ప్రొడక్షన్ మేనేజర్ల లైఫ్‌స్టైల్‌పై నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!

టాలీవుడ్ యువ‌ నిర్మాత, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ ఇండ‌స్ట్రీ వ్య‌వ‌హారాల‌పై చేసే `బోళా కామెంట్లు` ఎప్పుడూ చ‌ర్చ‌నీయాంశ‌మే.

Update: 2026-08-10 03:57 GMT

టాలీవుడ్ యువ‌ నిర్మాత, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ ఇండ‌స్ట్రీ వ్య‌వ‌హారాల‌పై చేసే `బోళా కామెంట్లు` ఎప్పుడూ చ‌ర్చ‌నీయాంశ‌మే. చలనచిత్ర పరిశ్రమలోని అంతర్గత విషయాలు, నిర్మాణ ప్రణాళికలపై ఈ యువ‌నిర్మాత తాజా వ్యాఖ్యలు ప్రస్తుతం నెటిజన్ల దృష్టిని ఆసక్తికరంగా ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా ప్రొడ్యూసర్లు మాత్రమే విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారని అందరూ భావిస్తుంటారు.. కానీ వాస్తవంలో పరిస్థితి భిన్నంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమలోని ప్రొడక్షన్ మేనేజర్లు, ఫైట్ మాస్టర్ల లైఫ్‌స్టైల్ ఎంతో ఉన్నతంగా ఉంటుందని.. వారి ఇళ్లలోని ఆస్తులు, ఫర్నీచర్ చూస్తే ప్రొడ్యూసర్ల ఇళ్లలో కూడా అంతగా ఉండవని నాగవంశీ నవ్వుతూ సరదాగా వ్యాఖ్యానించారు.

ఈ విషయమై నాగవంశీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఒక సర్వే చేయిస్తే ఈ విషయాలు స్పష్టంగా తెలుస్తాయని హోస్ట్ తో స‌ర‌దాగా వ్యాఖ్యానించారు. సినిమా నిర్మాణంలో భాగమయ్యే టెక్నీషియన్లు, మేనేజర్లు పరిశ్రమలో ఎంతో బాగా సెటిల్ అయ్యారని చెప్పడం తనకు ఎంతో సంతోషాన్నిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏమాత్రం దాపరికాలు లేకుండా పరిశ్రమలోని వాస్తవ పరిస్థితులను.. వారి జీవన విధానాన్ని ఆయన బయటపెట్టిన తీరు ఆస‌క్తిని క‌లిగించింది.

అదేవిధంగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ చిత్రం `ప్రేమమ్` పట్టాలెక్కడానికి వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను కూడా ఆయన తాజా చాటింగ్ సెష‌న్ లో షేర్ చేసారు. మలయాళంలో `ప్రేమమ్` చిత్రం విడుదలైన సమయంలో ప్రముఖ నిర్మాత నల్లమలుపు బుజ్జి నాగవంశీకి ఆ సినిమా గురించి చెప్పి చూడమని సూచించారు. సినిమా చూసిన వెంటనే బాగా నచ్చడంతో ఆ తర్వాత హీరో నాగచైతన్యను `దోచేయ్` సినిమా సెట్స్‌లో కలిసి `ప్రేమ‌మ్` రీమేక్ గురించి ప్రతిపాదించాన‌ని ఆయన గుర్తుచేసుకున్నారు.

అయితే ఆ సమయంలోనే `కార్తికేయ` వంటి భారీ హిట్‌ కొట్టిన దర్శకుడు చందు మొండేటితో సితార బ్యానర్‌లో ఒక సినిమా చేయాల్సి ఉంది. కొత్త కథను సిద్ధం చేయడానికి సమయం పడుతుండటంతో ..ప్రేమమ్ రీమేక్ ప్రాజెక్ట్‌ను చందు చేతిలో పెట్టాలని నాగవంశీ భావించారు. కానీ మొదటి సినిమాతోనే స్వతంత్ర దర్శకుడిగా నిరూపించుకున్న చందు రీమేక్ చేస్తే తనకు `రీమేక్ డైరెక్టర్` అనే ముద్ర పడుతుందేమోనని ఆందోళన చెంది మొదట్లో ఈ ప్రాజెక్ట్‌కు కాస్త భయపడ్డారని నాగవంశీ తెలిపారు.

చివరకు చందును పలు రకాలుగా ఒప్పించి కన్విన్స్ చేసిన తర్వాతనే తెలుగు`ప్రేమమ్` ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చిందని నాగవంశీ వివరించారు. ఆ విధంగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ రీమేక్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించి నాగచైతన్య కెరీర్‌లోనూ.. చందు మొండేటి సినీ ప్రయాణంలోనూ ఒక మైలురాయిగా నిలిచిపోయింది. సినిమాల వెనుక ఉండే ఇటువంటి ఆసక్తికరమైన విషయాలను నాగవంశీ నిర్మొహమాటంగా బోల్డ్ గా మాట్లాడ‌టం అత‌డి ప్రత్యేకతను చాటుతోంది.

Tags:    

Similar News