'నాగబంధం' మూవీ రివ్యూ

ఈ బృందం వెండితెరపై ఏదో అద్భుతాన్ని ఆవిష్కరించినట్లే కనిపించింది. మరి ప్రోమోల్లో ఉన్న గొప్పదనం.. సినిమాలోనూ ఉందా? ‘నాగబంధం’ ప్రేక్షకులను మెప్పించిందా? తెలుసుకుందాం పదండి.

Update: 2026-07-03 08:09 GMT

'నాగబంధం' మూవీ రివ్యూ

నటీనటులు: విరాట్ కర్ణ- నభా నటేష్- జగపతిబాబు- ఐశ్వర్య మేనన్- మురళీ శర్మ- మహేష్ మంజ్రేకర్- శరణ్య- అనసూయ- దక్ష నగార్కర్ తదితరులు

సంగీతం: జునైద్ కుమార్- అభి

ఛాయాగ్రహణం: సౌందర్ రాజన్

మాటలు: శ్రావణ్

నిర్మాతలు: కిషోర్ అన్నపురెడ్డి- నిషిత నాగిరెడ్డి

కథ- మాటలు- దర్శకత్వం: అభిషేక్ నామా

నిర్మాతగా అనేక సినిమాలు తీసిన అభిషేక్ నామా దర్శకుడిగా మారి రూపొందించిన చిత్రం.. నాగబంధం. ‘పెదకాపు’ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన విరాట్ కర్ణ ఇందులో లీడ్ రోల్ చేశాడు. ఈ కాంబినేషన్లో కొత్త ప్రొడ్యూసర్లు నిర్మించిన సినిమా నుంచి వచ్చిన ప్రోమోలు చూసి అందరూ షాకైపోయారు. ఈ బృందం వెండితెరపై ఏదో అద్భుతాన్ని ఆవిష్కరించినట్లే కనిపించింది. మరి ప్రోమోల్లో ఉన్న గొప్పదనం.. సినిమాలోనూ ఉందా? ‘నాగబంధం’ ప్రేక్షకులను మెప్పించిందా? తెలుసుకుందాం పదండి.

కథ: హిమాలయాల్లో అద్భుత శక్తులున్న ఒక రహస్య గదిని శతాబ్దాల కిందట నాగసాధువులు... నాగబంధం వేసి మూసివేస్తారు. ఎలాగైనా దాన్ని తెరిచి ఆ శక్తులను సొంతం చేసుకోవాలని అబ్దాలీ ఎన్నో ఏళ్ల నుంచి విశ్వ ప్రయత్నం చేస్తుంటాడు. శ్రీరంగపురంలోని రంగనాథ ఆలయంలోని బ్రహ్మకమలంతోనే ఆ నాగబంధాన్ని తెరవగలమని తెలుసుకుని దాని కోసం రంగంలోకి దిగుతాడు. అబ్దాలీ ఆ ప్రయత్నాలు చేస్తుండగా.. అది చిక్కినట్లే చిక్కి తన చేజారుతుంది. అనుకోకుండా ఆ బ్రహ్మకమలాన్ని తీసుకురావాల్సిన బాధ్యత రుద్ర (విరాట్ కర్ణ) మీద పడుతుంది. మరి ఈ రుద్ర ఎవరు.. తన నేపథ్యమేంటి.. అతను బ్రహ్మకమలాన్ని చేజిక్కించుకోగలిగాడా.. అబ్దాలీకి ఇచ్చాడా.. అతను బ్రహ్మకమలం ద్వారా తాను కోరుకున్న శక్తులను సొంతం చేసుకోగలిగాడా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: నాగబంధం'లో సెట్టింగ్స్ అద్భుతం.. విజువల్ ఎఫెక్ట్స్ అసాధారణం.. భారీతనం అమోఘం.. వందల కోట్ల బడ్జెట్లు పెట్టి తీసిన చిత్రాల్లో కూడా రాని ఔట్ పుట్ తో వావ్ అనిపించింది చిత్ర బృందం. ఒక్కో దృశ్యం చూస్తుంటే కళ్ళు చెదిరిపోతాయి. స్టార్లు లేని సినిమాలో ఈ విజువల్స్ ఏంటి.. ఈ ఎఫెక్ట్స్ ఏంటి.. ఈ గ్రాండియర్ ఏంటి అని ఆశ్చర్యపోతూ సినిమా చూస్తాం. ఈ విషయంలో ఫిలిం మేకర్స్ అభిషేక్ నామా అండ్ టీం దగ్గర క్లాసులకు వెళ్ళొచ్చు. దృశ్యపరంగా అంత అద్భుతమైన బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది నాగబంధం. అయితే కేవలం దృశ్యం కంటికి ఇంపుగా ఉంటే సరిపోతుందా? కథ.. కథనం.. సన్నివేశం ఇచ్చే అనుభూతి సంగతేంటి? ఈ విషయాల్లో మాత్రం నాగబంధం నిరాశకే గురి చేస్తుంది. కథలో విషయం ఉన్నా.. దాన్ని ఆసక్తికరంగా అర్థమయ్యేలా చెప్పే నైపుణ్యం కొరవడడంతో.. పాత్రల్లో సన్నివేశాల్లో ఎమోషనల్ కనెక్ట్ మిస్ అవడంతో.. కథ తాలూకు ప్రయోజనం నెరవేరకపోవడంతో 'నాగబంధం' ఒక ప్రయాసగా మారింది.

