హక్కుల పోరాటం: చిరు-నాగ్‌ల బాటలోనే నాగచైతన్యకు హైకోర్టు ఊరట
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుల వ్యక్తిగత హక్కుల (పర్సనాలిటీ రైట్స్) పరిరక్షణకు న్యాయస్థానాలు అండగా నిలుస్తున్నాయి.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుల వ్యక్తిగత హక్కుల (పర్సనాలిటీ రైట్స్) పరిరక్షణకు న్యాయస్థానాలు అండగా నిలుస్తున్నాయి. గతంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కుటుంబ సభ్యులు కోర్టుల ద్వారా తమ హక్కులను కాపాడుకోగా, ఆ తర్వాత టాలీవుడ్ సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇదే బాటలో నడిచారు. ఇప్పుడు వారి అడుగుజాడల్లోనే యువ నటుడు అక్కినేని నాగచైతన్య డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లపై సాగుతున్న దుష్ప్రచారానికి వ్యతిరేకంగా చట్టపరమైన పోరాటం ప్రారంభించి ఢిల్లీ హైకోర్టు నుండి కీలకమైన తాత్కాలిక రక్షణ (ఇంటరిమ్ రిలీఫ్) సాధించారు.
అనుమతి లేకుండా తన పేరు, ఫోటోలు, డిజిటల్ రూపాలను వాడుకుంటూ కమర్షియల్ ప్రయోజనాలు పొందుతున్న వెబ్‌సైట్లు, ఏఐ (AI) జెనరేటెడ్ కంటెంట్‌కు వ్యతిరేకంగా చైతన్య ఈ పిటిషన్ దాఖలు చేశారు. విచారణలో అతడి తరఫున హాజరైన సీనియర్ అడ్వకేట్ వైభవ్ గగ్గర్ కోర్టుకు పలు సంచలన విషయాలను వివరించారు. కొన్ని వెబ్‌సైట్లు నాగచైతన్య పేరు పక్కన అభ్యంతరకరమైన సెర్చ్ వర్డ్స్ తగిలించి... గూగుల్ ట్రాఫిక్‌ను తమ వైపు తిప్పుకుంటూ క్లిక్స్ కోసం చూస్తున్నాయని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అంతేకాక చైతన్య అనుమతి లేకుండా అతడి ముఖచిత్రంతో కూడిన టీషర్టులు, ఇతర వస్తువులను అనధికారికంగా విక్రయిస్తున్న లిస్టింగ్ వివరాలను సమర్పించారు.
ఈ దొడ్డి దారి వ్యాపారుల అక్రమాలతో పాటు.. చైతూ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ సాగుతున్న ఆన్‌లైన్ వేధింపులపై కూడా న్యాయవాది గట్టిగా గళమెత్తారు. ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ.. నాగచైతన్య ముఖాన్ని మార్చేసి (డీప్‌ఫేక్) సృష్టించిన ఫేక్ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ చేస్తున్నారని కోర్టుకు వివరించారు. అతడి వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలా, పరువు నష్టం కలిగించేలా ఉన్న ఈ కంటెంట్ వల్ల ఒక నటుడిగా తన ఇమేజ్ తీవ్రంగా దెబ్బతింటోందని వాదిస్తూ.. దీనికి అడ్డుకట్ట వేయడానికి ఒక కచ్చితమైన చట్టపరమైన రక్షణ అవసరమని కోరారు.
జస్టిస్ జ్యోతి సింగ్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ఈ వాదనలను ఆలకించిన అనంతరం..సెలబ్రిటీల వ్యక్తిగత హక్కులను వాణిజ్యపరంగా దుర్వినియోగం చేయడం సరికాదని పేర్కొంటూ నిందితులుగా ఉన్న సదరు వెబ్‌సైట్లు.. డిజిటల్ వేదికలకు సమన్లు జారీ చేసింది. కాగా నాగచైతన్య బృందం కోర్టును ఒక `డైనమిక్ ఇంజంక్షన్` ఇవ్వాల్సిందిగా కోరింది. దీని ద్వారా భవిష్యత్తులో ఈ నిషేధిత వెబ్‌సైట్లు పేర్లు మార్చుకుని కొత్త యుఆర్‌ఎల్ లతో మళ్లీ ఆన్‌లైన్‌లోకి ప్రత్యక్షమైనా... వాటిని కూడా ఆటోమేటిక్‌గా బ్లాక్ చేసే చట్టపరమైన అధికారం లభిస్తుంది.
గతంలో అనిల్ కపూర్ వంటి బాలీవుడ్ దిగ్గజాలు పొందిన తరహా లీగల్ ప్రొటెక్షన్‌ను ఇప్పుడు టాలీవుడ్ నుండి నాగచైతన్య సాధించడం దక్షిణ భారత సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసు తదుపరి విచారణలో ఆన్‌లైన్ దుర్వినియోగం.... అనుమతి లేని కమర్షియల్ మార్కెటింగ్‌పై పర్సనాలిటీ రైట్స్ చట్టం పరిధిని కోర్టు మరింత లోతుగా పరిశీలించనుంది. సాంకేతికత పెరిగిన తరుణంలో ఏఐ పేరిట సెలబ్రిటీల ఇమేజ్‌తో ఆడుకునే వారికి.... డిజిటల్ లూప్‌హోల్స్‌ను వాడుకునే వారికి ఈ తీర్పు ఒక బలమైన హెచ్చరిక అని చెప్పవచ్చు.