హ్యాపి Bడే చై.. నెమ్మదిగా అయినా సాలిడ్‌గా
ఏఎన్నార్ నటవారసుడిగా కింగ్ నాగార్జున తన తండ్రి లెగసీని ముందుకు నడిపించడంలో గ్రాండ్ సక్సెసయ్యారు.;
ఏఎన్నార్ నటవారసుడిగా కింగ్ నాగార్జున తన తండ్రి లెగసీని ముందుకు నడిపించడంలో గ్రాండ్ సక్సెసయ్యారు. అయితే నాగార్జున లెగసీని ముందుకు నడిపించేందుకు వారసుడు నాగచైతన్య ఏం చేసాడు? అతడు తన తండ్రి వారసత్వాన్ని నిలబెట్టేంత పెద్ద స్టార్ అయ్యాడా? .. ఈ ప్రశ్నకు సమాధానం టకీమని చెప్పడం సరికాదు. నాగార్జున కాలానికి, నాగచైతన్య కాలానికి చాలా వైరుధ్యాలున్నాయి. తెలుగు సినిమా రంగం వృద్ధి క్రమంలో ఆరంభ యుగంలో ఉన్నప్పుడు అక్కినేని వారసుడిగా నాగార్జున అగ్ర హీరోగా ఎదిగేందుకు చాలా ఏళ్ల పాటు శ్రమించాల్సి వచ్చింది. అరడజను సినిమాలు చేసినా సరైన బ్లాక్ బస్టర్ లేదు. అయినా పట్టుదలగా నాగార్జున తనను తాను నిలబెట్టుకున్న రోజులను కచ్ఛితంగా గుర్తు చేసుకోవాలి.
కానీ నాగచైతన్య వచ్చే సమయానికి కాంపిటీషన్ కూడా చాలా ఠఫ్ గా మారిపోయింది. తెలుగు సినీరంగంలో నటవారసులే కాదు, బయటి వ్యక్తులు కూడా నిరూపించుకోవచ్చని అప్పుడప్పుడే ఈ రంగంలోకి అడుగుపెడుతున్న చాలా మంది యువహీరోలు నిరూపించారు. అలాంటి పోటీలో చైతూ తన ఎంపికలతో నెమ్మదిగా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఆరంభం అందరిలాగే కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా తన మార్కెట్ ని నెమ్మదిగా పెంచుకుంటూ ఒక్కో అడుగు ముందుకు వేసాడు. వేట నెమ్మదిగా సాగించినా సాలిడ్ గా పట్టాలి! అన్న తీరుగా సాగింది చై ప్రయాణం. ఇటీవలి కాలంలో అతడు బండిని పట్టాలెక్కించి సక్సెస్ దారిలోకి తెచ్చిన తీరు నిజంగా ఆశ్చర్యపరుస్తోంది. ఏఎన్నార్ మనవడిగా, నాగార్జున కుమారుడిగా నాగచైతన్య తన తలపై ఉన్న బరువును సమర్థంగా మోయడంలో టెక్నిక్ ని కనిపెట్టాడు. అతడు అంతకంతకు స్థాయిని చాలా తెలివిగా పెంచుకుంటూనే ఉన్నాడు. తన పరిధిని విస్తరించేందుకు అహర్నిశలు హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా ఇతర హీరోల కంటే భిన్నమైన ఎంపికలతో అతడు ప్రతిసారీ ఆశ్చర్యపరుస్తున్నాడు.
జోష్ సినిమాతో 2009లో అతడు కెరీర్ ప్రారంభించాడు. ఇప్పటికే 16 ఏళ్ల కెరీర్ అజేయంగా ముందుకు సాగింది. ఇప్పుడు చై వయసు 39. అతడు తనను తాను సినీవినీలాకాశంలో ఇతర అగ్ర హీరోలకు ధీటుగా తీర్చిదిద్దుకునేందుకు ఇంకా ఇంకా చాలా స్కోప్ ఉంది. ఇటీవలి కాలంలో అతడి కథల ఎంపికలు, మ్యానరిజమ్స్ లేదా బాడీ లాంగ్వేజ్, స్టైల్ ఎలివేషన్, మాస్ కోసం తపించే తీరు ప్రతిదీ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అతడి కెరీర్ రన్ మొత్తాన్ని ఒకసారి పరిశీలిస్తే, అతడు మారిన తీరు కూడా అర్థమవుతుంది.