‘నాగబంధం’ 3 గంటల 17 నిమిషాల నిడివి ఉన్న సినిమా. సినిమా మొదలైన దగ్గర్నుంచి చివరి సన్నివేశం వరకు ఇందులో ఒక రహస్య గదికి వేసిన నాగబంధం గురించి.. దాన్ని తెరిచే బ్రహ్మ కమలం గురించి ఒకటే ఊదరగొట్టేస్తూ ఉంటారు. కానీ అసలు ఆ నాగబంధం ఎందుకు వేశారు.. లోపల అసలేం శక్తి దాగుంది... ప్రతినాయకుడు అసలు దేని కోసం అంత తాపత్రయ పడుతున్నాడు.. అంత మారణహోమం సృష్టిస్తున్నాడు.. అన్నది మాత్రం అర్థమయ్యేలా చెప్పలేకపోయారు. అసలు ముస్లిం అయిన విలన్.. హిందూ సాధువులు వేసిన నాగబంధాన్ని ఛేదించి ఏదో శక్తిని సొంతం చేసుకోవడం కోసం ప్రయత్నించడంలో లాజిక్ ఏంటో అర్థం కాదు. అంత సుదీర్ఘ నిడివితో సినిమా చూశాక కూడా ఈ కథ తాలూకు పర్పస్ ఏంటి అన్నది అర్థం కాకపోతే ప్రేక్షకుల ఫీలింగ్ ఎలా ఉంటుంది మరి? ఇప్పటికదా చూసిన కథ సరైన అనుభూతి కలిగించకపోతే.. ఆ కథకు సరైన ముగింపు ఇవ్వకుండా పూర్తి వివరాలు పార్ట్ 2లో చూసుకోమంటే ఆడియన్స్ పరిస్థితేంటి? ఇలా ‘నాగబంధం’లో సమస్యలు ఎన్నెన్నో.

