎన్నార్ మీద సినిమా గురించి ఒక చర్చ జరిగింది. ఆయన అభిమానులు ఆ దిశగా ఆశపడ్డారు. కానీ ‘యన్.టి.ఆర్’ సినిమాకు ఎదురైన అనుభవం చూసో ఏమో.. అక్కినేని నాగార్జునలో నిరాసక్తత కనిపించింది. ఏఎన్నార్ జీవితంలో పెద్దగా మలుపులు లేవని, డ్రామా తక్కువ అని.. ఆయన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న చిన్న ఇబ్బందులు తప్పితే.. జీవితమంతా సాఫీగా సాగిపోయిందని.. కాబట్టి బయోపిక్ వర్కవుట్ కాదని గతంలో నాగ్ స్పష్టం చేశారు.
దీంతో ఏఎన్నార్ బయోపిక్ ఆలోచనలు ఆరంభ దశలోనే ఆగిపోయాయి. ఇక మళ్లీ అక్కినేని కుటుంబం ఈ దిశగా ఆలోచించదనే అనుకున్నారంతా. కానీ నాగ్ ఇప్పుడు మళ్లీ తన తండ్రి బయోపిక్ గురించి మాట్లాడారు. ఆ సినిమా చేసే అవకాశాలు లేకపోలేదని చెప్పారు. ఏఎన్నార్ 101వ జయంతి సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో తండ్రి బయోపిక్ గురించి నాగ్ స్పందించారు.
‘‘నాన్న గారి బయోపిక్ చేయాలనే ఆలోచన ఉంది. ఆయన కథ ఎవరు రాస్తే బాగుంటుంది. ఎంత ఆసక్తికరంగా తీయగలం అనే విషయాలపై చర్చలు జరుగుతున్నాయి. అన్నీ ఒక కొలిక్కి వచ్చాక వివరాలు చెబుతాం’’ అని నాగ్ అన్నారు. మరి నాగ్‌ను మెప్పించేలా ఎవరైనా స్క్రిప్టు రాసి, సరైన దర్శకుడు కుదిరితే ఏఎన్నార్ బయోపిక్ కార్యరూపం దాలుస్తుందేమో చూడాలి.