నిజానికి ఆరంగేట్ర చిత్రం జోష్ (2009) లో క్యాంపస్ రాజకీయాలను, అవినీతిని సవాలు చేసే కళాశాల విద్యార్థి సత్యగా చైతూ నటించాడు. విద్యార్థిగా చాలా సింపుల్ గా ఆత్మవిశ్వాసంతో కనిపించాడు చై. తన నటనకు గాను ఆ ఏడాది ఉత్తమ మేల్ డెబ్యూ హీరో (సౌత్)గా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నాడు. సంవత్సరాలుగా ఈ చిత్రం యువతలో కల్ట్ ఫాలోయింగ్ ని అందించింది. ఆ తరవాత చైతన్యను క్లాస్ హీరోగా పెర్ఫామర్ గా ఆవిష్కరించిన సినిమా -యే మాయ చేసావే (2010). చైతన్యకు చాక్లెట్ బోయ్, లవర్ బోయ్ ఇమేజ్ తెచ్చిన చిత్రమిది. గాళ్స్ అతడంటే పడి చచ్చే లెవల్ వచ్చింది. నాగ చైతన్యను అగ్రశ్రేణి రొమాంటిక్ హీరోల లీగ్‌లోకి తీసుకెళ్లిన చిత్రంగా ఇది నిలిచింది. కార్తీక్ పాత్రను చైతన్య అద్భుతంగా పోషించాడు. ముఖ్యంగా డెబ్యూ నటి సమంతతో అతడి రొమాన్స్ ఒక రేంజులో వర్కవుటైంది.
సుకుమార్ దర్శకత్వం వహించిన `100 పర్సంట్ లవ్` (2011) చైతూ కెరీర్ బెస్ట్ హిట్ చిత్రాలలో ఒకటి. ఇది అతడిలోని చిలిపి నటుడికి ఎలివేషన్ ఇచ్చిన సినిమా. మరదలు తమన్నాతో పోటీపడేవాడిగా పర్ఫెక్షనిస్టు అయిన బాలు పాత్రలో చైతన్య సరదాగా, రిఫ్రెషింగ్ పాత్రను పోషించాడు. అతని కామెడీ టైమింగ్, ఎనర్జీ ఈ చిత్రాన్ని పెద్ద హిట్‌గా మార్చాయి. ముఖ్యంగా స్కూల్, కాలేజ్ యూత్ పిచ్చిగా అతడిని ప్రేమించేలా చేసింది.
ఆ తర్వాత తాత ఏఎన్నార్, తండ్రి నాగార్జునతో కలిసి మనం (2014) చిత్రంలో నటించాడు నాగచైతన్య. ఇందులో అఖిల్ కూడా మెరుపులాగా ఎంట్రీ ఇచ్చాడు. అక్కినేని మనం డైరెక్టర్ విక్రమ్ కుమార్ రేంజు ఏంటో పరిచయం చేసింది. అతడు మూడు తరాల హీరోలను తెరపై ఎంతో అందంగా చూపించాడు. ఆహ్లాదకరమైన కథ, కథనం టేకింగ్ తో మైమరిపించాడు. ఒక అరుదైన భావోద్వేగ డ్రామాతో సినిమాని రీడిఫైన్ చేసాడు. ఇది తెలుగు సినిమాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. క్యాన్సర్ తో అక్కినేని మరణానికి ముందు ఇది తీపిగురుతుగా నిలిచింది.
ఆ తర్వాత కూడా గౌతమ్ మీనన్ తో కలిసి పని చేసే అవకాశం చైతన్యను వరించింది. ఈ కాంబినేషన్ లో `సాహసం శ్వాసగా సాగిపో` (2016) మరో క్లాసిక్ గా నిలిచింది. ప్రేయసితో ప్రేమికుడి రోడ్ ట్రిప్ ఎలాంటి ప్రమాదకర మలుపు తీసుకుంది? అనే పాయింట్ తో గౌతమ్ మీనన్ చాలా మ్యాజిక్ చేసాడు. యాక్షన్, రొమాన్స్, థ్రిల్స్ ని జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంది. రొమాంటిక్-థ్రిల్లర్ జానర్ లో చైతన్య నటుడిగా మరో మెట్టు ఎక్కాడు.
ఆ తర్వాత చైతన్య కెరీర్ లో మరో కీలక మలుపునిచ్చిన సినిమా ప్రేమమ్ (2016). మలయాళ క్లాసిక్ ప్రేమమ్ అదే టైటిల్ తో తెలుగు రీమేక్ అయింది. ఇందులో నాగ చైతన్య తనలోని అసలైన నటుడిని బయటకు తీసాడు. విక్రమ్‌గా, ప్రేమ, బ్రేకప్, యవ్వనంలో సరిగమలతో స్వీయ-ఆవిష్కరణలతో ముందుకు సాగే యువకుడి పరిణామాన్ని తెరపై అందంగా పొందుపరిచారు. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. యూత్ పిచ్చిగా ఈ సినిమాని థియేటర్లలో ఆదరించారు.