కానీ ముందే అన్నట్లు స్టార్లను పెట్టి వందల కోట్లు పెట్టి తీసిన సినిమాలు కూడా ఇవ్వని అద్భుతమైన బిగ్ స్క్రీన్ విజువల్ ఎక్స్పీరియెన్స్ ‘నాగబంధం’ ఇస్తుంది అన్నది మాత్రం వాస్తవం. కథను.. లాజిక్కులను పక్కన పెట్టేసి చూస్తే ఇందులోని ఆలయాల నేపథ్యంలో వచ్చే భారీ సన్నివేశాలు.. కొన్ని అడ్వెంచరస్ ఎపిసోడ్స్.. అన్నింటికీ మించి యాక్షన్ ఘట్టాలు వావ్ అనిపిస్తాయి. నాగబంధం కథను మొదలు పెట్టిన తీరు ఆకట్టుకుంటుంది. ఆరంభ సన్నివేశమే విజువల్ గా ఒక అద్భుతం చూడబోతున్న ఫీలింగ్ కలిగిస్తుంది. కానీ హీరో పరిచయ సన్నివేశాల దగ్గర్నుంచి నాగబంధం గాడి తప్పుతుంది. హీరో నేపథ్యం.. తన కుటుంబం చుట్టూ నడిచే సన్నివేశాలు విపరీతమైన నాటకీయతతో సీరియల్ చూస్తున్న ఫీలింగ్ కలిగిస్తాయి. సన్నివేశాల్లో డ్రామా పండకపోగా.. మెలోడ్రామా ఎక్కువై విసిగిస్తాయి. తర్వాత కథ తిరిగి బ్రహ్మకమలం మీదికి మళ్ళడంతో ఆసక్తి పెరిగినా.. ఒక దాంతో ఇంకోదానికి సంబంధం లేనట్లు లింక్ లేకుండా సాగే సీన్లు ప్రేక్షకుడిని గందరగోళానికి గురి చేస్తాయి. ఇంటర్వెల్ ముంగిట వచ్చే భారీ యాక్షన్ ఎపిసోడ్ క్లైమాక్సు స్థాయిలో ఉంటుంది.

ప్రథమార్థం ఎగుడు దిగుడుగా ఉన్నా ఓవరాల్ గా పర్వాలేదు అనిపిస్తుంది. కానీ రెండో అర్థం మాత్రం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. ఒక దశ తర్వాత విజువల్స్.. భారీతనం కూడా ఎంగేజ్ చెయ్యలేని విధంగా సన్నివేశాలు ప్రేక్షకుడిని గందరగోళానికి గురి చేస్తాయి. డైలాగులు సుదీర్ఘంగా సాగి విసుగు పుట్టిస్తాయి. హిందూ దేవుళ్ళు.. సనాతన ధర్మం.. హిందుత్వం మీద డైలాగులు పనిగట్టుకుని పెట్టినట్లు అనిపిస్తాయి తప్ప కథలో భాగంగా.. ఆ కథను ఎలివేట్ చేసేలా లేవు. ఎవరినో మెప్పించడానికి.. ఒక ప్రాపగాండాతో చేసిన సినిమా ఇది అనిపించేలా సాగుతాయి కొన్ని సీన్లు, డైలాగులు. ఒక అద్భుతమైన ఈవెంట్ ఫిలిం కావడానికి తగ్గ కథ.. సాంకేతిక హంగులు.. భారీతనం 'నాగబంధం'కు కుదిరినా.. కథను ఆసక్తికరంగా చెప్పలేకపోవడంతో ఈ సినిమా ఆశించిన అనుభూతి ఇవ్వలేక పోయింది. కేవలం విజువల్స్.. ఎఫెక్ట్స్.. భారీతనం కోసం అయితే నాగబంధం మీద ఒక లుక్కేయొచ్చు.

