నాగ్‌ 100కి ముందు మరో కల్ట్‌ క్లాసిక్‌...!

శివ సినిమాతో పాటు నాగార్జున కెరీర్‌లో అత్యంత ముఖ్యమైన మూవీ గీతాంజలి అనడంలో సందేహం లేదు.;

Update: 2025-10-27 05:37 GMT

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా సినిమాలు వచ్చి చాలా కాలం అయింది. కుబేర, కూలీ సినిమాల్లో నాగార్జున నటించినప్పటికీ అభిమానులు మాత్రం ఆయన హీరోగా నటిస్తున్న సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున తన 100వ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ సినిమా షూటింగ్‌ జరుగుతోందని సమాచారం అందుతోంది. రా కార్తీక్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్నట్లు చెబుతున్నారు. నాగార్జున సొంతంగా తన బ్యానర్‌లో నిర్మిస్తున్నాడట. పూర్తి వివరాలు త్వరలోనే వెళ్లడించే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రతిష్టాత్మక సినిమాలో నాగ చైతన్య, అఖిల్‌ సైతం ఉండే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా అమల అక్కినేని కూడా ముఖ్య పాత్రలో కనిపిస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయం గురించి కూడా ఎలాంటి క్లారిటీ లేదు. మొత్తానికి నాగ్‌ 100వ సినిమా సస్పెన్స్‌ను క్రియేట్‌ చేస్తోంది.

రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో శివ..

నాగార్జున 100వ సినిమా కంటే ముందు రెండు కల్ట్‌ క్లాసిక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నవంబర్‌ 14, 2025న శివ సినిమాను ప్రేక్షకుల ముందుకు సరికొత్తగా తీసుకు రాబోతున్నారు. పిక్చర్‌ క్వాలిటీతో పాటు, సౌండ్‌ ను సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చాలా కాలంగా వర్కౌట్స్ నడుస్తున్నాయి. రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ శివ సినిమా అప్పట్లో సెన్షేషన్‌ క్రియేట్‌ చేసింది. అలాంటి సెన్షేషనల్‌ మూవీ టీవీలో వందల సార్లు టెలికాస్ట్‌ అయింది. అయినా కూడా థియేటర్‌లో సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌తో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు సినిమా వర్క్ పూర్తి చేసిన మేకర్స్ ప్రమోషన్స్‌ షురూ చేశారు. రామ్‌ గోపాల్‌ వర్మ ఇప్పటికే రీ రిలీజ్ కి సంబంధించిన ఇంటర్వ్యూలు ఇస్తూ శివ సినిమా గురించి ప్రచారం చేస్తూ వస్తున్నాడు. శివ సినిమా రీ రిలీజ్ తో ఫ్యాన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు మరోసారి కల్ట్‌ క్లాసిక్‌ ను ఎంజాయ్‌ చేయబోతున్నారు.

గీతాంజలి రీ రిలీజ్ కి ఏర్పాట్లు...

శివ సినిమాతో పాటు నాగార్జున కెరీర్‌లో అత్యంత ముఖ్యమైన మూవీ గీతాంజలి అనడంలో సందేహం లేదు. 1989లో విడుదలైన ఈ రొమాంటిక్ కల్ట్ క్లాసిక్ మూవీకి మణిరత్నం దర్శకత్వం వహించాడు. ఇప్పుడు ఈ సినిమాను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శివ గతంలో రీ రిలీజ్ అయింది, కానీ ఇప్పుడు సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే గీతాంజలి మాత్రం టీవీల ద్వారా రావడం మాత్రమే చూశాం. కనుక థియేట్రికల్‌ రిలీజ్ కి చాలా బజ్‌ క్రియేట్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగానే నాగార్జున రొమాంటిక్ సినిమాలు ఎవర్‌ గ్రీన్‌ అన్నట్లుగా ఉంటాయి. అలాంటిది గీతాంజలి సినిమా రాబోయే వంద ఏళ్ల వరకు కూడా చాలా ఫ్రెష్‌ గా ఉంటుంది అనడంలో సందేహం లేదు. అలాంటి కల్ట్‌ సినిమాలను మళ్లీ మళ్లీ థియేటర్‌లో చూడవచ్చు.

టాలీవుడ్ కింగ్‌ నాగార్జున 100వ సినిమా...

1989 మే 19న విడుదలైన గీతాంజలి సినిమా కేవలం కోటిన్నర లోపు బడ్జెట్‌తో రూపొందింది. మణిరత్నం తెలుగులో దర్శకత్వం వహించిన మొదటి సినిమా. నాగార్జునకు జోడీగా గిరిజ హీరోయిన్‌గా నటించింది. సినిమాకు ఇళయరాజా అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తెలుగులో రూపొందిన ఈ సినిమా తమిళ్‌, మలయాళంలో డబ్‌ అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇదే సినిమా బాలీవుడ్‌లో రీమేక్ అయింది. సినిమా దాదాపు ఏడాది పాటు థియేటర్లలో ఆడుతూ కనిపించింది.

నాగార్జున కెరీర్‌లో బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్ సినిమాల్లో ఒకటిగా గీతాంజలి నిలిచింది. అలాంటి గీతాంజలిని 4K టెక్నాలజీతో పిక్చర్‌ క్వాలిటీని పెంచి, డాల్బీ సౌండ్ సిస్టమ్‌తో మళ్లీ తీసుకు వస్తే నాగ్‌ ఫ్యాన్స్‌కి పండుగే అనడంలో సందేహం లేదు. నాగార్జున వందవ సినిమాకు ముందు శివ, గీతాంజలి వంటి సినిమాలు రావడం ఫ్యాన్స్‌కి మరింత ఉత్సాహంను అందిస్తుంది. నాగ్ 100వ సినిమాను 2026 మే లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Tags:    

Similar News