చై కెరీర్ లో మరో ముఖ్యమైన సినిమా -మజిలి (2019). తన కెరీర్‌లో అత్యుత్తమ నటనతో అలరించాడు చైతూ. మజిలి భార్యభర్తల కథ. ఇందులో సమంతతో కలిసి నటించాడు. చాలా ఎమోషనల్ సన్నివేశాలలో చైతన్య నటనను అభిమానులు మర్చిపోలేరు. పూర్ణ పాత్రలో అతడు తన బెస్ట్ ఇచ్చాడు. చైతన్య రా అండ్ రస్టిక్ పెర్ఫామెన్స్ తోను విమర్శకుల ప్రశంసలు పొందాడు.
ఆ తర్వాత శేఖర్ కమ్ములతో లవ్ స్టోరీ (2021) మరో బెంచ్ మార్క్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. లవ్ స్టోరీలో రేవంత్‌గా అతడి నటనకు మంచి పేరొచ్చింది. నాగ చైతన్య సాలిడ్ పెర్ఫామెన్స్ ని ప్రదర్శించాడు. సాయి పల్లవితో అతడి సహజ సిద్ధమైన కెమిస్ట్రీ, లవ్ ఎపిసోడ్స్ పెద్దగానే వర్కవుటయ్యాయి. ఈ జంటకు అన్ని వర్గాల ఆడియెన్ నుంచి ప్రశంసలు కురిసాయి.
నాగచైతన్య కెరీర్ లో `తండేల్` (2025) చాలా ప్రత్యేకమైన సినిమా. నిజ సంఘటనల నుండి ప్రేరణ పొందిన ఒక రొమాంటిక్ యాక్షన్ డ్రామా ఇది. ఇందులో కఠినమైన జీవిత సత్యాలను భావోద్వేగభరితంగా ఎలివేట్ చేయడంలో దర్శకుడు చందు మొండేటి పనితనాన్ని తక్కువ చేయలేం. రొమాంటిక్-యాక్షన్ డ్రామాలో నాగ చైతన్యను ఇప్పటివరకు తన బెస్ట్ ఇచ్చేలా తీర్చిదిద్దాడు చందూ. ఒక మత్స్యకారుడిగా మాస్ లుక్ లో కనిపించేందుకు నాగచైతన్య చాలా శ్రమించాడు. అంతర్జాతీయ సముద్ర జలాలలో చిక్కుకున్న జాలరిగా అతడు భావోద్వేగంతో ముడిపడిన నటనలోకి పరకాయం చేసిన తీరు అందరినీ కదిలించింది. చైతన్య కెరీర్ బెస్ట్ హిట్ చిత్రంగా ఇది రికార్డులకెక్కడానికి ఈ చిత్రంలో నటీనటుల పెర్ఫామెన్సెస్ ప్రధాన కారణం.
విక్రమ్.కె రూపొందించిన వెబ్ సిరీస్ `ధూత` (2023)లో నాగ చైతన్య సాగర్ వర్మ అవుధురి అనే జర్నలిస్ట్ పాత్రను పోషించాడు. జర్నలిజం నేపథ్యంలోని ఈ సిరీస్ క్రిటిక్స్ ప్రశంసలు దక్కించుకుంది. కలవరపెట్టే కథనాలతో వార్తాపత్రిక అంచనాలు, మార్మికమైన సంఘటనలతో సిరీస్ ఆద్యంతం రక్తి కట్టిస్తుంది. ఇందులో గ్రేషేడ్ ఉన్న పాత్రలో చై నటనకు మంచి పేరొచ్చింది. సిరీస్‌లో అతడి నటన గొప్ప చర్చనీయాంశమైంది. చైతన్య కెరీర్ లో మునుముందు ఇంకా బెస్ట్ పెర్ఫామెన్సెస్‌ని ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. చైతన్య స్థిరమైన ప్రదర్శనలు, విజయాలతో ఈ స్థాయికి ఎదిగాడు. నెక్ట్స్ లెవల్ ఏంటో చూపించేందుకు ఇకపైనా అతడు సాహసాలు చేయాల్సి ఉంది. నేడు (23 నవంబర్) పుట్టినరోజు జరుపుకుంటున్న చైతన్యకు ప్రత్యేక శుభాకాంక్షలు.