నటీనటులు: విరాట్ కర్ణ కొత్త వాడైనా.. ఇంత భారీ చిత్రంలో కథానాయకుడిగా బాగానే కుదిరాడు. రుద్రగా.. నాగసాధువుగా తన స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. హావభావాల విషయంలో కొన్ని చోట్ల బ్లాంక్ ఫేస్ తో ఇబ్బంది పెట్టినా.. కొన్ని చోట్ల ఆకట్టుకున్నాడు. భారీ యాక్షన్ ఘట్టాలకు అవసరమైన విగ్రహంతో అతను మెప్పించాడు. ఇంటర్వెల్ ఎపిసోడ్లో విరాట్ హైలైట్ అయ్యాడు. హీరోయిన్ నభా నటేష్ కు తన కెరీర్లోనే అతి పెద్ద రోల్ దొరికింది. కథలో ఆమెది చాలా ముఖ్యమైన పాత్రే. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రను ఆమె సద్వినియోగం చేసుకుంది. ముఖ్య సన్నివేశాల్లో తన నటన ఆకట్టుకుంటుంది. నభా ఒక పాటలో గ్లామర్ తో మెప్పించింది. విలన్ పాత్ర చేసిన నటుడు.. అనుకున్నంతగా మెప్పించలేకపోయాడు. చాలా చోట్ల అతను ఓవరాక్షన్ చేశాడు. ఆ పాత్రకు కాస్త తెలిసిన ముఖం అయితే బాగుండేది. జగపతిబాబు లెంగ్తీ రోల్ తో మెప్పించాడు. ఆలయ పూజారుల పాత్రల్లో మురళీ శర్మ.. మహేష్ మంజ్రేకర్ కాసేపే కనిపించినా బలమైన ముద్ర వేశారు. హీరో చెల్లెలి పాత్రలో చేసిన టీవీ నటి బాగా చేసింది. శరణ్య.. అనసూయ.. మిగతా ఆర్టిస్టులు ఓకే.

సాంకేతిక వర్గం: టెక్నికల్ గా ‘నాగబంధం’లో ఉన్నత ప్రమాణాలు కనిపిస్తాయి. సినిమాకు విజువల్సే అతి పెద్ద ఆకర్షణ. సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్.. ఆర్ట్ డిపార్ట్‌మెంట్.. విజువల్ ఎఫెక్ట్స్ టీం కలిసి అద్భుత దృశ్యాలను ఆవిష్కరించారు. కొన్ని చోట్ల దృశ్యాలు కృత్రిమంగా అనిపించినా.. ఏఐ వాడకం తెలిసిపోతున్నా.. ఓవరాల్ గా ఇలాంటి విజువల్స్ తీసుకురావడం మాటలు కాదు. చాలా చోట్ల విజువల్స్ కళ్లు చెదిరిపోయేలా చేస్తాయి. జునైద్ ఖాన్- అభి కలిసి అందించిన సంగీతంలో పాటలు పెద్దగా ఆనవు కానీ.. బీజీఎం మాత్రం ఆకట్టుకుంటుంది. సన్నివేశాలను ఎలివేట్ చేయడంలో స్కోర్ ముఖ్య పాత్ర పోషించింది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. సినిమా చూస్తుంటే వంద కోట్ల బడ్జెట్ అన్నది అతిశయోక్తిలా అనిపించదు. అందుకు తగ్గ ఔట్ పుట్ తెరపై కనిపిస్తుంది. శ్రావణ్ మాటలు కొన్ని చోట్ల ఓకే కానీ.. ఓవరాల్ గా అంత ఎఫెక్టివ్ గా లేవు. చాలా సన్నివేశాల్లో డైలాగ్స్ లెంగ్తీగా అనిపిస్తాయి. ఇక రచయిత.. దర్శకుడు అభిషేక్ నామా తన విజువలైజేషన్ తో వావ్ అనిపించాడు. సెట్టింగ్స్.. వీఎఫెక్స్ విషయంలో అతను రాబట్టుకున్న ఔట్ పుట్ ఆశ్చర్య పరుస్తుంది. కానీ సన్నివేశాలను క్రిస్ప్ గా ప్రెసెంట్ చెయ్యడంలో.. రక్తి కట్టించడంలో అతను తడబడ్డాడు. అభిషేక్ ఎంచుకున్న కథ కూడా ఓకే కానీ.. కథనం మాత్రం ఆసక్తికరంగా సాగలేదు.

చివరగా: నాగబంధం.. విజువల్స్ అద్భుతం.. విషయం పరిమితం

రేటింగ్-2.5/5

Tags:    

Similar News